Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందులోనూ అండు కొర్రల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణాశయం, అర్త్రయిటిస్ (కీళ్ళ వాతం), బీపీ, థైరాయిడ్, ఊబకాయం, కంటి సమస్యలు నివారణకు బాగా ఉపయోగపడుతాయి. అలాగే మెదడు, రక్తం, రొమ్ము, ఎముకలు, ఉదర, పేగుల, ఫిషర్, అల్సర్, చర్మ, సంబంధ కాన్సర్ల చికిత్సకు కూడా బాగా పని చేస్తాయి. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొడుతుంది. అలాంటి అండుకొర్రలతో కొన్ని వంటకాలు...
ఊతప్పం
కావలసిన పదార్ధాలు: అండు కొర్రలు - పావు కప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద - టీ స్పూను, నూనె - తగినంత, మినప్పప్పు -టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, టొమాటో తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,
తయారుచేసే విధానం: అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి గ్రైండర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం, పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరవాత (రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.
పొంగలి
కావలసిన పదార్ధాలు: అండు కొర్రలు - అర కప్పు, నెయ్యి లేదా నూనె - తగినంత, కొబ్బరి పాలు - రెండు కప్పులు, పెసర పప్పు - అర కప్పు, మిరియాల పొడి - పావు టీ స్పూను, జీడి పప్పులు - 10, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెమ్మలు, జీలకర్ర - టీ స్పూను.
తయారుచేసే విధానం: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఓ పాత్రలో అండు కొర్రలు, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి జత చేసి కలియబెట్టాలి. ఉడికించిన పెసర పప్పు వేసి మరోమారు కలియబెట్టాలి. స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి. జీలకర్ర, జీడి పప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఉడుకుతున్న పొంగలిలో వేసి కలియబెట్టి దింపేయాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో అందిస్తే రుచిగా ఉంటుంది.
కిచిడి
కావలసిన పదార్ధాలు: పెసర పప్పు - అర కప్పు, ఉల్లి తరుగు - అర కప్పు, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, అండు కొర్రల రవ్వ - కప్పు, తరిగిన పచ్చి మిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, తరిగిన టొమాటో - ఒకటి, అల్లం తురుము - అర టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, పసుపు - కొద్దిగా, నెయ్యి - ఒక టేబుల్ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి నెయ్యి వేసి కరిగించుకొని ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత కరివేపాకు, పసుపు వేసి మరోమారు కలియబెట్టాలి. మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. పెసర పప్పు, అండు కొర్రల రవ్వ వేసి కలియబెట్టాలి. మంట బాగా తగ్గించుకొని గిన్నె మీద మూత పెట్టి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. అంతే వేడి వేడి అండు కొర్రల కిచిడీ రెడీ.
ఉప్మా
కావలసిన పదార్ధాలు: అండు కొర్రల రవ్వ - మూడు కప్పులు, పచ్చి సెనగ పప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - ఒక టీ స్పూను, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, టొమాటో తరుగు - పావు కప్పు, మినప్పప్పు - టేబుల్ స్పూను, ఉల్లి తరుగు - పావు కప్పు, అల్లం తురుము - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఉప్పు - తగినంత తరిగిన పచ్చి మిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెమ్మలు, క్యారట్ తరుగు - పావు కప్పు.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ మీద బాణలి వేడయ్యాక అండుకొర్రల రవ్వను వేసి నూనె వేయకుండా దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో నూనె వేసి కాగాక మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి తరుగు, క్యారట్ తురుము, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. కరివేపాకు వేసి మరోమారు కలియబెట్టాక, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి, మరిగించాలి. వేయించి ఉంచుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతుండాలి. మంట బాగా తగ్గించి బాగా మెత్తబడే వరకు ఉడికించి దింపేయాలి. అంతే వేడివేడి అండు కొర్రల ఉప్మా రెడీ.. దీన్ని కొబ్బరి లేదా అల్లం చట్నీతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.