Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విజృంభిస్తోంది. ఈ విపత్కర సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే కరోనా వంటి అంటువ్యాధులను సులభంగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల కొన్ని పానీయాలు ఉన్నాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఇమ్యూనిటీని మరింత బలోపేతం చేస్తాయి. మన వంటగదిలో తరుచూ ఉపయోగించే పదార్థాలతోనే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
పసుపు టీ: దీన్ని పసుపు, తేనె, నిమ్మకాయలతో తయారు చేస్తారు. పసుపులో కర్కుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులోని బలమైన వ్యాధి నిరోధక లక్షణాలు మంట, నొప్పి తట్టుకునేలా శరీరాన్ని తయారు చేస్తాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. ముందుగా పసుపు నీటిలో కలిపి 15 నుండి 20 నిమిషాల పాటు వేడిచేయాలి. రుచి కోసం దానిలో నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవాలి.
మసాలా టీ: రోగనిరోధక శక్తిని పెంచే మసాలా టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన అన్ని పదార్థాలు మన వంటగదిలోనే లభిస్తాయి. ఈ టీ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనికి ఇన్ఫెక్షన్లను నివారించే శక్తి ఉంటుంది. దీనిలో తేనె కలపడం వల్ల రుచితో పాటు మరింత శక్తి వస్తుంది. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మసాలా టీ కోసం ముందుగా తురిమిన అల్లం, దాల్చినచెక్క, మిరియాలు, లవంగాలు, ఏలకులు, తులసి ఆకులను అర కప్పు నీటిలో వేసి 30 నిమిషాలు ఉడకబెట్టండి. కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసి తీసుకోండి.
గ్రీన్ స్మూతీ: ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం వేసవిలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి కడుపులో మంటను కూడా నివారిస్తాయి. అంతేకాక శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే శక్తినిస్తాయి. దీని తయారీ కూడా చాలా సులభం. ముందుగా కొంచెం బచ్చలికూర, మామిడి లేదా పైనాపిల్, నిమ్మరసం, తాజాగా తరిగిన అల్లం, బాదం పాలు లేదా పెరుగు తీసుకొని మిక్సర్‌లో కలపండి. ఆ మిశ్రమాన్ని తాగండి.
తేనె, నిమ్మరసం: గొంతు నొప్పి, దగ్గుకు చెక్ పెట్టేందుకు తేనె, నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఇది అనేక వ్యాధులకు చికిత్స చేయడమే కాకుండా, శ్వాసకోశాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీని తయారీ కూడా చాలా సులభం. ముందుగా ఒక లోతైన గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు తీసుకొని దానిలో తురిమిన అల్లం, ఒక అంగుళం దాల్చిన చెక్క, తరిగిన మూడు వెల్లుల్లి లవంగాలు, ఒక టీస్పూన్ పుదీనా రసం, నిమ్మరసాన్ని కలపండి. కొన్ని నిమిషాల వేచి చూసి అది చల్లబడిన తర్వాత.. దానిలో తేనె వేసి తాగండి.