Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవల ఎనర్జీ డ్రింక్‌లు అధికంగా తాగడం వల్ల కపాలానికి రంధ్రం పడి చనిపోయిన వ్యక్తి గురించి ఉదహరించింది.
ఒక మనిషి శారీరక అవసరాలకు రోజుకు 50 గ్రాముల చక్కెర సరిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతాయి. అయితే ఒక ఎనర్జీ డ్రింక్‌లోనే దాదాపు 52 గ్రాముల చక్కెర ఉంటుంది! యుక్తవయసులోని మనిషికి రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవడమే ఎక్కువ. 500 మిల్లీగ్రాముల ఎనర్జీ డ్రింక్ క్యాన్‌లో దాదాపు 160 ఎమ్జీ కెఫిన్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధనల ప్రకారం ఎనర్జీ డ్రింకులకు అలవాటుపడ్డ యువత తదుపరి దశలో ఆల్కహాల్‌పై ఆసక్తిచూపే అవకాశం ఉందని తేలింది. ఎనర్జీ డ్రింకులు యువతను ఆ విధంగా ప్రేరేపిస్తాయని ఆ వర్సిటీ అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
ఎనర్జీ డ్రింకులను అతిగా సేవించడం వల్ల శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తుంది. ఐరన్‌లోపం వల్ల మనిషి చాలా త్వరగా అలసి పోవడంతో పాటు రకరకాల దుష్పరిణామాలు ఉంటాయి. ఆ పానీయాల్లో ఉండే కెఫైన్ శరీరంలో ముఖ్యమైన భాగాల మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందని తెలిపింది. దీని వల్ల గుండె లయ తప్పడం, రక్త ప్రసరణలో అవరోధాలు ఏర్పడడం జరుగుతుందని చెప్పింది. ఇప్పటికే బీపీ, హద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారు ఎనర్జీ డ్రింకులకు దూరంగా ఉండాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సంస్థ కూడా సూచించింది.
ఇవి ఎనర్జీ డ్రింకులను తీసుకోవడం వల్ల శరీరంపై పడే ప్రభావాలు. వీటిని బట్టి చూసుకొంటే ఎనర్జీ డ్రింకులు సేవించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో సులభంగా అర్థం అవుతుంది. వాటికి బదులుగా సహజంగా లభించే పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.