Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విజృంభణను తగ్గించటానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. కరోనా ప్రజల మీద తీవ్రంగానే విరుచుకుపడుతోంది. దానికి కావల్సిన జాగ్రత్తలు పాటించాలి తప్ప కరోనాకు తలవంచి ఆహ్వానించకూడదు. ఎదుట పడితే ఎదిరించి పోరాడాలి. అందరికీ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి న్యూస్ ఎక్కువగా వాట్సాప్, ఫేస్‌బుక్కులోనే చూస్తున్నారు. ఫోన్ ఆన్‌చేస్తే మరణించిన వారి వివరాలతో నిండిపోయి భయానకమైన వాతావరణం కనిపిస్తోంది. అలా అని మరణించిన వారికి నివాళులు అర్పించవద్దని కాదు. కానీ కరోనా నుంచి కోలుకున్న వారి వివరాలు చెప్పటం లేదు. వారు కరోనా క్వారంటైన్లో ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఎలాంటి బ్రీతింగ్ ఎక్స్ర్సైజులు చేశారు వంటివి చెప్పించవచ్చు కదా! కరోనా సోకినా ధైర్యంగా పోరాడాలి అనే మనోధైర్యం లభిస్తుంది. పదేపదే మరణ వార్తలు వినడం వల్ల మనిషి మానసిక బలహీనుడవుతాడు. ఆ తర్వాత ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. అందుని కరోనా గురించి భయపడవద్దు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకుందాం. ఇంట్లో ఉండి సృజనాత్మకంగా గడుపుదాం!
బూట్లలోని ప్యాడ్లతో...
మా అబ్బాయి పోయిన నెలలో కొత్త బూట్లు కొనుక్కున్నాడు. అవి వంగిపోకుండా ఉండటానికి బూట్ల లోపల కాగితాల ఉండలతో పాటు పాదం ఆకారపు అట్టలు సైతం ఉన్నాయి. లోపలున్న చెత్తంతా డస్ట్‌బిన్‌లో వేసేసి మా అబ్బాయి బూట్లు తొడుకున్ని వెళ్ళిపోయాడు. తర్వాత చెత్తను గమనిస్తే పాదాల ఆకారంతో చక్కగా మలిచిన అట్ట ముక్కలు రెండు కనిపించాయి. వెంటనే చెత్తబుట్టలో నుంచి తెచ్చి దాచుకున్నాను. అవి పాదాల ఆకారంలో ఉన్నాయి కదా! అందుకని మహిళల పాదాలుగా అలంకరిద్దామనుకున్నా. పాదాలకు గోరింటాకు కోన్ తీసుకొని డిజైన్ వెయ్యాలనుకున్నాను. ప్రస్తుతం లేటయ్యేలా ఉన్నదని పారాణి పాదాలు తయారు చేశాను. అమ్మాయిలు చక్కగా కాళ్ళకు పారాణి పెట్టుకొని ఉంటే ఎంత ముద్దుగా ఉంటుందో చెబుదామనిపించింది. అందుకే రెండు పాదాల అట్టలకు పారాణిని అందంగా దిద్దాను. అమ్మాయి కాళ్ళకు పారాణితో పాటు జాలరి జాలరి పట్టా గొలుసులు కూడా ఉండాలి గదా! అందుకే బంగారు మువ్వలు, వెండి పూసలు, జాలరి మీనాకారి పెయింటింగ్‌లతో ఉన్న మువ్వల్ని పెట్టాను. ఇప్పుడు చూడండి పెళ్ళి కూతురి పారాణి పాదాలు ఎంత ముద్దుగా ఆకర్షిస్తున్నాయో చూడండి.
పరోటా చుట్టిన పేపర్‌తో...
ఇక్కడ బెంగుళూరులో ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తుంది. ఉదయం 10 గంటలలోపే దొరుకుతున్నాయి వస్తువులు. నిన్న మా బాబు పరోటాలు స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. పరోటాలను అల్యూమినియమ్ ఫాయిల్‌తో చుట్టి పంపారు వేడిగా ఉండటానికి. నా కళ్ళకి వేడి వేడి పరోటాలు కన్పించలేదు. తెల్లగా తళతళ మెరుస్తున్న అల్యూమినియం ఫాయిల్ మాత్రమే కనిపించింది. వెంటనే దాన్ని కడిగి దాచేశాను. ఇక ఇప్పుడు అమ్మాయి బొమ్మను చేయాలనుకున్నాను. దానికి తగినట్టుగా తల, మొండెం, పొడవాటి లంగాను కత్తిరించాను. వీటిని ఒక ఫోమ్ షీటు నల్లని దానిపై అతికించాను. చేతులు అతికించి వాటికి గాజులు, వంకీలు పెట్టాను. గాజులు, వంకీలు బంగారు రంగు చాక్లెట్ కాగితముతో పెట్టాను. మెడలో ఒక బంగారు రంగు చాక్లెట్ కాగితముతో పెట్టాను. మెడలో ఒక బంగారు నెక్లెస్‌ను కూడా పెట్టాను. తలకు జుట్టు, ఆ జుట్టు దువ్వి జడలు వేసి రిబ్బన్లు కట్టాను. కళ్ళు, ముక్కు, నోరులను పెట్టాను. మిరియాల గింజల్ని కళ్ళకు పెట్టి ఎర్రటి చాక్లెట్ కాగితంతో ముక్కు నోరులు పెట్టాను. అన్నీ బాగానే ఉన్నాయి కానీ లంగా సాదాగా ఉందనిపించింది. వెంటనే రంగురంగుల ఫోమ్ షీట్లు తీసుకొని పువ్వుల్లా కత్తిరించి లంగాకు అతికించాను. సాదా లంగా కాస్తా పూల లంగాలా మారింది. ఎలా ఉందీ అమ్మాయి?
ఎండుకాయలతో...
ఈసారి అన్ని రకాల ఎండు కాయల్నీ ఉపయోగించాను. ప్రతిసారీ ఏదో ఒక రకం కాయలు మాత్రమే ఉపయోగిస్తున్నాము. మామూలుగా ఫొటోలో దీన్ని చూస్తే తెల్లని కేకు మీద అలంకరించినట్టుగా కనిపిస్తోంది కదూ! మా ఫ్లాట్స్‌లో కొబ్బరి చెట్ల కింద రాలే కొబ్బరి పిందెల్ని ఏరుకొచ్చి ఎండబెట్టాను. కొన్ని కొబ్బరి పిందెల్ని పూలుగా మార్చాను. అలాగే పారిజాతం విత్తనాలు, నిమ్మకాయ పిందెలు, దానిమ్మ కాయ మొగ్గలు, అంధూరియం పూల కేసరాలు, బచ్చలి కూర విత్తనాల్లాంటి విత్తనాలు సమస్త వృక్ష భాగాల్ని ఒక చోట చేర్చాను. తీగకు పాకిన ఒక చెట్టుకు ఎర్రటి విత్తనాలు గుత్తులుగా పూస్తున్నాయి మా ఫ్లాట్స్‌లో. ఆ విత్తనాలు కోసి ఎండబెట్టాను. వాటి పేరేంటో తెలియదు. చాలా వాటి పేర్తను సెక్యూరిటీ సిబ్బందిని, పనివాళ్ళను అడిగి తెలుసుకుంటున్నాను. వృక్ష భాగాల అలంకారం ఎంతో ముచ్చటగా వచ్చింది. సృష్టిలో దేని అందమూ తక్కువ కాదు.
సంపెంగ ఆకులతో...
లేలేత ఆకుపచ్చని మెత్తగా మృదువుగా ఉన్న పెద్ద ఆకులున్న చెట్టును చూపించి 'ఇది సంపెంగ చెట్టు' అని మా పనమ్మాయి చెప్పగానే నాకు ఎగిరి దూకాలన్నంత సంతోషం వచ్చింది. ఇది బెంగుళూరు కదా! అందుకే ఇన్ని రకాల పూలు ఉన్నాయి. సరే వెంటనే గబగబా ఆకులు కోసేసుకున్నాను. కానీ ఏ బొమ్మ చేయాలో వెంటనే తట్టలేదు. కాసేపాగి చూద్దును గదా తోటకూర లాగా వడలిపోతున్నాయి. ఆ రోజు శ్రీరామనవమి పండుగ. పూలతో అలంకారం చేసెయ్యాలనుకున్నా. అలంకారం అద్భుతం కాదు గానీ సంపంగి అంటేనే అద్భుతం. ఇది 'మాగ్నోలియేసి' కుటుంబానికి, 'మాగ్నోలియేలిస్' క్రమానికి చెందిన ఘాటైన వాసన కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయనామం 'మిఛేలియా చంపకా' అంటారు. సంపంగి పూల నుండి సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తారు. నేను సంపంగి ఆకులను, నందివర్ధనపు పవ్వులతో కలిపి అలంకారం చేశాను.
కోడి గుడ్ల అట్టలతో...
ఒక విధమైన ఆకుపచ్చ రంగు అట్టలలో ప్యాక్ చేయబడి ఆయుర్ ఎగ్స్ అనేవి వస్తాయి. సాధారణంగా అట్ట ప్యాక్‌లలో ఉంటాయి. సరే ఆకుపచ్చని అట్ట ప్యాకింగును గుంటలున్న భాగాలలో కత్తిరిస్తే చిన్న చిన్న దొప్పలుగా వస్తాయి. చిన్న అట్టల దొప్పలు ముచ్చటగా ఉన్నాయి. వీటి మధ్యలో పొడుగాటి ప్లాస్టిక్ గొట్టాల్ని అతికించాను. ఇవి ఒక రకం మందులు. ఆ ప్లాస్టిక్ గొట్టాలకు ఎరుపు రంగును వేశాను. ఇప్పుడు ఆకుపచ్చని దొప్పలో వెలుగుతున్న దీపంలా కనిపిస్తున్నది. వీటిని అంతకు ముందు తయారు చేసిన అపార్టుమెంటు గోడల మీద పెట్టాను. దీపావళికి వెలిగించుకున్న ప్రమిదల్లా కనిపించాయి. ఒకవేళ నిజమైన ప్రమిదల్లా దీపావళి వాడవచ్చేమో! ప్రయత్నించాలి.