Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు దూకుడుగా ఉంటే తల్లులకు కాస్త కంగారుగా వుంటుంది. ఎక్కడ కింద పడతాడో దెబ్బలు తగిలించుకుంటాడోనని జాగ్రత్త... జాగ్రత్త అంటూ వెంట వెంటే తిరుగుతూనే వుంటుంది అమ్మ. అయితే అమెరికాలోని ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం అది ఎంతో మంచిది, పిల్లలని వారించద్దు, వీలయితే చిన్న వయసులో ఉండగా వారితో వ్యాయామాల వంటివి కూడా చేయించండి అంటున్నారు.
చిన్నతనంలో చేసే వ్యాయామం వల్ల జీవితకాలం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చిన్నతనంలో బాగా శారీరక అలసట వచ్చేలా ఆటలు అడిన పిల్లలు, ఎముకల చలనం ఎక్కువగా ఉండేలా పరుగులు పెట్టి ఆడిన పిల్లలు, అలాగే చిన్నప్పటి నుంచి వ్యాయామాలు చేసిన పిల్లల్లో పెద్దయ్యాక వారి ఎముకలు పటిష్టంగా ఉండటం వీరు నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారట. చిన్నతనంలో వ్యాయామాల వల్ల ఎముకల్లో అదనంగా బాహ్య పొరలు ఏర్పడటం గమనించారు వీరు. దీనివల్ల భవిష్యత్తులో ఎముకలు విరిగే ప్రమాదం వుండదని, కీళ్ళ నొప్పుల వంటివి త్వరగా రావని చెబుతున్నారు వీరు.
పిల్లల ఆటలు వారి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయనే విషయాన్ని నిర్ధారించు కోవటానికి శాస్త్రవేత్తలు కొంత మంది పిల్లలపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపారు. కొంతమంది పిల్లలతో కొన్ని నెలల పాటు చిన్నపాటి వ్యాయామాలు చేయించారట. ఆ సమయంలో వారి ఎముకల ఎదుగుదలని నమోదు చేసినపుడు వ్యాయామం చేయకమునుపు కంటే, వ్యాయామం చేసిన తర్వాత ఎముక పెరగటం గమనించారట. ఎముక బలంగా ఉన్నప్పుడే అది ఎక్కువకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా పిల్లలతో వ్యాయామాల వంటివి చేయించలేం అనుకుంటే కనీసం పిల్లల్ని అడుకోనివ్వమని చెబుతున్నారు. వారి మానాన వారిని వదిలేస్తే వాళ్ళు అటు, ఇటు తిరుగుతూ ఆడుకుంటూ వుంటారు .
ఏమాత్రం కదలికి అవకాశం ఇవ్వకుండా పిల్లలు పడిపోతారనే భయంతో చంకన వేసుకు తిరగటం వంటివి చేయటం మంచిది కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎదిగే వయసులో ఎముక బలిష్టంగా ఉంటేనే ఆ తర్వాత కాలంలో ప్రయోజనం పొందవచ్చని, అదే అ సమయంలో కావల్సినంత కదలిక లేకుండా పిల్లల్ని ఒకేచోట కూర్చోబెట్టటం వంటివి చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని హెచ్చరిస్తునారు. అంతే కాదు పౌష్టికాహారం కూడా పిల్లల్లో ఎముకలు ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడుతుందని, పిల్లలు తినరంటూ ఎదో ఒకటిలే అని పెట్టడం వంటివి చేసే తల్లులు ఓసారి ఆలోచించటం అవసరమని కూడా చెబుతున్నారు ఆహారం, వ్యాయామం వంటివి పెద్దలకే కాదు పిల్లలకూ ముఖ్యమేనని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అవసరం... వీలయినంతలో పిల్లలు, పెద్దలు వ్యాయామాలు వంటివి చేయటం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదూ.. ఆలోచించడమే కాదు.. తప్పకుండా అచరణలో కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ ఆలోచన, ఆచరణ మీరు ఎంతగానో ప్రేమించే మీ పిల్లల భవిష్యత్‌కు ఆరోగ్యకరమైన బాట పరుస్తాయి.