Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజాన్ ముస్లిం సోదరులకు పవిత్రమైన మాసం. పగలంతా రోజా (ఉపవాసం) పాటించి సాయంత్రం ఇప్తార్లో ఆహారాన్ని తీసుకుంటారు. పొద్దున్నుండి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది. అందుకే వారు ఇఫ్తార్‌లో మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటారు. రకరకాల పండ్లు, వెంటనే శక్తినిచ్చే ఖర్జూరాలు, అంజీర వంటివి తీసుకుంటారు. హలీమ్‌లో కూడా మంచి పోషక విలువలున్నాయి. పప్పు ధాన్యాలు, మాంసం వేసి వండం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వెంటనే సమకూరుతుంది. అటువంటి పోషకాలు కలిగిన హలీమ్‌ని రంజాన్ మాసం ప్రతి ఒక్కరూ తప్పక రుచి చూస్తారు. ప్రస్తుతం కరోనా కారణంగా బయటి ఆహారానికి దాదాపు దూరంగా ఉంటున్నాం. కాబట్టి కాస్త ఓపిక చేసుకుని ఇంట్లోనే హలీమ్ చేసుకుంటే తృప్తిగా తినొచ్చు. మరి ఎలా చెయ్యాలో తెలుసుకుందామా...
వెజ్ హలీం
కావల్సిన పదార్థాలు: సన్న గోధుమ రవ్వ - 1/3 కప్పు, ఓట్స్ - 1/4 కప్పు, కందిపప్పు - అర టేబుల్ స్పూను, శనగపప్పు - అర టేబుల్ స్పూను, బాదం పప్పులు - ఆరు, జీడి పప్పులు - ఆరు, పిస్తా - ఆరు, ఎండు గులాబీ రెక్కలు - పావు కప్పు, లవంగాలు - ఆరు, యాలుకలు - ఆరు, మిరియాలు - టేబుల్ స్పూను, దాల్చిన చెక్క - రెండు అంగుళాలు, జీలకర్ర - అర టీ స్పూను, నీరు - 500 మి.లీ.
సోయా గ్రాన్యూల్స్ మరిగించుటకు: సోయా గ్రూన్యూల్స్ - అర కప్పు, నీరు - ఒకటిన్నర కప్పు, ఉప్పు - తగినంత.
హలీం తయారీ కొరకు: కొత్తిమీర తరుగు - అర కప్పు, పుదీనా - అర కప్పు, వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు - 1/3 కప్పు, పచ్చిమిర్చి - ఐదు, అల్లం వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూను, నెయ్యి - అర కప్పు, కిస్మిస్ - టేబుల్ స్పూను. గరమ్ మసాలా దినుసులు - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - సరిపడా.
సర్వింగ్ కొరకు: నెయ్యి - టేబుల్ స్పూను, వేయించిన జీడిపప్పు - పావు కప్పు, వేయించిన ఉల్లిగడ్డ - పావు కప్పు, పుదీనా - పావు కప్పు, కొత్తిమీర - పావు కప్పు, నిమ్మకాయం - ఒకటి.
హలీం మిక్స్ తయారీ: గోధుమ రవ్వ, ఓట్స్, కందిపప్పు, పచ్చి శనగలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, జీలకర్ర మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఆ పొడిలో అర లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి.
సోయా గ్రాన్యూల్స్‌ని ఉడికించుట: ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్ వేసి రెండు మూడు సారుల కడగాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీళ్ళు ఒంపేసి రన్నింగ్ టాప్ కింద పెట్టి సోయా గ్రాన్యూల్స్‌ని బాగా కడిగి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
హలీం తయారు చేసే విధానం: ఓ మందపాటి పాత్రలో నెయ్యి వేసి కరిగించాలి. అందులో నాలుగు లవంగాలు, యాలుకలు, కిస్మిస్, దాల్చినచెక్క, మిరియాలు వేసి ఒక నిమిషం వేయించాలి. తర్వాత బ్రౌన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న హలీం మిక్స్‌ను అందులో పోయాలి. అర లీటరు నీళ్ళు పోసి బాగా కలిపి ఉప్పు సరిచూసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి సన్నని సెగ మీద 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ కట్టేసుకోవాలి.
సర్వింగ్: ఒక ప్లేటులో రెండు నుండి మూడు గరిటెల హలీమ్ వేసి అందులో టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. పైన వేయించిన ఉల్లిగడ్డ, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, నిమ్మ చెక్క ఉంచి వేడిగా సర్వ్ చేయాలి.
మటన్ హలీం
కావల్సిన పదార్థాలు: మాంసం - రెండు కేజీలు, పలుకుల్లా చేసుకున్న గోధుమలు - మూడు కప్పులు, అల్లం వెల్లుల్లి ముద్ద - నాలుగు టేబుల్ స్పూన్లు, మినప్పప్పు, శనగపప్పు - అరకప్పు చొప్పున, పెరుగు - ఒకటిన్నర కప్పు, వేయించిన ఉల్లిగడ్డలు - కప్పు, జీడిపప్పు - అరకప్పు, సాజీరా - చెంచా, యాలకులు - రెండు, గులాబీ రేకలు - యాభై గ్రాములు, లవంగాలు - రెండు, దాల్చిన చెక్క - చిన్నముక్క (ఈ రెండింటినీ కలిపి పొడి చేసుకోవాలి), మిరియాలు - చెంచా, దాల్చినచెక్క - రెండు అంగుళాలు, లవంగాలు - రెండు మూడు, యాలకులు - రెండు, నెయ్యి - అరకప్పు, కొత్తిమీర తరుగు - కప్పు, పుదీనా ఆకులు - పావుకప్పు, పచ్చిమిర్చి - ఐదారు, ఉప్పు - సరిపడా, నూనె - అరకప్పు, పోట్లీ మసాలా - కొద్దిగా (వేడి నీటిలో వేసుకోవాలి. ఇది బజార్లో దొరుకుతుంది)
తయారు చేసే విధానం: గోధుమల్ని నీటిలో అరగంటసేపు నానబెట్టాలి. మాంసాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మాంసం ముక్కలకు సరిపడా అల్లం వెల్లుల్లి ముద్ద, చెంచా ఉప్పు చేర్చి బాగా కలిపి ఉడికించి పెట్టుకోవాలి. అలాగే గోధుమలు, పప్పులు, మూడు నాలుగు పచ్చిమిర్చి, అరచెంచా మిరియాలు, ఎనిమిది నుంచి పది కప్పుల నీళ్లు తీసుకుని అరగంట సేపు ఉడికించాలి. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు, ఉల్లిగడ్డ ముక్కలు, గులాబీ రేకలు, మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. రెండు మూడు నిమిషాలయ్యాక పెరుగు చేర్చి మరో పదిహేను నిమిషాలు వేయించాలి. ఇందులో మూడు కప్పుల పోట్లీ మసాలా, నీళ్లు వేసి బాగా మరిగించాలి. ఉడికించిన గోధుమ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేయాలి. అవసరమైతే మరికాస్త ఉప్పు కూడా చేర్చి అరగంట పాటు పొయ్యి మీద ఉంచాలి. దింపే ముందు మిగిలిన నెయ్యి వేస్తే సరి... వేడివేడి మటన్ హలీమ్ సిద్ధం.
చికెన్ హలీం
కావల్సిన పదార్థాలు: బోన్ లెస్ చికెన్ - అర కేజీ, గోధుమ రవ్వ - 250 గ్రాములు, సెనగపప్పు - ఐదు టేబుల్ స్పూన్లు, బియ్యం - ఐదు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - ఐదు, అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా - అర కప్పు, కొత్తిమీర - అర కప్పు, ఉల్లిగడ్డ - రెండు, పెరుగు - కప్పు, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను, కారం - రెండు టీ స్పూన్లు, గరం మసాలా - టీస్పూన్లు, మిరియాలపొడి - అర టీస్పూను, సొంటి పొడి - అర టీస్పూను, పోట్లీ మసాలా - చిన్న పాకెట్, లవంగాలు - ఎనిమిది, దాల్చిన చెక్క - 3/4 ముక్కలు, యాలకులు - ఎనిమిది, షాజీరా - రెండు టీస్పూన్లు, నూనె - 1/4 కప్పు, నెయ్యి - ఐదు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: కుక్కర్లో శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, సెనగపప్పు, బియ్యం, చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద, పైన చెప్పిన మసాలా దినుసులలో సగం (యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీరా), సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, సగం కొత్తిమీర, సగం చెంచాడు పసుపు వేయాలి. ఇందులో బైట మార్కెట్లో దొరికే పోట్లీ మసాలా ఒక సన్నటి బట్టలో మూట కట్టి వేసి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మూత తీసి గోధుమ రవ్వ వేసి కలిపి మూత పెట్టి మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్లీ మసాలా మూట తీసేసి ఉడికిన చికెన్ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఇందులో మిగిలిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీర, అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన పచ్చిమిర్చి నూరి వేసి కొద్దిగా వేగాక కారం, మిరియాలపొడి, సొంటిపొడి, గరం మసాలాపొడి వేసి కలుపుతూ వేయించాలి. ఇందులో కప్పుడు పెరుగు వేసి కలపాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు వేసి సన్నని మంటమీద కలుపుతూ నిదానంగా ఉడికించాలి. హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, మిగిలిన కొత్తిమిర, పుదీనా నూనెలో కరకరలాడేలా వేయించి పెట్టుకోవాలి. హలీమ్ మొత్తం ఉడికి నూనె, నెయ్యి కలిసి పైకి తెలుతుండగా దింపేసి సర్వింగ్ బౌల్లో వేసి వేయించిన ఉల్లిగడ్డ, కొత్తిమిర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయాలి.