Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండలో కాసేపు అలా బయటికెళ్లి ఇంటికి రాగానే చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తోంది. ఇలాంటప్పుడే మనసు శీతలపానీయాలవైపు లాగుతూ ఉంటుంది. నిమ్మరసం, మజ్జిగ ఎప్పుడూ తాగేవే. కాస్త వెరైటీగా ఇంకేదైనా అనుకునే వారికోసం ఇంట్లోనే పండ్లు, కూరగాయలతో తయారు చేసుకోవచ్చు. వేసవిలో ఆకలి వేస్తున్నట్టుంటుంది, తినలేము. దప్పిక కలుగుతున్నట్టు అనిపిస్తుంది, తాగలేము. నీరసం... ఒకటే నీరసం... కొంచెం రిఫ్రెష్ బటన్ నొక్కి మనసును, శరీరాన్ని చల్లబరిచేలా ఏదైనా తిని, తాగాలనిపిస్తుంది. ప్రస్తుతం మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రోగనిరోధక శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. కరోనా బారి నుండి మనల్ని మనం కాపాడు కోవాలంటే ఇది మనకు చాలా అవసరం. అందుకే ఈరోజు మామిడితో చేసే కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం...
మ్యాంగో రబ్రీ
కావల్సిన పదార్థాలు: పాలు - మూడు కప్పులు, బాగా పండిన మామిడిపండు ముక్కలు - కప్పు, పంచదార - పావు కప్పు (స్వీట్ సరిపడా మరింత జోడించుకోవచ్చు) పిస్తాచో - ఐదారు, బాదం - నాలుగు, యాలకలు పొడి - అర కప్పు, కుంకుమ పువ్వు - పావు స్పూను.
తయారుచేయు విధానం: ముందుగా వేడినీళ్ళలో బాదం వేసి 20 నిముషాలు నానబెట్టుకోవాలి. తర్వాత బాదం నీరు వంపేసి వాటికి పొట్టు తొలగించాలి. తర్వాత పల్చగా స్లైసులుగా కట్ చేసుకోవాలి. అలాగే పిస్తాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉపయోగించేటప్పుడు చూడటానికి చాలా నీట్‌గా కనబడాలి. తర్వాత కుంకుమ పువ్వును కొద్దిగా వేడి పాలలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత బాగా పండిన మామిడి ముక్కలను మిక్సీ జార్లో వేసి కొద్దిగా చిక్కటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. తర్వాత పాలను ఒక గిన్నెలో పోసి పాలు సగం అయ్యే వరకూ బాగా మరిగించాలి. పాలు చిక్కగా సగం అయినప్పుడు అందులో పంచదార వేసి పాలలో పూర్తిగా కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కిందికి దింపుకొని చల్లారనివ్వాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత అందులో మామిడిపండు పేస్ట్, యాలకుల పొడి, పిస్తా, బాదం, కుంకుమ పువ్వు వేయాలి. అంతే దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి అరగంట తర్వాత చల్లచల్లగా సర్వ్ చేయాలి.అంతే రుచికరమైన మ్యాంగో రబ్రి రిసిపి రెడీ.
రా మ్యాంగో- బనానా షర్బత్
కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ - ఒకటి, అరటిపండు - ఒకటి, పంచదార - అర కప్పు, జీలకర్ర పొడి - సగం టీ స్పూను, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా తురుము కోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నీరు పోసి పల్చని జ్యూస్‌లా బ్లెండ్ చేయాలి. దీన్ని గ్లాసులోకి వడపోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి. ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది.
డ్రై ఫ్రూట్స్ మ్యాంగో లస్సీ
కావల్సిన పదార్థాలు: పెరగు - కప్పు, మామిడికాయ - ఒకటి (పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి), బాదం - నాలుగైదు (పొడి చేసుకోవాలి), పిస్తాలు: మూడు లేదా నాలుగు (పొడిచేసుకోవాలి), పంచదార - మూడు టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ - కొద్దిగా(రెండు మూడు చుక్కలు), ఐస్ క్యూబ్స్ - మూడు లేదా నాలుగు.
తయారుచేయు విధానం: ముందుగా పెరుగు ఓ గిన్నెలో వడగట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వడగట్టుకొన్న చిక్కటి పెరుగు, మామిడిముక్కలు, కొద్దిగా నీళ్ళు పోయాలి. అందులోనే పంచదర కూడా వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకొన్న మిశ్రమంలో రెండు మూడు చుక్కల రోజ్ వాటర్ వేసి మరో సారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా చేడయం వల్ల ఫైబర్, మామిడి ముక్కలు తొలగించవచ్చు. తర్వాత ఓ గ్లాసు తీసుకొని అందులో ఐస్ ముక్కలు వేసి, తర్వాత వడగట్టి పెట్టుకొన్న మ్యాంగో లస్సీ వేసి, డ్రైఫ్రూట్స్ పొడి, పలుకులతో గార్నిష్ చేయాలి. మీకు ఇష్టం అయితే గ్రైండ్ చేసేప్పుడే కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే డ్రైఫ్రూట్ మ్యాంగో లస్సీ రెడీ.
మ్యాంగో-సబ్జా పుడ్డింగ్
కావలసిన పదార్థాలు: మామిడి ముక్కలు - అరకప్పు, కొబ్బరిపాలు - ఒక కప్పు, పెరుగు - అరకప్పు, సబ్జా గింజలు - మూడు చెంచాలు, కొబ్బరి తురుము - రెండు చెంచాలు, చక్కెర - రెండు చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా.
తయారు చేయు విధానం: సబ్జాగింజల్ని అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి పక్కన పెట్టాలి. పెరుగును బాగా చిలకాలి. ఓ బౌల్లో కొబ్బరిపాలు తీసుకోవాలి. ఇందులో చక్కెర వేసి కరిగే వరకూ కలపాలి. తర్వాత ఇందులో పెరుగు, సబ్జా గింజలు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. పది నిమిషాల తర్వాత తీసి, మరోసారి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. సర్వ్ చేసేటప్పుడు ఓ గ్లాస్ కానీ కప్ కానీ తీసుకుని అందులో మామిడి ముక్కలు వేసి, దాని పైన ఫ్రిజ్ లోంచి తీసిన మిశ్రమాన్ని వేయాలి. పైన కొబ్బరి తురుము, కొన్ని మామిడి ముక్కలు వేసి అందించాలి.