Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధంలో ఎప్పుడో అప్పుడు ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, ఒకరి అభిప్రాయం ఒకరు అంగీకరించకపోవడం అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇవి డిన్నర్లో ఏ తినాలి అన్నంత చిన్న వాటి దగ్గర నుండీ ఇల్లు కొనాలా ఫ్లాట్ కొనాలా అన్నంత పెద్ద వాటి వరకూ ఉంటాయి. కేవలం మీ జీవిత భాగస్వామితో ఘర్షణ వచ్చింది కాబట్టి మీ రిలేషన్ షిప్లో సమస్యలున్నాయని కాదు. నిజం చెప్పాలంటే సరిగ్గా డీల్ చేయగలిగితే ఘర్షణల వల్ల మీ రిలేషన్ షిప్ ఇంకా బలపడుతుంది కూడా. మీరు పోట్లాడుకోకుండా, మీ సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఉంటే మీరసలెప్పటికీ వాటికి పరిష్కారం కనుక్కోలేరు. అదే సమయంలో ఈ ఘర్షణలు ఒక్కోసారి చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి రిలేషన్ షిప్లో వచ్చే ఘర్షణలని ఎలా డీల్ చేయాలి? ఘర్షణ చేయి దాటి పోకూడదు, సమస్య పరిష్కారమవ్వాలి, బంధం బలపడాలి.. ఇన్ని జరగాలంటే ఏం చేయాలో చూడండి.
కొన్ని సార్లు వ్యక్తులు ప్లెయిన్‌గా వారిని బాధపడుతున్న వాటి గురించి మాట్లాడకుండా ఇంక దేని గురించో మాట్లాడతారు. ఒక్కోసారి భాగస్వామికి విలువనివ్వకుండా మాట్లాడతారు. ఇవి రెండూ తప్పే. ఇలాంటి చర్యల వల్ల అసలు సమస్య పక్కకి పోతుంది. అంతే కాక భాగస్వామికి కోపం వచ్చిందని తెలుస్తుంది కానీ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. ఏం చేయాలో తెలియదు.
మీరెలా ఫీల్ అవుతున్నారో చెప్పండి
మీ భాగస్వామి ప్రవర్తనని చులకన చేసే మాటలు బంధాన్ని బలహీనం చేస్తాయి. అందుకనే మీ భాగస్వామిని నిందించకుండా మీరెలా ఫీల్ అవుతున్నారో తెలియచేయడం అవసరం.
వినండి
సమస్య పరిష్కారానికి మాట్లాడడం ఎంత అవసరమో వినడం కూడా అంతే అవసరం. ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేయడం, ఫోన్స్, టీవీ వంటివి చూడకుండా ఉండడం ఎంతో ముఖ్యం.
సరైన సమయం
మీ భాగస్వామితో ఓ విషయం మాట్లాడాలనుకున్నారు, ఒక పాయింట్ క్లారిటీ కావాలనుకున్నారు. దానికి కూడా సమయం ఉంటుంది. ఆఫీసు నుండి లేట్‌గా వచ్చిన పూటో లేదా ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయి చిరాగ్గా ఉన్నప్పుడో కాకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో మీరు చర్చ చేయదల్చుకున్న పాయింట్ రెయిజ్ చేయడం మంచిది.
గౌరవం ఇవ్వండి
ఏ బంధానికైనా గౌరవం ప్రాతిపదిక. గౌరవం తర్వాతే స్నేహమైనా ప్రేమైనా అంటార నిపుణులు. మీ ఘర్షణలని మీ భాగస్వామిని హర్ట్ చేయకుండా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. వారు చెప్పేది వినడం, వారి పాయింట్స్‌ని సీరియస్‌గా అర్ధం చేసుకోవడం, మధ్యలో అడ్డం పడకుండా ఉండడం, దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాత్రమే మాట్లాడడం వంటి వాటి ద్వారా మీ భాగస్వామి అంటే మీకున్న గౌరవం వారికి అర్ధమవుతుంది.
ప్రేమని మర్చిపోకండి
అప్సెట్ అయినప్పుడు ఒక్కోసారి కంట్రోల్ తప్పుతాం. కానీ మీరు ఆర్గ్యూ చేస్తున్న వ్యక్తితో మీరు జీవితం పంచుకున్నారన్న విషయం మర్చిపోకండి. వారంటే మీకూ, మీరంటే వారికీ అవ్యాజమైన ప్రేమానురాగాలున్నాయన్న విషయం గుర్తుంచుకుని ఆర్గ్యూ చేయండి. అలాగే పోట్లాటతో నిద్రపోకండి. నిద్రపోయే సమయానికి మీ పోట్లాట అయిపోయి ఉండాలి.
''ఎప్పుడూ'' అనే మాట వాడకండి
నువ్వెప్పుడూ ఇంతే, ఇంటి పనుల్లో ఎప్పుడూ హెల్ప్ చేయవు, ఎప్పుడూ ఫోన్లోనే ఉంటావు, ఎప్పుడూ ఇలాగే
చేస్తావు.. ఇలాంటి మాటల వల్ల నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఎప్పుడూ హెల్ప్ చేయవు అని ఎప్పుడో అనేకంటె ఈ పనిలో కొంచెం హెల్ప్ చేయవా అని మీకు అవసరమున్నప్పుడే అడగడం బెస్ట్.
అర్ధం చేసుకోండి
ఒకరంటే ఒకరికి సహానుభూతి లేకపోతే ఇద్దరి మధ్య అపార్ధాలు వస్తాయి. వారేం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో వారి వైపు నుండి ఆలోచించండి, వారి వైపు నుండి అర్ధం చేసుకోండి. సహానుభూతి ఉన్నప్పుడు గొడవలు త్వరగా తగ్గుతాయి, బంధం బలంగా ఉంటుంది.
ప్రతిదానికీ పోట్లాడకండి
ఇద్దరు వ్యక్తులు కలిసి బతుకుతున్నప్పుడు ఎన్నో నచ్చని విషయాలుంటాయి, ఎన్నో భేదాభిప్రాయాలు వస్తాయి. అన్నింటి గురించి ఘర్షణ పడుతూ ఉంటే ఇంక జీవితం సరదాగా ఉండేదెప్పుడు? మీకు మరీ ముఖ్యమైనది అనుకున్న వాటి గురించే మాట్లాడండి, ఘర్షణ పడండి. పరవాలేదనుకున్న వాటిని వదిలేయండి, చూసీ చూడనట్టు ఊరుకోండి.
మర్చిపోండి
ఓ సారి ఓ విషయంలో గొడవ పడి ఓ అంగీకారానికి వచ్చిన తర్వాత ఇక దాని గురించి మళ్ళీ మాట్లాడకూడదు. ఇంకేదో సందర్భంలో దీన్ని బయటకి తీసుకు రాకూడదు. ఆ విషయం అక్కడితో అయిపోయింది, అంతే.