Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండో దశ కరోనా కేసులు పెరగడంతో ఆక్సిజన్ దొరక్క ఎంతోమంది కరోనా రోగులు చనిపోతున్నారు. ఈ క్రమంలో మనిషికి ఆక్సిజన్ తక్కువగా అందుతున్నప్పుడు ఏం చేయాలా అని అందరూ ఆలోచిస్తున్నారు. ప్రోనింగ్ అనే ఒకరకం వ్యాయామంతో ఈ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ప్రోనింగ్ ద్వారా శరీరంలోకి వెళ్లే ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చని సలహా ఇస్తున్నారు. మరి ప్రోనింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, చేసేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం!
ప్రోనింగ్ అంటే: ఛాతి, పొట్ట భాగంపై బరువుపడే విధంగా అంటే బోర్లా పడుకోవడం ద్వారా, లేదంటే ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందుతుంది. దీన్నే ప్రోనింగ్ అని అంటారు. ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు 'ప్రోనింగ్' చాలా ప్రయోజనకరం అని వైద్యులు చెబుతున్నారు.
ఏం చేయాలి?: ప్రోనింగ్ చేయడానికి ముందు మంచంపై బోర్లా పడుకోవాలి. మెత్తటి దిండును మెడ కిందభాగంలో పెట్టాలి. ఛాతి నుంచి తొడ వరకు శరీరం కింద ఒకటి లేదా రెండు దిండ్లను పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మరో రెండు దిండ్లను మోకాలి కింద ఉండేలా చూసుకోవాలి. తర్వాత కొన్ని నిమిషాల పాటు వేగంగా, పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు వేరే విధానం ఉంది. వీరు రోజంతా ఒకేలా కాకుండా, వివిధ పొజిషన్లలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ క్రమంలో ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి రెండు గంటల వరకు పడుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: భోజనం చేసిన తర్వాత సుమారు గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు. తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంతసేపు మాత్రమే ప్రోనింగ్ చేయాలి. రోజులో అత్యధికంగా 16 గంటల వరకు ప్రోనింగ్ చేయవచ్చు. గర్భిణులు, వెన్నెముకలో సమస్యలున్నవారు, గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు ప్రోనింగ్ చేయకపోవడం మంచిది. ప్రోనింగ్ చేసే సమయంలో సౌకర్యవంతంగా ఉండేలా దిండ్లను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.
ప్రోనింగ్ ప్రయోజనాలు: ప్రోనింగ్ వల్ల శ్వాస తీసుకునే మార్గం సజావుగా మారి గాలి ప్రసరణ మెరుగవుతుంది. పల్స్ ఆక్సీ మీటర్లో ఆక్సిజన్ లెవల్ 94 శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్ చేయాలి. ఐసోలేషన్లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, షుగర్ లెవల్ పరిశీలించిన తరువాతే ఈ పద్ధతిని పాటించాలి. దీంతోపాటు గదుల్లో ఎక్కువ వెంటిలేషన్ ఉండాలి. ప్రోనింగ్ చేసే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అసలు మీ శరీరం అందుకు సహకరిస్తుందా లేదా అనే విషయం పరిశీలించాకే ప్రోనింగ్ చేయాలి.