Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరుగుతున్నది. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో రోజురోజుకూ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూనే ఉన్నది. ప్రస్తుతం కరోనా వ్యాధి గ్రస్తుల సంఖ్య రెండు కోట్లు దాటింది. భారతదేశంలో మొదటి కోటిని కరోనా చేరుకోవడానికి సంవత్సరం సమయం తీసుకున్నది. కానీ సెకండ్ వేవ్‌లో రెట్టించిన బలంతో ముందుకు వచ్చిన కరోనా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కోటి మందిని వ్యాధిగ్రస్తుల్ని చేసింది. దాని బలం ఎంత ఉధృతంగా ఉందో చూడండి. మరి మనం కూడా దానికి అదే రీతిలో సమాధానం చెప్పాలిగదా! కరోనా రాకుండా ఉండటానికి భయంతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ కరోనా సోకితే అస్సలు భయపడకూడదు. దానికి కావాల్సిన మందులు వాడాలి. కరోనా గడప దాటిన వాళ్ళని మాత్రమే కాటు వేస్తున్నది. ఇంట్లో ఉన్న వాళ్ళని ఏమీ చేయలేదు. అందుకే మనం దానికి అవకాశం ఇవ్వకుండా తలుపులు మూసుకుందాం. పెండిండ్లకు, పేరంటాకు వెళ్ళడం మానేద్దాం. మనకు మనమే క్వారంటైన్లో ఉందాం. విసుగు రాకుండా కళాత్మకంగా గడుపుదాం.
బొప్పాయి, సంపెంగ ఆకులతో
బొప్పాయి ఆకుల్ని సాంప్రదాయ వైద్యంలో వాడతారు. మలేరియా జ్వరానికీ, ఆస్తమా జబ్బుకీ ఈ ఆకుల్ని వాడేవారట. మనకు తెలిసి డెంగూ జ్వరానికి ప్లేట్లేట్స్ సంఖ్య తగ్గిపోతే బొప్పాయి ఆకుల రసం చాలా మంది తాగారు. బొప్పాయి పండులో ఎక్కువగా కార్పోహైడ్రేట్లు ఉంటాయి. మొత్తంగా 88 శాతం నీరు ఉంటుంది. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ మూలంగానే ఆ పండుకు చక్కని రంగు వస్తుంది. వీటి ఆకులు పెద్దవిగా ఉంటాయి. దాదాపు 50 నుండి 70 సెం.మీ వ్యాసంలో ఉంటాయి. ఇవి దాదాపు ఏడు విడి ఆకులు కలిసినట్టుగా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. నేను పెద్ద ఆకును కోసుకొచ్చి విడి భాగాలుగా కత్తిరించి పెట్టుకున్నాను. ఆ తర్వాత సంపెంగ ఆకుల్ని తీసుకున్నాను. ఇవి చెట్టు నుండి తెంపిన వెంటనే వడలి పోతాయి. ఈ ఆకులతో నెమలిని చేయాలనుకున్నాను. సంపెంగ ఆకులతో నెమలి శరీరాన్ని తయారు చేశాను. దీని ముక్కు కోసం రెండు సన్నజాజి మొగ్గల్ని పెట్టాను. కన్ను కోసం దానిమ్మ పువ్వును, మిరియం గింజను పెట్టాను. నెమలి తల మీద ఉండే తురాయి కొరకు, కాళ్ళ కొరకు ఎండి పోయిన నందివర్ధనం పువ్వుల్ని పెట్టాను. అత్యంత ప్రధానమైనది నెమలి ఫించమే కదా! ఇప్పుడు చక్కగా కత్తిరించినట్టున్న ఆకుల్ని ఫించంలా వరసగా అమర్చాను. సంపంగి వాసనతో, బొప్పాయి చీలికలతో అందంగా తయారైంది. చూడండి నెమలి.
బీట్రూట్, బెండకాయలతో
బీట్రూట్ ఎర్రగా రక్తం గడ్డలా ఉంటుంది. దాని జ్యూస్ తాగితే రక్తం పడుతుందని అంటారు. నేను బీట్రూట్ చూడగానే అమ్మాయిని చెయ్యాలను కున్నాను. అమ్మాయి తల కోసం బీట్రూట్ను పెట్టాను. పచ్చని శరీరంతో అమ్మాయి మెరిస ిపోతుందంటారు కదా అని పసుపు పచ్చని దోసకాయను అమ్మాయి శరీరంగా పెట్టాను. సింధూర వర్ణంలో ఉండే క్యారట్‌ను చేతులుగా ఉపయోగించాను. ఆ చేతులకు హస్తాలుగా కరివేపాకు ఆకుల్ని పెట్టాను. అమ్మాయిని బుట్ట బొమ్మ అంటారు కదా! ఆ బుట్ట బొమ్మ కావడానికి బెండకాయల గౌను కుట్టి తొడిగాను. చింత గింజల్లాంటి కండ్లు, ఎర్రని కందగడ్డలాంటి మోహము, పచ్చని మేనుతో అమ్మాయి అందంగా ఉంది. అన్నీ పోషకాహారాలే తల మీద జుట్టు కోసం పాలకూరను పెట్టాను. విటమిన్స్, మినరల్స్, కార్బొహైడ్రేట్స్ పీచుపదార్థాలు, కొవ్వులు వంటి పోషక విలువలు కలిగిన సంపూర్ణ ఆహారం తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ కూరగాయ వద్దు, ఆ కూర నాకిష్టం అంటూ విమర్శించకుండా అన్నీ కూరల్నీ తినాలి.
మోరంగడ్డతో
మోరంగడ్డలంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఇవి తియ్యగా ఉండడంతో ఉడక బెట్టుకొని తింటారు. నా చిన్నప్పుడు ఎడ్లబండ్లులో ఈ గడ్డల్ని తెచ్చి అమ్మేవాళ్ళు. వీటిని పచ్చిగా కూడా తింటారు. చాలా బాగుంటాయి. సాంబారు, పులుసుల్లో ఈ గడ్డల్ని వేసుకుంటే రుచిగా ఉంటాయి. అలాగే ఈ రోజు మోరంగడ్డలు ఉడకబెడదామని తెప్పించాను. కవర్లో మూడు మెలికలు తిరిగిన బలమైన గడ్డ కనిపించింది. మనం కొనుక్కొస్తే ఇలాంటి గడ్డలు వేసుకోము. దీనిని చూడగానే నాకు కొండ చిలువలా అనిపించింది. చాలా బలిష్టంగా ఉండటంతో అలా అనిపించింది. కాస్త కండ్లు, కోరలు పెట్టేసి పామును చేసేశాను. కొండ చిలువ విషరహిత పాము. కానీ మనుషుల్ని కూడా అమాంతంగా మింగగలదు. ఇవి 'పైధానిడే' కుటుంబానికి చెందిన జీవులు. ఇవి ఎక్కువగా సహారా ఎడారుల్లోనూ, ఉష్ణమండల ప్రదేశాల్లోనూ ఉంటాయి.
పాత శుభలేఖతో
పెండ్లికి రమ్మని పెండ్లి శుభలేఖలు ఇస్తారు కదా! పెండ్లి డేట్ గుర్తుంచుకునే వరకు ఉంచుకొని శుభలేఖలు పారేస్తాం కదా! నేను వీటితో ఎన్నో చిత్రాలు చేశాను. గతంలో కొన్నింటి గురించి మీకు చెప్పాను. ఈ ఆర్ట్‌కు నేను 'వెడ్డింగ్ కార్డ్ క్రియేషన్స్' అని పేరు పెట్టాను. మధ్యలో గణపతి బొమ్మతో మిగతా కార్డంతా ఖాళీగానే ఉంది. సరే దీనిని తీసుకొని రంగుల హరివిల్లును చేశాను. వినాయకుని బొమ్మ ఉన్నంత మేరా అడ్డంగా గీతలు గీసి రంగులు నింపాను. మిగతా కార్డును డైమండ్ ఆకారంలో నిలువుగా తోరణాలు వేలాడినట్టు వేశాను. ఏదేఐనా పెండ్లి కార్డు బొమ్మకు పనికొస్తుందంటే పక్కన దాచి పెడతాను. ప్రస్తుతానికి ఇలా యాభై దాకా కార్డులు రూపొందించాను.
మామిడిటెంకతో
రోజూ ఇన్ని రకాల విత్తనాలు, ఆకులతో బొమ్మలు చేస్తున్నావు. పండ్లలో రారాజను నేను. నా విత్తనంతో ఏ బొమ్మను చెయ్యవా? నీకెంత ధైర్యం అంటూ నన్ను నిలదీసింది. అమ్మో నిన్ను చెయ్యకపోతే ఎలా అని వెంటనే తిన్న టెంకను ఎండబెట్టాను. ఎండిన మామిడి కాయ టెంకను మనిషి శరీరంగా పెట్టాను. మధురాతి మధురమైన మామిడి టెంకను శరీరంగా అమర్చుకున్న వీడెంత అదృష్టవంతుడో. వీడి తలకు అవకాడో విత్తనాన్ని పెట్టాను. అవకాడో కాయకోసేటప్పుడు పడ్డ గాట్లే, సహజంగా కండ్లు, ముక్కు, నోరుగా ఏర్పడ్డాయి. తలకు జుట్టు ఎండిపోయిన కుంకుడు గింజల్ని పెట్టాను. చెవులుగా, గుండీలుగా వక్క ముక్కల్ని పెట్టాను. కాళ్ళకు కొబ్బరి కాయ పిందెల్ని పెట్టాను. పాదాలుగా 'ఆంధూరియం' పువ్వు కేసరాలను అమర్చాను. చేతులుగా స్నేక్లీవ్స్ చెట్టు ఆకుల్ని పెట్టాను. చూశారా మామిడి కాయ ఒళ్ళున్న తీపిగాడు తయారయ్యాడు.
- డా|| కందేపి రాణీప్రసాద్