Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటినుంచీ పనిచెయ్యడం ఇప్పుడు కామన్ అయ్యింది. కరోనా వైరస్ వచ్చాక ఐటీ కంపెనీలతోపాటూ చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచెయ్యాలని ఆదేశించాయి. ఇంట్లోనే ఉండి పనిచేయడమంటే ఎవరికైనా బాగానే ఉంటుంది. అయితే ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు సరదాగా తినే స్నాక్స్, టీలూ, కాఫీల వంటివి ఇప్పుడు అందుబాటులో ఉండవు. పని మానేసి వాటిని ప్రిపేర్ చేసుకోవడం కుదరని పని. మరి ఉద్యోగులు పని చేస్తున్నంతసేపూ ఏమీ తినకుండానే ఉండిపోవాలా? వండుకునే పనిలేకుండా స్నాక్స్ తినేసి సరిపెట్టుకోవాలని అనుకుంటే అది కూడా కరెక్టు కాదు. అందువల్ల ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేపిన బఠాణీలు: బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. ఇవి త్వరగా పాడవ్వవు. పైగా మన బాడీకి అవసరమైన అమైనో యాసిడ్స్ బఠాణీల్లో ఉంటాయి. వీటిలో కేలరీలు కూడా తక్కువ. అందుకే వేపిన బఠాణీలు రోజుకో అరకప్పు తింటే మంచిదే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ... మధ్యమధ్యలో వీటిని తింటే రిలాక్స్ అవ్వడమే కాదు ఆకలీ తీర్చుకోవచ్చు.
డ్రైఫ్రూట్స్,పప్పులు: వర్క్ ఫ్రమ్ హోంలో ఆకలి తీర్చే మరో హెల్తీ ఫుడ్ పప్పులు. అంటే డ్రై నట్స్ అన్నమాట. బాదం, జీడిపప్పు, పిస్తా, పల్లీల వంటివి ఆకలిని తగ్గిస్తాయి. చక్కటి ఎనర్జీ ఇస్తాయి. ఇంటి దగ్గర పనిచేసేవారు డ్రైఫ్రూట్స్, పప్పుల వంటివి తినడం తేలికగా ఉంటుంది. పని ఆపకుండా తినేందుకు ఇవి వీలుకల్పిస్తాయి. ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, రెండు మూడు జీడిపప్పు గింజలు, వాల్ నట్స్, ఫిగ్స్ వంటివి మధ్యమధ్యలో తింటే ఆకలికి చెక్ పెట్టినట్టవుతుంది. ఇవి బాడీలో చెడు కొవ్వును కూడా తగ్గిస్తాయి.
డార్క్ చాకొలెట్లు: తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్, ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాకొలెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పని చేసీ చేసీ అలసటగా ఫీలైతే ఓ డార్క్ చాకొలెట్ తింటే చాలు వెంటనే మూడ్ మారుతుంది. ఈ చాకొలెట్లు రోజుకొకటి తింటే పర్వాలేదు ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఓట్స్: ఈమధ్య ఎక్కువ మంది ఓట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఓట్స్, బార్లీ, రాగి ఫ్లేక్స్ కలిపి తింటే మంచి కాంబినేషన్ అవుతుంది. ఇవి మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పుకోవచ్చు. ఎనర్జీ పెరగాలంటే మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకోవాలి.