Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పెషల్ అపియరెన్స్‌తో కనిపించాలని ఎవరైనా కలలు కంటారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తారు. అందంగా, ఫ్యాషనబుల్‌గా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య అందంతో పాటు డ్రెస్ కాన్షస్ కూడా బాగా పెరిగింది. ఎవరికి వారు తాము ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి స్పెషల్ అపియరెన్స్ కోసం తపిస్తూ, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పెండిండ్లు, పేరంటాల్లాంటి ప్రత్యేక సందర్భాలు వస్తే చెప్పనవసరం లేదు. గంటల తరబడి ఆలోచిస్తారు. ఆఫీసు నుండి వచ్చిన తర్వాత ఫంక్షన్‌కు వెళ్ళాల్సి వస్తే రెడీ కావడానికి సమయం సరిపోదు. ఇలాంటి ఎన్నో సమస్యలు సాధారణంగా అందరం ఎదుర్కొంటాం. మరి అలాంటప్పుడు చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
పూర్వం పండుగలు, పబ్బాలకు మాత్రమే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళు. చక్కగా ముస్తాబయేవారు. ఇప్పుడలా కాదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే, పరుగున వెళ్ళి కోనేసుకోవడం. చేతిలో నాలుగు రూపాయలు గలగలలాడితే చాలు ఆన్లైన్ షాపింగ్‌లు చేసేస్తున్నారు. ఏ చిన్న పార్టీ ఉన్నా కొత్త డ్రెస్ కొనుక్కుని సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే. కనుక ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోడానికి పెద్ద అకేషన్లేమీ ఉండనక్కర్లే. ఎప్పటికప్పడు స్పెషల్‌గా ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతిరోజూ తళతళలాడాలి
గతంలో ఫంక్షన్లు జరిగితే బర్త్ డే బేబీ లేదా పెండ్లి కూతురు మాత్రమే మెరిసిపోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు, అసలు వ్యక్తితో పాటు ఆ పార్టీకి వచ్చినవాళ్ళు కూడా వారితో సమానంగా మెరిసిపోతున్నారు. ఎప్పుడో ఓరోజు తళుక్కున మెరవడం కాదు, ప్రతిరోజూ తళతళలాడాలి, తళుకులీనాలి అనుకుంటున్నారు చిన్నాపెద్దా అందరూ.
డిజైనర్ వేర్
మనది పేద దేశమే అయినా అనేకమంది డిజైనర్ వేర్ పట్ల మొగ్గు చూపుతున్నారు. వాటికి అలవాటు పడుతున్నారు. డిజైనర్ దుస్తులు అందంగా, కంఫర్టబుల్‌గా ఉంటాయని చెప్తున్నారు. తమ వార్డ్ రోబ్‌ను డిజైనర్ వేర్‌తో అలంకరిస్తున్నారు. పార్టీలకు, ఫంక్షన్లకే కాకుండా కాజువల్ వేర్‌గా కూడా డిజైనర్ క్లోత్స్ వాడుతున్నారు. ఇంతకీ డిజైనర్ వేర్ అంటే ఏమిటి? ఏదో మామూలు టైలర్స్ కత్తిరించి కుట్టినవి కాకుండా ఓ ఫాషన్ డిజైనర్ సరికొత్త తరహాలో ఆలోచించి, రూపొందించినవి. ఫ్యాషనబుల్‌గా, క్రియేటివ్‌గా, ఎట్రాక్టీవ్‌గా, ఎక్స్ట్రార్డినరీగా ఉండే డిజైనర్ క్లోత్స్ చాలా ఎక్స్ పెన్సీవ్ అని తెలుసు కదా. అయినా వీటిని కొంటున్నారు, ఆనందిస్తున్నారు. మన దేశం ఎందులోనూ తీసిపోదని పెద్ద పెద్ద కంపెనీలు పోటీపడి ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆకర్షణీయమైన దుస్తులను రూపొందిస్తున్నాయి. ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి.
సమయం తక్కువుంటే
ఆఫీస్ నుండి తిరిగి రాగానే హమ్మయ్యా... రోజు గడిచిపోయింది అన్న ఫీలింగ్, ఫ్రెష్ అయి కాస్త రిలాక్స్ అవుదామని కూర్చునే లోపే పిల్లలు హోం వర్క్ తీసుకుని వచ్చి కూర్చుంటారు, వాళ్ళ సంగతి చూసి డిన్నర్ కోసం ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది. కజిన్ ఎంగేజ్ మెంట్. కచ్చితంగా అటెండ్ అవ్వాలి, టైం చూస్తే అరగంట కన్నా ఎక్కువగా లేదు. ఏముంది పార్టీకి అటెండ్ అవుతున్నామన్న ఎగ్జైట్ మెంట్ కన్నా అమ్మో.. ఇంత తక్కువ టైంలో ఎలా రెడీ అవ్వాలి అన్న టెన్షన్. అప్పటికప్పుడు పార్లర్‌కి వెళ్ళలేరు, అలాగని అలసటతో పీక్కుపోయినట్టున్న మొహంతో పార్టీకి వెళ్ళ లేరు... అదిగో అలాంటప్పుడే ఎక్స్ పర్ట్స్ చిట్కాలు పనికి వస్తాయి. వాటిని కాస్త ఓపిగ్గా పాటిస్తే చాలు నిగనిగలాడే అందం మీ సొంతం.
పరిగెత్తండి
దీనికోసం మీరు మొట్ట మొదటిగా చేయాల్సింది కాసేపు శ్రమ అనుకోకుండా పరుగెత్తండి. ఆశ్చర్యంగా ఉంది కదూ..! పరుగెత్తడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో పక్కన పెడితే రక్తప్రసరణ క్రమబద్ధమవుతున్నది మాత్రం వాస్తవం. ఇక్కడ మనకు కావాల్సింది కూడా అదే.. ఎందుకంటే రక్తప్రసరణ అనేది సరిగ్గా ఉంటే చర్మంలో కాంతి దానికదే వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే పరుగెత్తడం మొదలుపెట్టండి. అలా అయిదు నిమిషాలు పరుగెత్తడానికి స్పెండ్ చేయండి.
కండ్లకు: ఒకసారి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ మొహంలో అన్నింటికన్నా డల్‌గా ఉన్న ఏరియా ఏదో గమనించండి. కచ్చితంగా కండ్లే.. కాబట్టి అక్కడి నుండే మొదలుపెడదాం. చిన్న కాటన్ ముక్కను తీసుకుని రెండుగా విడదీసి రోజ్ వాటర్‌తో తడిపి ఐదు నిమిషాలు మీ కండ్లపై ఉంచి కండ్లు మూసుకుని రిలాక్స్ అవ్వండి.
ముఖానికి: ఇంట్లో ఉన్న రెండు టొమాటోలను తీసుకుని వాటి రసం తీసి మొహానికి ఫేస్ ప్యాక్‌లా వేసి మూడు నిమిషాలుంచి కడగండి. దాంతో మీ మోహంలో నిగారింపు మీరే చూడగలుగుతారు.
జుట్టుకు: అతి పెద్ద సమస్య తల వెంట్రుకలు. ఫంక్షన్స్‌కి వెళ్ళాలని ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి జుట్టు ఓ పట్టాన అర్జెస్ట్ అవ్వడం కష్టం. అందుకని విసుక్కోకుండా జుట్టు మధ్య రెండు మూడు సార్లు వేళ్ళు పోనిచ్చి వాటిని అలాగే కాసేపటి వరకు పట్టి ఉంచండి. చివరగా కండిషనర్ అప్లరు చేసి వాటిని అలాగే వదిలేయండి.
పెదవులకు: ఇక పెదాల విషయానికొస్తే లైట్‌గా లిప్ గ్లాస్ వాడండి. అది మొహంలో కొత్త మెరుపు రావడానికి దోహదపడుతుంది.
పై చిట్కాలను ఒక అర గంట సేపు పాటించారంటే మీరు ఇదివరకటి కంటే ఉత్సాహంగా, అందంగా కనిపించడం ఖాయం. వీటితో పాటు మీరు కాస్త సంతోషంగా, కాన్ఫిడెంట్ ఉండటానికి ప్రయత్నించారంటే డౌటే లేదు... పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ మీరే అవుతారు.