Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు నుండి ముంబై వరకు ఐదుగురు స్నేహితులు కలిసి 1,700 కిలోమీటర్ల ఆటోరిక్షా యాత్ర చేశారు. ఇది ఏదో సరదాగా చేసిన యాత్ర కాదు. ఈ యాత్ర వెనుక ఓ లక్ష్యం ఉంది. వీరి సంకల్పం వెనుక ఓ ఉద్దేశం ఉంది. వీరి మిషన్ వెనుక ఓ ఎజెండా ఉంది. ఓ కళాశాలలో డిగ్రీ చేస్తున్న వీరి తమ సమయాన్ని, నిద్రను త్యాగం చేసి... అసలు వారు ఈ యాత్ర ఎందుకు చేయవలసి వచ్చిందో... వీరి ప్రయాణం వెనుక ఉన్న ఆ ఎజెండా ఏమిటో... యాత్ర అనుభవాల గురించి ఆ టీం సభ్యురాలైనా ప్రీత దత్తా ఏమంటున్నారో తెలుసుకుందాం...
ప్రీత దత్తా, అన్షుల్ రారు శర్మ, పాల్ కురియన్, వెంకటేష్ తపన్, విదుర్ సింగ్ స్నేహితులు. వీరంత అశోక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. వీరికి 'ఆటో ఫర్ ఇంపాక్ట్' ఆలోచన వచ్చింది. వెంటనే ఈ స్నేహితులంతా కలిసి ప్రాజెక్ట్ 'నన్హి కలి'(పసి మొగ్గలు)తో కలిసి పని ప్రారంభించారు. యువతులకు విద్యను అందించడానికి బెంగళూరు నుండి ముంబై వరకు 1,700 కిలోమీటర్ల ఆటోరిక్షా యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా 12 మంది స్పాన్సర్లను సంపాదించగలిగారు. 450 మందికి అమ్మాయిలకు విద్యనభ్యసించడానికి అవసరమై డబ్బును సేకరించారు.
హృదయాన్ని తాకింది
''యాత్ర మధ్యలో అల్పాహారం కోసం మేము ఓ స్టాల్ దగ్గర ఆగాము. ఆకలితో ఉన్న మాకు మా గురించి ఏమీ తెలియని ఓ మహిళ పూరీ భాజీ చేసి పెట్టింది. మరో చోట ఇంటి పని ముగించుకుని 13 ఏండ్ల అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి కొబ్బరి బోండాల దుకాణాన్ని నిర్వహిస్తున్న ఆమె అమాయకత్వం మా హృదయాన్ని తాకింది. రహదారిపై మా ప్రయాణం గురించి ఆలోచించినప్పుడు మేము వెళ్ళిన ప్రతిచోటా మాకు స్వాగతం పలికిన ఔదార్యం గుర్తుకు వస్తుంది. మనమందరం లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చుని రొట్టెలు కాల్చుకుంటూ, కాఫీ చేసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడిపాము. వలస కూలీలు కాలి నడకన ఇంటికి నడుస్తున్న వార్తలు, ఉపాధి కోల్పోతున్న ఉద్యోగుల కష్టాల గురించి వింటూనే ఉన్నాం. 22 ఏండ్ల నేను కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను కాబట్టి విద్య ఎంత అవసరమైనదో నా మనసుకు తెలుసు'' అని ప్రీత చెప్పారు.
ప్రాజెక్ట్ నన్హి కలి ఎందుకు?
ఈ బృందం ప్రాజెక్ట్ నన్హి కలితో జతకట్టింది. భారతదేశంలో నిరుపేద బాలికలకు విద్యను అందించే లక్ష్యంతో 1996లో కెసి మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లో ఎన్జీఓ ప్రారంభమైంది. జనాభా పెరుగుదల రేటు, తక్కువ మహిళా అక్షరాస్యత, మహిళా శ్రామిక శక్తిని దేశ అభివృద్ధిలో భాగం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. అంతే కాకుండా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, బాల కార్మికులు వంటి సామాజిక సమస్యలు సర్వసాధారణంగా ఉన్నాయి. వీటిని రూపుమాపేందుకు సైతం తన కృషిని మొదలుపెట్టింది ఈ ప్రాజెక్ట్.
మారుమూల ప్రాంతాలకు
ఇప్పటి వరకు ప్రాజెక్ట్ నన్హి కలి భారతదేశంలోని 14 రాష్ట్రాలలో 4,50,000 మంది పేద బాలికల వద్దకు చేరుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి కుగ్రామాల నుండి, వారణాసి గ్రామీణ శివార్లలో, ఆంధ్రప్రదేశ్‌లోని అరకు గిరిజన కొండలు, ఉదయపూర్ ఉప ప్రణాళిక గిరిజన జిల్లా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలోని మురికివాడలు, మారుమూల పల్లెలు, డార్జిలింగ్ వంటి ప్రాంతాలలో అమ్మాయిలు పది సంవత్సరాల పాటు పాఠశాల విద్యను పూర్తిచేసేలా చూస్తుంది.
మమ్మల్ని ప్రోత్సహించారు
''యువ కళాశాల విద్యార్థులుగా మనమందరం చాలా బలంగా ఉన్నాము. అందుకే మేము ప్రాజెక్ట్ నన్హి కలి వద్దకు చేరుకున్నాము. మా పిచ్చి (యాత్ర గురించి) ఆలోచనను వారికి తెలిపాము. అయితే వారు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. ఆటో ఫర్ ఇంపాక్ట్ ప్రచారం నుండి సేకరించిన నిధులన్నీ నేరుగా ఎన్జీఓకు వెళ్తాయి. మేము సాధ్యమైనంతవరకు కార్యకలాపాల గురించి పారదర్శకంగా ఉండాలని కోరుకున్నాము. అందువల్ల మా సిఎస్ఆర్ విరాళాలన్నీ ప్రాజెక్ట్ నాన్హి కలి ద్వారా అమ్మాయిలకు చేరుకుంటాయి'' అని ప్రీత చెప్పారు.
యాత్రకు సంఘీభావం
''మా స్నేహితులందరూ యాత్రలో భాగంగా ఇతర వ్యక్తులతో కలిసి పని చేశారు. అప్పుడు ఎంతో మంది మాకు సహకరించారు. తమ సంఘీభావాన్ని తెలిపారు. అసలు ఈ యాత్ర మేము ఎందుకు చేశాం.. దీనికోసం ఎందుకు అన్ని గంటలు వెచ్చించడం, నిద్రను ఎందుకు త్యాగం చేశాం, వ్యక్తిగత సమయాన్ని ఎందుకు గడిపాము.. ఎందుకంటే ఇది మన జీవితాల్లో అత్యంత శక్తివంతమైన అనుభవాలలో ఒకటి. మనం ప్రేమించినదాన్ని తీసుకొని, మనం ప్రేమించిన వ్యక్తులతో చేయగలమని, అనుకున్న దాని కంటే ఎక్కువే చేయగలమని తెలుసుకున్నాము'' అన్నారు. 2020, ఆగస్టులో వీరి తమ ప్రచారం ప్రారంభించారు. ఆటో ఫర్ ఇంపాక్ట్ చార్ట్ అవుట్ చేయడానికి తొమ్మిది నెలల కన్నా ఎక్కువ సమయం పట్టింది. జట్టులోని ఎవరికీ స్వతహాగా దీనిపై ముందస్తు అనుభవం లేదు.
నిధుల సేకరణే పని
''మా ప్రయాణంలో మేము నేర్చుకున్నదానిపై.. అలాగే ప్రజలు మా యాత్రకు ఎలా స్పందిస్తున్నారో దాన్ని బట్టి ప్రతి వారం మా 'ప్రణాళిక' మారుతుంది. కంపెనీలకు ఇమెయిల్ చేయడం ద్వారా మా పనిని ప్రారంభించాము. అయితే మాకు ఆ కంపెనీల నుండి ఎలాంటి స్పందనా రాలేదు. అప్పుడు మేము వ్యక్తులకు వాట్సాప్ చేశాము. ఆ ప్రయత్నం కూడా ఫలించకపోతే స్వయంగా వారిని పిలవడం ప్రారంభించాము. ఆటో ఫర్ ఇంపాక్ట్ యాత్ర మొత్తంలో మేము ఎక్కడా నిధులు అడిగేందుకు మోహమాటపడలేదు'' అన్నారు ప్రీత. వీరంత గత తొమ్మిది నెలలుగా 500 మందికి ఇమెయిల్స్ పంపించారు.
తర్వాత ఏంటి?
వారు బోర్డులో ఇప్పుడు 12 మంది స్పాన్సర్లు ఉన్నారు. 450 మందికి పైగా యువతులకు విద్యనభ్యసించడానికి తగినంత డబ్బును సేకరించగలిగారు. ''మేము ఆటో తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. మరొకరు ఇంపాక్ట్ కోసం బొమ్మలు గీయవచ్చు, ఇంపాక్ట్ కోసం వంట చేయవచ్చు, ఇంపాక్ట్ కోసం పాడవచ్చు. సమాజం కోసం చేసే పని కూడా ప్రకాశవంతంగా, రంగురంగులగా, సరదాగా కనబడుతుందని మా ఈ యాత్ర ద్వారా అందరికీ చూపించాలనుకుంటున్నాము'' అన్నారు ప్రీత.
- సలీమ
స్వరాన్ని వినిపించడానికి
మహమ్మారి సమయంలో ఎంతో మంది అమ్మాయిలు పాఠశాలలకు దూరమై చదువును కోల్పోయారు. మేము ఈ సమాజానికి మా స్వరాన్ని వినిపించడానికి మా అధికారాన్ని ఉపయోగించాలనుకుంటున్నాము. ఆటోరిక్షా భారతదేశానికి అలాగే దక్షిణ ఆసియాకు ఓ ప్రత్యేకమైన వాహనం. దాదాపు ప్రతి ఒక్కరూ దీనిలో ప్రయాణించి వుంటారు. అందుకే మా యాత్రకు ఆటోరిక్షాను ఎంపిక చేసుకున్నాము.
- ప్రీత దత్తా