Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకాలు చదవడమంటే ఒకప్పుడు రోజువారీ అలవాట్లలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది అవసరం కోసం మాత్రమే ఆ పని చేస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితం, మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల పుస్తకాలు చదివే వారి శాతం తగ్గిందనే చెప్పాలి. అయితే చదవడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుకోవడమే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పుస్తకాలు, నవలలు, వార్తాపత్రికలు ఇలా ఏది చదివినా ఉపయోగమే. ముఖ్యంగా ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉంటుంది.
మెదడు చురుగ్గా: పఠనం మెదడులోని వివిధ భాగాల మధ్య కొత్త కనెక్షన్లను పెంచుతుంది. 2013లో జరిగిన అధ్యయనం ప్రకారం నవలలు మెదడును చురుగ్గా చేస్తాయి. భాషపై పట్టు పెరుగుతుంది. రీడింగ్ మెదడులోని న్యూరాన్లను సృష్టిస్తుందని న్యూయార్క్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సబ్రినా రోమనోఫ్ చెప్పారు. ఈ ప్రక్రియను న్యూరోజెనిస్ అని పిలుస్తారు. న్యూరాన్లు మెదడులోని వివిధ ప్రాంతాలకు సందేశాలు పంపుతాయి.
సమాచారాన్ని ప్రసారం చేసే కణాలు: రీడింగ్ వల్ల ఆలోచనలు పెరిగి, పరిశీలనాత్మక దృష్టితో చూడటం వల్ల మెదడులో కొత్త న్యూరాన్లు పుడతాయంటున్నారు.
మెమరీ పవర్: జ్ఞానం అంటే గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, జడ్జిమెంట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. చదవడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. 14 ఏండ్ల పాటు సాగిన అధ్యయన వివరాల్ని 2020లో ప్రచురించారు. ఎక్కువసార్లు చదివిన వారికి 6 ఏండ్ల నుంచి 14 ఏండ్ల వ్యవధిలో జ్ఞాన క్షీణత తక్కువగా ఉందని కనుగొన్నారు. 14 ఏండ్ల తర్వాత తక్కువ సార్లు చదివిన వారితో పోలిస్తే ఎక్కువసార్లు చదివిన వృద్ధులకు జ్ఞాన క్షీణత తగ్గుతోంది. అంతేకాకుండా చదవడం వల్ల మతిమరుపు రావడానికి కూడా తక్కువ అవకాశం ఉందని తేలింది. చైనాలో 2018లో చేసిన అధ్యయనం ప్రకారం ఐదేండ్ల కాలంలో 65 లేదా అంతకంటే ఎక్కువ వయసు గలవారిని ట్రాక్ చేశారు. పఠనం లాంటి మేథో కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల కొన్నేండ్ల తర్వాత వచ్చే చిత్త వైకల్యం తక్కువగా ఉంటోందని కనుగొన్నారు.
టెన్షన్ పరార్: కేవలం 30 నిమిషాలు చదవడం వల్ల ఒత్తిడి, శారీరక మానసిక ఆందోళనలను తగ్గించవచ్చు అని పరిశోధనలో తేలింది. 2009లో జరిగిన అధ్యయనం ప్రకారం గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదవడం, యోగా చేయడం, హ్యూమరస్ వీడియోలు చూడటం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గాయి. 30 నిమిషాలు వార్తా కథనాలను చదివిన విద్యార్థుల హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఒత్తిడి లాంటివి తగ్గాయని తేలింది. ఐతే వార్తలు చదవడం అందరికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. వాటి బదులుగా నవలలు, ఇతర కథలు చదవవచ్చు.
దీర్ఘాయుష్షు: మెదడు ఆరోగ్యాన్ని పఠనం మెరుగుపరుస్తుంది. ఇది దీర్ఘాయుష్షును పెంచుతుంది. 12 ఏండ్ల పాటు సాగిన అధ్యయనం 2017లో ప్రచురితమైంది. దీని ప్రకారం పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారిలో మరణ ప్రమాదం 20 శాతం తగ్గుతుందని తేలింది. పఠనం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడి త్వరగా చనిపోయే అవకాశాలను తగ్గిస్తోంది.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత: మనుషులు చదువుతున్నప్పుడు మెదడులో దృశ్యాలు ఏర్పడుతుంటాయి. అవి మెమరీ రీకాల్, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తి పెరగాలంటే రెగ్యలర్ రీడింగ్ అవసరమని రోమనోఫ్ చెప్పారు. 2013 అధ్యయనం ప్రకారం చదవడం, రాయడం వంటివి చేయని వారితో పోల్చితే అవి చేసే వారి జ్ఞాపకశక్తి పెరుగుతోందని గుర్తించారు.