Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల ఆకలి తీర్చే బాధ్యత ప్రభుత్వం మహిళలకు అప్పగించింది. గత ఇరవై ఏండ్లుగా అప్పులు చేస్తూ పేదల పిల్లల కడుపునింపుతున్నారు. కరోనా కాటుతో ఇప్పుడు 14 నెలల నుండి ఇండ్లకే పరిమితమయ్యారు. నెలనెలా వచ్చే వెయ్యి రూపాయలు కూడా రాక ఆకలితో అలమటిస్తున్నారు. వారే మధ్యాహ్న భోజన కార్మికులు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ మహిళా కార్మికుల సమస్యల గురించి ఓసారి తెలుసుకుందాం...
మన రాష్ట్రంలో సుమారు 25 వేలకు పైగా ఉన్న పాఠశాలల్లో సుమారు 83 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు గత 19 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వీరంతా సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు. కరోనా దేశ వ్యాప్తంగా విజృంభించడంతో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండానే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు సెకండ్ వేవ్ విస్తరిస్తున్న పేపథ్యంలో పాఠశాలలకు మళ్ళీ లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ కాలంలో కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనాలు, గుడ్డు బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో సంవత్సర కాలంలో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కార్మికులను ఆదుకోవాలి
అత్యధిక మంది ఏ ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారు. కావున ఈ నేపథ్యంలో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి రెండు వేల నగదు, 25 కేజీల బియ్యం ఇస్తున్నారు. అలాగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్(సీఐటీయూ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
తినడానికి తిండి లేదు
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకానికి 2019 నవంబర్ నుండి 2020 మార్చి వరకు కోడిగుడ్డు బిల్లులు, 2020 జనవరి నుండి మార్చి వరకు 9,10 తరగతుల మొత్తం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క పెండింగ్ బిల్లులు రాక, మరోపక్క నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ కార్మికులకు తినడానికి తిండి లేక, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ఊసే లేదు. పీఆర్సీ పరిధిలో అంగన్వాడీ, ఆషా లాంటి వారిని తీసుకొచ్చారు. కానీ మధ్యాహ్న భోజన కార్మికులను విస్మరించారు. పెరిగిన ధరలతో పోల్చితే గతంలో కేటాయించిన బడ్జెట్ సరిపోవడం లేదు. ధరల పెరుగుదలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత మోనూ ఛార్జీలతోనే అవసరమయిన సరుకులు కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి పెరుగుతున్న ధరలకనుగుణంగా బడ్జెట్ కేటాయించాలని వారు కోరుతున్నారు.
మా శ్రమను గుర్తించాలి
మా జిల్లాలో రెండు వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. కొంతమందికి బడ్జెట్ ఇచ్చారు. కొంత మందికి మాత్రం 2019 నవంబర్ నుండి పెండింగ్ ఉన్నాయి. మొత్తం మా జిల్లాకు ఐదు కోట్లు రావల్సి వుంది. గుడ్డు బిల్లు, 9,10 తరగతుల బిల్లులు కూడా రాలేదు. మాకు నెలకు ఇచ్చేది వెయ్యి రూపాయాలు మాత్రమే. అవి కూడా 2019 నవంబర్ నుండి ఇవ్వలేదు. కరోనా వచ్చిన తర్వాత మా సమస్యలు మరింత పెరిగిపోయాయి. స్కూల్స్ మూసివేయడంతో పనిలేకుండా పోయింది. గత ఇరవై ఏండ్ల నుండి ఇదే పని పపచేస్తున్నాము. ప్రభుత్వ పథకంలోనే ఉన్నాము. అయినా ఇప్పటి వరకు మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. కరోనా సమయంలో దీన్నే నమ్ముకొని ఉండలేక కొంతమంది వదులుకొని పోయారు. గుర్తింపు కార్డు ఉండేది. అది కూడా ఇప్పుడు లేదు. ఉదయం స్కూల్కు వెళ్ళితే మూడు గంటలకు వరకు అక్కడే సరిపోతుంది. వచ్చి మళ్ళీ రేపటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. కనీసం వేరే పనులు చేసుకునే అవకాశం లేదు. మాలో కొంత మందికి కరోనా వచ్చి ఆస్పత్రులకు వెళ్ళలేక చనిపోయారు. పిల్లలకు భోజనం పెట్టడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాము. ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలకు భోజనం అందించాము. ఇప్పటికే మా సమస్యలు అధికాల దృష్టికి తీసుకెళ్ళాం. లాంటి విపత్కర పరిస్థితులలోనైనా ప్రభుత్వం మా శ్రమను గుర్తించాలి. మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలి.
- చామంతి లక్ష్మి, నిజామాబాద్
పస్తులుంటున్నాం...
మా జిల్లాలో వర్కర్లు 14 నెలల నుండి పని లేక ఇండ్లలోనే ఉంటున్నాం. గతంలో ప్రభుత్వం మేము పని చేసినందుకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు అవి కూడా లేవు. ప్రైవేటు టీచర్లకు ఇప్పుడు రెండు వేలు, 25 కేజీల బియ్యం ఇస్తున్నారు. మేము ప్రభుత్వంతో కలిసి వాళ్ళ చేతికింద పని చేసి ప్రభుత్వ పాఠశాలల పిల్లల కడుపు నింపుతుంటే మేము మాత్రం ప్రభుత్వానికి కనబడటం లేదు. ఇన్నేండ్ల నుండి శ్రమిస్తున్నా మాకు గుర్తింపు లేదు. నాకు తెలిసిన ఒక వర్కర్ సంవత్సరం పాటు బిల్లులు రాకపోతే తన ఎకరం భూమి అమ్మి పిల్లలకు భోజనం వండి పెట్టింది. వాళ్ళు బిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారానికి మూడు సార్లు గుడ్డు పెడుతున్నాం. నగలు అమ్ముకొని, అమ్ములు చేసి మరీ మాకు అప్పగించిన పనిని చేస్తున్నాం. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినప్పుడు మాత్రం ఏడు నెలల ముందే బిల్లులు ఇస్తారు. ఇచ్చే వెయ్యి కూడా ఐదారు నెలలకు ఒకసారి ఇస్తారు. కరోనా సమయంలో మేమంతా పస్తులు ఉంటున్నాం. చేతనైన వాళ్ళు కూలికిపోతున్నారు. చేతకాని వాళ్ళు ఇండ్లలోనే ఉంటున్నారు. అధికారుల దగ్గరకు పోదామంటే కరోనా దగ్గరకు రావొద్దు అంటున్నారు. గ్యాసు లేదు, మంచినీటి సౌకర్యం లేదు, గిన్నెలు లేవు, యూనిఫావమ్ లేదు. వంట గదిలేకపోతే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చెట్ల కింద వండుతున్నాం. అయినా మా గురించి పట్టించుకోవడం లేదు. కట్టెల పొయ్యి మీద వంట చేసి కండ్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఇన్సురెన్స్ సౌకర్యం కూడా లేదు.
- సుల్తాన, భద్రాద్రి కొత్తగూడెం
అప్పులు చేసి అన్నం పెడుతున్నారు
మధ్యాహ్న భోజన కార్మికులకు కరోనా సమయంలో అసలు పని లేకుండా పోయింది. నెల నెలా వచ్చే వెయ్యి రూపాయలు కూడా రాక ఎంతో మంది పస్తులు ఉంటున్నారు. ఎన్నో సమస్యలు అనుభవిస్తూ అప్పులు చేసి మరీ పిల్లలకు వంట చేసి పెడుతున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బడ్జెట్ సమావేశాల్లో కూడా కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేటు టీచర్లకు ఇస్తున్నట్టు వీరికి కూడా నెలకు రెండు వేల రూపాయలు, 25 కేజీల బియ్యం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీసం ఇలాగైనా ఇరవై ఏండ్ల నుండి ప్రభుత్వాన్ని నమ్ముకున్న కార్మికులను ఆదుకోవాలి.
- సులోచన, జగిత్యాల