Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్మి భర్త గుండె పోటుతో చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు. భర్త ద్వారా వస్తున్న పెన్షన్, ఊళ్ళో ఉన్న పొలం డబ్బులతో ఇద్దరు ఆడపిల్లల్ని ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకుంది. పెద్ద కూతురు గీత ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. నెలకు ముఫ్పైవేలు జీతం. రెండో అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఇలా ముగ్గురి జీవితాలు హాయిగా సాగిపోతున్నాయి. అలాంటి సమయంలోనే పవన్ రూపంలో ఓ ఉప్పెన గీత జీవితాన్ని ముంచేసింది. గీతను ఆ సైకో బారి నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక ఆ తల్లి తల్లడిల్లింది. అలాంటి సమయంలోనే సలహా కోసం గీతను తీసుకుని లక్ష్మి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి సమస్యను ఇలా చెప్పుకొచ్చింది.
''మేడమ్, మా వారు చనిపోయేనాటికి మా పెద్దపాపకు పదేండ్లు, చిన్నపాపకు ఏడేండ్లు. అప్పటి నుంచి పిల్లలే నా ప్రపంచం. మా పెద్దమ్మాయి గీత ఇంజినీరింగ్ చదివే రోజుల్లో పవన్ అనే అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోవడంతో చదువు పూర్తయిన తర్వాత పెండ్లి చేయాలనుకున్నాం. అయితే మా గీతకు వెంటనే ఉద్యోగం వచ్చింది. ఆ అబ్బాయికి రాలేదు. దాంతో ఓ ఏడాది పెండ్లి ఆపాలనుకున్నాం. కానీ వెంటనే చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. పైగా పవన్ గీతతో ''ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు మారిపోయావు'' అంటూ మాట్లాడేవాడు. దాంతో ఎలాగో అమ్మాయికి ఉద్యోగం ఉంది కదా, తర్వాత అతనికీ వస్తుందిలే అని పెండ్లి చేయాలనుకున్నాం.
పెండ్లి పదిరోజులు ఉందనగా పవన్‌తో పాటు అతని తమ్ముడు, మరదలు ఉద్యోగ ప్రయత్నాల కోసం చెన్నై వెళుతుంటే వారితో కలిసి మా చిన్నమ్మాయి కూడా వెళ్ళింది. అక్కడ మా అమ్మాయి పవన్‌తో చాలా గౌరవంగా మాట్లాడుతుంటే ''వాడికెందుకు అంత గౌరవం ఇస్తున్నావు. వాడికి అంత సీన్ లేదు, ఆడపిల్లల పిచ్చోడు. ఉద్యోగం లేదూ ఏమీ లేదు'' అని అతని మరదలు అన్నదంట. ఆ విషయాలను మా అమ్మాయి ఇంటికి వచ్చిన మాతో చెప్పింది. అతను అలాంటి వాడని తెలిసిన తర్వాత పెండ్లి ఆపేయాలనుకున్నాం. అదే విషయం వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేశాం.
అయితే వాళ్ళు మాత్రం ''మేం ఊళ్ళో అందరికీ పెండ్లి కార్డులు పంచుకున్నాం. ఇప్పుడు ఆగిపోతే మా పరువు పోతుంది. అయినా ఆ అమ్మాయికి మావాడిపై చిన్నప్పటి నుంచి కోపం. అందుకే అన్నీ అబద్ధాలు చెప్పింది. మా వాడు అలాంటోడు కాదు'' అంటూ బతిమలాడుకున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా మేం పెండ్లికి ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళే మా ఇంటికి వచ్చి మా అమ్మాయి కాళ్ళు పట్టుకున్నారు. ''పెండ్లి తర్వాత నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. దానికి పూర్తి బాధ్యత మాది. ఏదైనా తప్పుచేస్తే మా కొడుకునైనా వదులుకుంటాం, నిన్ను మాత్రం వదులుకోం'' అంటూ గీతను బతిమలాడుకున్నారు. వాళ్ళు అంతగా చెప్పే సరికి పెండ్లికి ఒప్పుకున్నాం.
పెండ్లి మా ఊళ్ళోనే చేశాం. తర్వాత పదిరోజులు అక్కడే ఉన్నాం. గీత, పవన్ మాత్రం సిటీకి వచ్చి మా ఇంట్లో ఉన్నారు. మేం సిటీకి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం మాట్లాడుకున్నా సాయంత్రం ఇంటికి వచ్చి ''ఏంటి ఈ రోజు ఈ విషయాలు మాట్లాడుకున్నారు'' అంటూ గీతను అడిగేవాడు. అతనికి మేం మాట్లాడుకున్న మాటలు ఎలా తెలిశాయో అర్థమయ్యేది కాదు. మేం మా బంధువుల గురించి సరదాగా ఏదైనా కామెంట్ చేసినా ఆ విషయాలను కూడా రికార్ట్ చేసి వాళ్ళకు వినిపించేవాడు. దాంతో వాళ్ళు మాతో మాట్లాడటం మానేశారు. ఇలా అన్ని విషయాలు అతనికి తెలిసిపోయేవి. గీత అడిగితే ''నాకు అన్నీ అలా తెలిసిపోతాయి'' అని చెప్పేవాడు. చివరకు గీత ఎక్కడ కూర్చొని అన్నం తిన్నది, ఎక్కడ పడుకుంది'' ఇవి కూడా చెప్పేవాడు.
దాంతో అతను కెమేరాలు పెట్టి మా వీడియోలు తీస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. ఇదే విషయం అతన్ని అడిగితే గీతను, నన్ను తిట్టాడు. మా చిన్నమ్మాయికి పెండ్లి జరక్కుండా చూస్తానని బెదిరించాడు. దాంతో మా చిన్నమ్మాయిని హాస్టల్లో చేర్పించాం. విడియోలు, రికార్డులు అన్నీ తీసి దాచిపెట్టాడు. గీతతో బెడ్రూంలో ఉన్నప్పుడు కూడా వీడియోలు తీశాడంట. ఇప్పుడు వాటిని నెట్లో అప్లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఎం చేయాలో అర్థం కావడంలేదు. మీరే ఎలాగైనా మమ్మల్ని అతని బారి నుంచి కాపాడాలి'' అంటూ లక్ష్మి ఏడ్చేసింది.
లీగల్‌సెల్ సభ్యులు ఆమెను బయటకు పంపి గీతతో మాట్లాడితే 'ఈ విషయాలన్నీ అతని తల్లిదండ్రులుకు చెబితే ''మగ పిల్లలంటే ఇలాగే ఉంటారు. నువ్వే సర్దుకు పోవాలి' అంటున్నారు. పైగా మాకు ఈ మధ్యనే కొత్త విషయాలు తెలిశాయి. అతనికి మానసికి సమస్యలు కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి దానికోసం మందులు వాడుతున్నారంట. సరే ఎలాగైనా మేమే బాగుచేసుకుందాం అనుకున్నాం. అందుకే అతనితో చాలా ఓర్పుగా ఉండేదాన్ని. ప్రేమించినప్పుడు ఈ విషయాలేవీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. చివరకు హనీమూన్‌కి వెళ్ళినప్పుడు కూడా తింటానికి ఏమైనా తీసుకువస్తానని బయటకు వెళ్ళి నాలుగు గంటలైనా రాలేదు. తర్వాత వచ్చి ''నేను లేనప్పుడు నువ్వు ఏం చేశావు'' అని అడిగేవాడు. నేను చెబుతుంటే మళ్ళీ అతనే అన్నీ చెప్పేవాడు. నేను పక్కనే ఉన్నా వేరే అమ్మాయిలతో, అబ్బాయిలతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడేవాడు. బ్లూ ఫిల్మింలు చూపించేవాడు. ఏది పడితే అది చూపించి వాటి గురించి 'నీకు తెలుసా' అని అడిగేవాడు. ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఏం చేయాలో తోచడం లేదు. పెండ్లి అనే మూడుముళ్ళ బంధంలో చిక్కుకుపోయాను. అందుకే మీ దగ్గరకు వచ్చాం'' అని కన్నీళ్ళు పెట్టుకుంది.
''అతను మారతాడేమోనని సంవత్సరం చూశారు. అతను ఓ సైకో. పెండ్లికి ముందు నేను వద్దన్నానని ఇప్పుడు అతను ఇలా చేస్తున్నాడు. మానసికంగా హింసిస్తున్నాడు. అతనితో నేను బతకలేను. పైగా అతని తల్లిదండ్రులు కూడా అతన్నే సపోర్ట్ చేస్తున్నారు. మా బంధువులకు మాకు గొడవలు పెడుతున్నాడు. మా చెల్లికి రావల్సిన ఓ సంబంధాన్ని కూడా చెడగొట్టాడు'' ముందు అతని దగ్గర ఏమైనా వీడియోలు ఉన్నాయేమో తీసుకోవాలి. దానికి మీరు సాయం చేయాలి'' అంది.
''అయితే నువ్వు అతనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టు. గృహహింస చట్టం, సైబర్ నేరం కింద అరెస్టు చేయించి, నెట్లో అతనికి ఉన్న అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయించేద్దాం. నీకూ, మీ చెల్లికి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెండ్లయి సంవత్సరం అవుతుంది, పైగా అతను మానసికి వ్యాధికి మందులు కూడా వాడుతున్నాడు. కాబట్టి కోర్టులో విడాకులకు వేసుకోవచ్చు. తర్వాత నీ జీవితం నువ్వు హాయిగా బతకొచ్చు'' అన్నారు.
''ఇంకా ఎక్కడి హాయి, నా జీవితాన్ని నాశనం చేశాడు. పెండ్లంటేనే భయంగా ఉంది'' అంటూ మళ్ళీ ఏడ్చేసింది. ''పాతిక ఏండ్లు కూడా నిండలేదు. నువ్వు అలా మాట్లాడకూడదు. అతని గురించి ఆలోచిస్తూ ఇక పెండ్లే వద్దనుకుంటే ఎలా? అయినా ఇప్పుడే మరో పెండ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ముందు అతని నుంచి విడాకులు తీసుకో. ఉద్యోగం చేసుకో. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యాక అప్పుడు ఆలోచిద్దాం. ఇలాంటి సమస్యలు చాలామందికి వస్తూనే ఉంటాయి. చదువుకున్నావు. ఉద్యోగం చేస్తున్నావు. నీకేం తక్కువ. తోడుగా అమ్మా, చెల్లి ఉన్నారు. అవసరమైన సహాయం మేమూ చేస్తాం. కాబట్టి ప్రశాంతంగ ఉండు. ముందు అతనికి విడాకుల నోటీసు పంపు'' అని ధైర్యం చెప్పారు.
లీగల్‌సెల్ సభ్యులు చెప్పిన ప్రకారమే గీత అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అరెస్టు చేశారు. అయితే డబ్బులిచ్చి కేసు నుంచి తప్పించుకోవాలని చూశారు. కానీ ఐద్వా నాయకులు గీతకు అండగా నిలబడడంతో వాళ్ళ పప్పులు ఉడకలేదు. అతని అకౌంట్లన్నీ క్లోజ్ చేశారు. పోలీసులు బెదిరించి ఆ వీడియోలను డిలీట్ చేయించారు. దాంతో గీత కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం విడాకుల కోసం కేసు నడుస్తుంది. ఉద్యోగం చేసుకుంటూ, చెల్లిని చదివిస్తూ తల్లితో ప్రశాంతంగా ఉంది.