Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ అనే పదం తలపుకు రాగానే కలిగే ఆనందం,ఆ పిలుపు లోని మాధుర్యం మాటల్లో వర్ణించ లేనిది. కడుపులో నలుసుసపడిన నాటినుంచి నవ మాసాలు మోసి, ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలను పంచి అమ్మ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో బిడ్డను చూసి తన ప్రసవ వేదనను మర్చిపోతుంది. అమతం ఎలా ఉంటుందో తెలియదు కానీ, అమ్మ ముందు.. అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ జగతిని మరిపింప చేస్తోంది. అమ్మ అనే పదానికి అంతటి మహత్యం ఉంది. ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా తల్లిప్రేమ.. తల్లి త్యాగం గురించి మానవితో పంచుకుంటున్నా...
బిడ్డకు చిన్న బాధ కలిగినా... కష్టం కలిగినా... ఆకలైనా అందరి కంటే ముందే అమ్మ పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవసురాలు అవుతుంది. ఇంటికి రావడం ఆలస్యమైతే గుమ్మంలోనే మన కోసం కండ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డల్ని పెంచి పెద్దచేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడతను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది. ఓ తల్లిగా.. ఓ స్నేహితురాలిగా.. ఓ మార్గదర్శిగా ఇలా మన జీవితంలో ప్రతి మలుపులో వెన్నుతట్టి ప్రోత్సహించేది అమ్మే.
భవితకు బాటలు వేసేది అమ్మ
అమ్మ సలహాల్లో ధైర్యం ఉంటుంది. ఆమె మాటల్లో ఓదార్పు ఉంటుంది. మమకారాన్ని పంచుతూ, మమతను చాటుతూ అమ్మ ఆలనా పాలనలో ఎదుగుతూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం ఓ మధురమైన అనుభవం. చదువురాని అమ్మ కూడా బిడ్డకు బుద్ధి చెప్పగలదు. డబ్బు లేని అమ్మ కూడా తన బిడ్డల కడుపు నింపగలదు. కండ్లు లేని అమ్మ కూడా తన బిడ్డకు వెలుగు దారి చూపగలదు. అద్భుతమైన స్నేహం అమితమైన ప్రేమ. అంతులేని అనురాగం అలుపెరుగని ఓర్పు అపురూపమైన కావ్యం అరుదైన రూపం అమ్మ. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.1914వ సంవసరం నుంచి మదర్స్ డే ను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ వేడుకకు అంకురార్పణ చేశారు. తర్వాత క్రమంగా ఇతర దేశాల వారు జరుపుకోవడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం రోజున మాత దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
అమ్మ నాకు ఓ ఛత్రం
అమ్మ పేరు సుగుణ.నాన్న పేరు మంత్రవాది రామకష్ణ ప్రసాద్. మా స్వగ్రామం బందరు. అమ్మ, నాన్న ఇద్దరు సంగీత విద్వాంసులు. మా అమ్మ నాన్నలకు మేము ఇద్దరం సంతానం. నాకొక అక్క ఉంది. నేను చాలా చిన్న వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాను. అమ్మ, నాన్న ద్వారా నాకూ స్వతహాగా చిన్నతనంలోనే సంగీత జ్ఞానం వచ్చేసింది. అక్క కూడా క్లాసికల్ సింగర్. నా 10వ ఏటా నుంచే కచేరీలు చేయటం ప్రారంభించాను. నన్ను ఓ పెద్ద గాయనిగా చూడాలని వాళ్లకు ఉండేది. నేను ఈ రోజున ఓ గాయనిగా గుర్తింపు తెచుకున్నాను అంటే అమ్మే కారణం. నాకు మూల స్తంభం మా అమ్మ. ఎక్కడ కార్యక్రమం జరిగిన ఆ కార్యక్రమంలో ఒక్క పాట పాడితే చాలు ఎంతో ఉప్పొంగి పోయేవారు. నాన్న కొంచెం గారాబం చేసినా అమ్మ మాత్రం ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ఎక్కడ ప్రేమ చూపాలో చూపించే వారు, ఎక్కడ మెచ్చుకోవలో మెచ్చుకునేవారు. నా పెండ్లి తర్వాత కూడా అమ్మ నా కుటుంబాన్ని చూసుకునేవారు. నేను కొన్ని నెలలు కార్యక్రమాలు చేయటానికి విదేశాలకు వెళ్ళేదాన్ని. ఆ సమయంలో మా అమ్మాయి బాధ్యత, మా కుటుంబ బాధ్యత అమ్మే చూసుకునేవారు. నా 40 సంవత్సరాల సుదీర్ఘ సంగీత ప్రయాణం ఎటు వంటి చీకూ చింత లేకుండా సాగిందంటే అమ్మే కారణం. ఈ రోజు వరకు నాకు ఎవరితోనూ ఎటువంటి మనస్పర్థలు, గొడవలు లేకపోవడానికి కారణం అమ్మ పెంపకం. ఆవిడ నాకు ఓ ఛత్రం. ఆ ఛత్రం కింద ఎంతో సెదతీరేదాన్ని. నేను అనుకున్నది ఏదైనా జరగనప్పుడు బాగా డిస్టర్బ్ అవడమెకాక మానసికంగా కుంగిపోయేదాన్ని. అటువంటి సమయంలో అమ్మ నాకు ధైర్యం చెప్పడమే కాక, ఆ డిస్ట్రబెన్స్ నుండి బైటపడేసేది. నా స్నేహితులు ఎవరైనా ఫోన్ చేసినా ముందుగా అమ్మ గురించే అడుగుతారు. లేదా అమ్మకి నేరుగా ఫోన్ చేసి మాట్లాడతారు. ఆవిడ అందరిని అలా కలుపుకుని ఆదరించేవారు. బంధుప్రీతి కూడా ఎక్కువ. ఎవరికి ఏ అవసరం వచ్చినా సాయం చేసేవారు. కష్టాల్లో అండగా నిలబడే వారు. అమ్మలేనీదే నేను లేను. ఏదైనా సరే అమ్మని అడగకుండా చేయను. నేను పూర్తిగా అమ్మ మీద డిపెండెంట్ని. నా ఫ్రెండ్స్ అందరూ ఆటపట్టిస్తుంటారు అమ్మ కూచి అని. అమ్మ గురించి ఎన్నో చెప్పాలని ఉంది. కానీ పదాలు రావటం లేదు. మా అమ్మ పేరుకు తగ్గట్టు సుగుణాలరాసి.
- విజయలక్ష్మీ, గాయిని
ఓ తాటిపై నడిపించింది
అమ్మ పేరు సావిత్రి, నాన్న కష్ణ రావు. మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లి తండ్రులకు మేము 13 మంది సంతానం. అమ్మ చదువుకోక పోయిన కుటుంబాన్ని ఓ తాటి పై నడిపించింది. ఆడపిల్లల్లో నేను చిన్న దాన్ని. ఓ నర్తకిగా, నటిగా ఎదిగాను అంటే అమ్మే కారణం. నా సినిమాలు, సీరియల్స్ అన్ని చూసి ఎలా నటించానో, ఎలా నటించవచ్చో చెప్పేది. నేను నటిగా నా జీవితం ప్రారంభించినప్పటి నుండి అమ్మ నా దగ్గరే ఉండేవారు. అమ్మ ఎప్పుడూ ఓ మాట అనేవారు 'నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎప్పుడు ఎదుటి వారిని మర్యాదగా చూడాలి, గౌరవించాలి అనేవారు. ఎదుటివారు కూడా మనల్ని గౌరవించాలి. అంటే మన ప్రవర్తన కూడా అంతే మంచిగా ఉండాలి' అనేవారు. అమ్మకు బంధుప్రీతి ఎక్కువ. ఎవరు ఏ సమయానికి వచ్చినా నవ్వుతూ అందరిని ఆదరించేది. వారికి ఇష్టమైన వంటలు చేసి పెట్టేది. నాతో నటించే సహా నటులు వస్తే అమ్మ కాళ్ళకు దండం పెట్టేవారు. ఎందుకమ్మా నీకు అందరూ దండం పెడతారు అని అడిగితే 'నేను ఇంతమందిని కన్నాను, నా కడుపు చల్లన కదమ్మ, అందుకు పెడుతున్నారు' అని చెప్పేవారు. అమ్మ కుట్లు, అల్లికలు బాగా చేసేవారు. నేను కూడా అమ్మ దగ్గర అవన్నీ నేర్చుకున్నాను. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.
- రాగిణీ, నటి
అమ్మ పాత్ర పెద్దది
అమ్మ పేరు ప్రేమ. నాన్న వెంకట రమణా రాంమూర్తి. మా స్వగ్రామం బళ్లారి. కానీ మేము ఎన్నో ఏండ్ల కిందటే హైద్రాబాద్లో స్థిరపడ్డాం. మా తల్లిదండ్రులకు మేం ఇద్దరం సంతానం. అన్నయ్య, నేను. అన్నయ్య క్రికెట్ ఆడేవాడు. నాన్నగారు మా చిన్నవయసులోనే మరణించారు. దానితో కుటుంబ భారం మొత్తం అమ్మ మీద పడింది. అమ్మ సంగీత విద్వాంసురాలు. మంగళంపల్లి గారి శిష్యురాలు. సంగీతం పాఠాలు చెప్తూ, కచేరీలు చేస్తూ మా బాగోగులు చూసుకునేది. అమ్మ ఎవరి మీద ఆధారపడకుండా మా పనులు మేము చేసుకునేలా నేర్పించింది. చిన్నతనంలోనే ఇంటిపనులు, వంట మొదలైనవి నేర్చుకున్నాను. నేను సంగీతం పట్ల చిన్నప్పటి నుంచే ఆసక్తిని పెంచుకున్నాను. స్కూల్లో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయంగా ఎన్నో గాత్ర కచేరీలు చేసాను. ఫ్లూట్ అనేది స్వతహాగా నా అభిరుచి మేరకు నేర్చుకున్నాను. ఏ గురువు దగ్గర శిష్యరికం చేయలేదు. నేను అమ్మను ముందుగా గురుస్థానంలో చూస్తాను. ఆ తర్వాతనే అమ్మ. నా సంగీత ప్రస్థానంలో అమ్మది పెద్ద పాత్ర. సంగీతంలో సాధన ఎంత చేస్తే అంత రాణిస్తావనేవారు. నేను ఎలా పాడాను, ఎక్కడ బాగా పాడలేదు ఇటువంటివన్నీ చర్చించేవారు. ఓ ప్రోత్సహకర విమర్శ ఎప్పుడు అమ్మదగ్గర నుంచి ఉండేది. పెద్దల పట్ల గౌరవంగా ఉండాలనేవారు. ఎదుటి వారు చదువుకోని వారు అయిన సరే పెద్దవారికి గౌరవం ఇవ్వాల్సిందే అనేవారు. అలాగే పెద్దలు కోప్పడినా ఎదురు చెప్పవద్దు అనేవారు. మమ్మల్ని మంచి క్రమశిక్షణతో పెంచారు. అమ్మకు ఈ మధ్యనే ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది. న్యూయార్క్ రాక్ ఫౌండేషన్ అవార్డ్. ఈ అవార్డ్ అందుకోవడానికి అమెరికా వెళ్ళాలి. ఇంతటి గొప్ప సంగీత విద్వాంసురాలి కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నాను.
- జయప్రదారామ్మూర్తి, ఫ్లూటిస్ట్