Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎదిగిన ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయినా అతనికి బాధ్యతలు పట్టవు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనే లేదు. ఇంటి గురించి పట్టించుకోకపోయినా అప్పుడప్పుడు ఇంటికైనా వచ్చేవాడు. ఇప్పుడు అసలు ఇంటికి రావడమే మానేశాడు. పెద్దమ్మాయికి మంచి సంబంధాలు చూసి పెండ్లి చేయాలి. చిన్నమ్మాయికి ఎంటెక్‌లో సీటు వచ్చింది. కాలేజీలో చేర్పించాలి. ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియని జ్యోతికి ఏం చేయాలో తోచడం లేదు. అలాంటి పరిస్థితుల్లో అన్న సాయంతో న్యాయం కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి తన సమస్యను ఇలా చెప్పుకొచ్చింది... 'మేడమ్ నాకు పెండ్లయి 25 ఏండ్లు. మావారు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తారు. పేరు శ్రీధర్. నా గురించి కానీ, పిల్లల గురించి కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ వయసులో కూడా తన కోర్కెలు తీర్చమని ఎప్పుడు పడితే అప్పుడు నన్ను వేధిస్తుంటాడు. ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్ ఏమైతుందనే ధ్యాసే లేదు. తన సుఖం తప్ప ఇంటి గురించి పట్టదు. పైగా ఈ మధ్య వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. లేదంటే మెసేజ్‌లు పెడుతుంటాడు. ఇదేంటని అడిగితే విపరీతంగా కొడతాడు, తిడతాడు. ఎప్పుడూ బయటే ఉంటాడు. ఎక్కడ వున్నది ఎప్పుడు వచ్చేది చెప్పడు. ఫోన్ చేస్తే తియ్యడు. ఓ సారి ఆయన ఫోన్ తీసుకుని చూశాను. మెసేజ్‌లన్నీ అసహ్యంగా ఉన్నాయి. ఆమె ఎవరో తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెనే నిలదీశాను. ముందు ఆమె ఒప్పుకోలేదు. మెసేజ్‌లు చూపిస్తే మా ఆయనతో సంబంధం ఉందని ఒప్పుకుంది. ఈ వయసులో ఆయన చేసే పనులు నచ్చలేదు. అందుకే నేను నా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేశాను. ప్రస్తుతం నేను మా అమ్మవాళ్ళ దగ్గరే ఉంటున్నాను. ఆయనతో మీరే మాట్లాడి మా కుటుంబాన్ని కాపాడండి' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
జ్యోతి చెప్పింది అంతా విన్న లీగల్ సెల్ సభ్యులు వచ్చే వారం శ్రీధర్ని రమ్మని లెటర్ పంపారు. చెప్పిన ప్రకారమే అతను వచ్చాడు. సభ్యులు అసలు ఏం జరిగిందని అతన్ని అడిగితే ''మేడమ్ జ్యోతికి డబ్బు పిచ్చి ఎక్కువ. ఇంట్లో ఎంత ఇచ్చినా ఇంకా అడుగుతూనే ఉంటుంది. విపరీతంగా ఖరుచపెడుతుంది. వచ్చిన దాంట్లోనే సర్దుకుపోవాలి కదా... కానీ ఆమె అలా చేయదు. పైగా నన్ను అస్సలు దగ్గరికి రానీయదు. అందుకే ఇలా చేశా'' అన్నాడు.
ఎదిగిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. భార్యా పిల్లలంటే బాధ్యత
లేకుండా వ్యవహరిస్తే ఎలా? వయసు పెరిగే కొద్ది కుటుంబం కోసం కొన్ని త్యాగం చేయక తప్పదు. కానీ నువ్వు నీ గురించి తప్ప
నిన్నే నమ్ముకున్న భార్యా పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. చివరకు నీ భార్యతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు. ఇష్టం లేకుండా పరాయి ఆడవాళ్ళనే కాదు భార్యను తాకినా అది కేసు అవుతుంది. ఈ విషయం తెలుసుకో.
నువ్వు ముందు నీ భార్యతో మర్యాదగా, గౌరవంగా, ప్రేమగా ఉంటే తనూ నిన్ను అభిమానిస్తుంది. ఇద్దరూ అర్థం చేసుకుని ప్రేమగా ఉండొచ్చు. కానీ నువ్వు వయసుతో సంబంధం లేకుండా నడుచుకుంటున్నావు. సంపాదన తక్కువంటూనే ఇప్పుడు వచ్చిన సంపాదన మొత్తం ఎవరికో ఖర్చు చేస్తున్నావు. రేపు నీ పిల్లల భవిష్యత్ ఏమిటి'' అని నిలదీశారు.
దానికి శ్రీధర్ ''మేడం నా భార్య చెప్పింది నిజమే. నేను చేసింది తప్పే. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. పద్మ అనే ఆమెతో నాకు సంబంధం ఉంది. నా ఫోన్లో జ్యోతి చూసిన మెసేజ్‌లు నిజమే. జ్యోతి వెళ్ళి పద్మను అడిగినపుడు తను కూడా ఇంకెప్పుడూ నన్ను కలవనని చెప్పింది. నేను కూడా అదే చెబుతున్నాను. ఇంకెప్పుడూ ఆమెను కలవను. నా పిల్లల్ని మంచిగా చూసుకుంటాను. నాకు వచ్చే సంపాదనలో నా భార్యా పిల్లల్ని పోషించుకుంటాను. ఇంకెప్పుడూ జ్యోతిని ఇబ్బంది పెట్టను. నా కోర్కెలను తీర్చమని వేధించను. ఇకపై పద్మతో మాట్లాడను. కుటుంబ విషయాల్లో జ్యోతికి అన్ని రకాలుగా సహకరిస్తాను. తను జాబ్‌కు వెళితే ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తాను. ఇంకెప్పుడూ జ్యోతి కొట్టను, తిట్టను. నేను ఎక్కడికి వెళ్ళినా జ్యోతికి కచ్చితంగా చెబుతాను. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. తనని కూడా నాతో మంచిగా ఉండమని చెప్పండి. నాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అందులోనే సర్ధుకుపోదాం అంటే నా మాట వినదు. డబ్బుల కోసం నన్ను వేధిస్తుంటుంది. అందుకే నాకు కోపం వస్తుంది'' అన్నాడు.
''మేము చెప్పేది మేము చెబుతాము. అయినా నీ భార్యకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా ఉంటే తనూ నీతో మంచిగానే ఉంటుంది. నీ ప్రవర్తన మార్చుకో.. బాధ్యతగా ఉండు. అప్పుడు కూడా తను నీతో సరిగా లేకపోతే నువ్వు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పొచ్చు'' అన్నారు.
తర్వాత శ్రీధర్‌ను బయటకు పంపించి జ్యోతితో ''చూడు జ్యోతి నువ్వు కూడా ఇకపై పదే పదే అతన్ని సూటి పోటి మాటలు అనడం మానుకో. ఉన్నదాంట్లో చక్కగా ఎలా బతకాలో తెలుసుకో. డబ్బు కోసం ఊరికే నీ భర్తను వేధించకు'' అన్నారు.
''ఆయన మారతాను అన్నాడు. పద్మతో ఇకపై సంబంధం పెట్టుకోని అన్నాడు. నేను కూడా ఆయనకు సహకరిస్తాను. ఇకపై డబ్బుల కోసం వేధించను. ఆయన నాతో పిల్లలతో మంచిగా ఉంటే చాలు. ఆయనతో వెళ్ళడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఎన్ని సార్లు చెప్పినా ఆయన నా మాట వినలేదు. మీరు చెప్పిన తర్వాతే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఆయన మారితే నాకు అంతే చాలు'' అంది.
''ఇప్పటి నుండి ఇద్దరూ కలిసి మెలిసి ఉండండి. పిల్లలిద్దరికి మంచి భవిష్యత్తు చూపించండి. అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మూడు నెలల పాటు వారం వారం మా లీగల్‌సెల్‌కు వచ్చి ఎలా ఉంటున్నారో చెప్పి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళండి'' అని లీగల్‌సెల్ సభ్యులు ఇద్దరికీ చెప్పి పంపించారు.
- సలీమ