Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ కొత్త బలం పుంజుకొని మరల ప్రళయ భీకరంగా గర్జిస్తున్నది. దాని వలలో చిక్కిన ప్రజలు విలవిల లాడుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అత్యధిక కేసులతో ముందంజలో ఉన్నది. ఢిల్లీలో ఒక్కరోజులోనే ఇరవై నాలుగు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తున్నది. ఒక పక్క వాక్సినేషన్ కొనసాగుతూనే ఉన్నా కూడా వైరస్ తన ఉధృతిని ఏ మాత్రం తగ్గించలేదు. మే నెల ఒకటో తేదీ నుంచి 18 ఏండ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. చాలా నగరాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నారు. ఆక్సిజన్లు అందక, ఆసుపత్రులలో బెడ్లు సరిపోక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అందుకే మనం బయటకు వెళ్ళకపోవటం చాలా మంచిది. మనల్ని కాపాడేది ఎవరంటే మాస్కులు, శానిటైజర్లు, వ్యాక్సిన్లు మాత్రమే. ఇంట్లో ఉన్న ఖాళీ సమయాన్ని ఇంట్లో ఉన్న పాత వస్తువులనే కొత్తగా తయారు చేసి సంతోషాన్ని పొందుదాం.
మోరంగడ్డలతో...
మోరంగడ్డల్ని చిలకడదుంపలనీ, గెనుసు గడ్డలనీ కూడా అంటారు. వీటిల్లో పీచు మోతాదు ఎక్కువ. నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కాలరీలు విడుదల అయ్యేలా చేయటం మూలంగా బరువు తగ్గాలనుకునే వారు దీనిని ఎక్కువడగా తీసుకుంటారు. దీని శాస్త్రీయ నామం ''ఐపోమియా బటాటస్'' అంటారు. దీనిలో విటమిన్ బి6 ఎక్కువగా ఉండటం వల్ల గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉండేలా చేస్తుంది. నాకు ఇంట్లో ఈ మోరంగడ్డలు ఉంటే ఏదో బొమ్మ చెయ్యాల్సిందే. ఇంతకు ముందు డైనోసార్ల కుటుంబాన్ని తయారు చేశాను. ఇప్పుడు ఒక పక్షిని తయారు చేద్దామనుకున్నాను. ఎందుకంటే పక్షి మెడలా వంపు తిరిగిన గడ్డ ఉన్నది. అప్పుడు చిన్న తలలా ఉన్న వైపు కండ్లుగా సగ్గుబియ్య గింజల్ని పెట్టాను. నోరు దగ్గర కత్తితో గాటు పెట్టి ఒక పచ్చిమిర్చి ముక్కను ముక్కువలె అమర్చాను. నేను బొమ్మ చేద్దామని పక్కకు పెట్టినపుడు కూర వండటానికి పనమ్మాయి దాన్ని మధ్యకు విరిచింది. దాంతో ముక్కు, శరీరం మాత్రమే ఉండటంతో ఒక కొబ్బరి పిందెను దానికి జత చేశాను. ఆ తర్వాత తోక కోసం చక్కని చెట్టు ఆకులు దొరికాయి. ఈ చెట్టు పేరేమిటో తెలియదు గానీ ఆకులు పాకే పాముల్లా ఉన్నాయి. వీటిని తోకవలె అమర్చాను. పక్షికి ప్రాణం పోశాను.
దానిమ్మ పిందెలతో
మా ఇంట్లో ఉన్న దానిమ్మ చెట్టుకు విపరీతంగా పిందెలు వేశాయి. సింధూర వర్ణపు పూలు, మొగ్గలు, ఆకుపచ్చని ఆకుల మధ్య అందంగా కనిపిస్తుంటాయి. నేను ఎప్పుడూ చూసే చూపుకీ, ఈ రోజు బొమ్మ చేయాలనే చూపుకీ తేడా కన్పించింది. ఆ పిందెలు నాకు కలశాలుగా కన్పించాయి. వెంటనే వాటిని తెంపి శ్రీరామనవమికి దేవుడి దగ్గర పెట్టాను. పదకొండు పిందెల్ని కలశాలుగా పెట్టి పూజించాను. ఆ తర్వాత వాటిని ఒక ఎగ్ట్రేలో అమర్చాను. మధ్యలో ఎర్రటి పువ్వును కూడా పెట్టాను. చాలా అందంగా కనిపించింది. దానిమ్మ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది. భారతదేశంలో ఇది ఖరీదైన ఫలము. ఇందులో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తసరఫరాను తగినంత వేగంగా ప్రసరింప చేస్తుంది. తేమ లేని పొడి వాతావరణం దానిమ్మ సాగుకు బాగా తోడ్పడుతుంది.
బొప్పాయి ఆకులతో
మనకు తెలిసిన ఆకుల్లో బొప్పాయి, కాకర ఆకులు చాలా అందంగా ఉంటాయి. ఒక చేయి తిరిగిన కళాకారుడెవరో కత్తెరతో చక్కగా కత్తిరించినట్టు అందమైన డిజైన్లతో ఉంటాయి. మా చిన్నప్పుడు కాకర ఆకును చేతి మీద పెట్టి దానిపై గోరింటాకు ముద్దను పెట్టుకునే వాళ్ళం. డిజైన్లు మనం వెయ్యకుండానే కాకర ఆకు ఏర్పరచేది. అలాగే ఇప్పుడు నాకు బొప్పాయి ఆకు దొరికింది. ఎలా పెరిగిందో ఏమో మా హాస్పిటల్ సందులో బండల మధ్యలో నుంచి మొలుచుకు వచ్చింది. మావారి రూము కిటికీలో నుంచి లోపలకు ఓ కొమ్మ దూసుకు వచ్చింది. నా కోసమే వచ్చిందనుకుని ఒక ఆకును కోసుకున్నాను. ఒక ఫ్లోరల్ డిజైన్ చేద్దామని దాచాను. ఇంకా ఆర్నమెంటల్ చెట్ల నుంచి నిండు ఆకుపచ్చ, చిలకాకుపచ్చ రంగులు కలగలిసిన ఆకుల్ని కూడా తెచ్చాను. ఇవి ఐదారు ఆకులు ఒక ఒకే గుచ్ఛంలో ఉంటాయి. బొప్పాయి ఆకుకు కింద రెండు వైపులా అమర్చాను. సన్నని పాముల్లాంటి ఆకులున్న వాటిని తెచ్చి అక్కడక్కడా అమర్చాను. దాని మధ్యలో వాటర్ క్యాన్ మూత ఒకటి పెట్టి, దానిపై ఒక వాటర్ బాటిల్ మూతను కూడా పెట్టాను.. చూడండిప్పుడు.
టాబ్లెట్ల స్ట్రిప్పులతో
ఇదే మంద పెద్ద కళాఖండం కాదు గానీ టాబ్లెట్ల స్ట్రిప్పులతో చేయడం కొత్తగా అనిపించింది. పిల్లల చేత ఇలా అమర్చటం నేర్పిస్తే వాళ్ళ బిల్డింగ్ బ్లాకుల్లాగానే ఆడుకుంటారు. ఇంట్లో టాబ్లెట్లు వేసుకోవటం అయిపోగానే వాటిని పారేయకుండా ఒక చోట దాయాలి. నేను ఇంతకు ముందు టాబ్లెట్ స్ట్రిప్పులను కత్తిరించి ఎన్నో చేశాను, హాస్పిటల్ వేస్ట్‌ను ఉపయోగించే క్రమంలో. ఇప్పుడు ఊరికేర వీటన్నింటిని ఒక చోట చేర్చి ఇల్లులా చూపాను. టాబ్లెట్ల స్ట్రిప్పుల ఇల్లు బాగుందా! చూడండీ!
వాటర్ క్యాన్ రింగులతో
బిస్లెరీ వాటర్ క్యాన్లు పెద్దవి తెచ్చుకున్నపుడు వాటి మూత సీల్ తీసేటపుడు ఆకుపచ్చని గాజుల్లాంటి నిర్మాణాలు బయటకు వస్తాయి. వాటినన్నింటిని ఒక చోట దాచి వాటితో డిజైను చేశాను. వీటికోసం ఇంకా కొన్ని పనికి రాని సామాన్లు సేకరించాను. అందులో ఐస్‌క్రీం పుల్లలు, ముందుగా తెచ్చుకున్నాను. వీటికి రకరకాల రంగులు వేసి ఎండబెట్టాను. ఒక రోజంతా ఆరాలి. తర్వాత ఫోమ్ షీటుతో పువ్వులు చెయ్యాలి. రంగుల ఫోమ్ షీట్లను తెచ్చుకుని వాటిని కత్తిరించి పువ్వలుగా మలచలి. ఒక పెద్ద ఫోమ్ షీటు తీసుకొని దానిపై వాటర్ క్యాన్ రింగులు, ఐస్‌క్రీం పుల్లలు, ఫోమ్ షీటు పువ్వులు అన్నింటినీ అతికించాను. ఒక అందమైన డిజైను తయారయింది.