Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరంలో జీవక్రియలకు నీరు అవసరం. ఆహారం కంటే కూడా ముందు నీరే ప్రాణాధారం. నీరు లేకుండా మహా అంటే ఓ వారం మాత్రమే బతకగలం. కానీ ఆహారం తీసుకోకుండా ఓ నెల రోజుల వరకు ప్రాణాలతో ఉండొచ్చు. నీరు లేకపోతే శరీరంలో రక్త పరిమాణం సైతం తగ్గిపోతుంది. మొదటి దశ డీహైడ్రేషన్ (నీరు, లవణాలు లోపించడం)తో తలతిరగడం, చిరాకు, తలనొప్పి వస్తాయి. రెండో దశలో అలసిపోవడం, కంటి చూపు మందగించడం జరుగుతుంది. చివరి దశలో తలతిరగడంతో పాటు వాంతులు కనిపిస్తాయి. ఇక ఈ దశలో కూడా నీరు తీసుకోకపోతే కోమాలోకి వెళ్లి ప్రాణం పోవడం జరుగుతుంది. నీరు తగ్గుతున్న కొద్దీ జీవ క్రియలు ఒక్కొక్కటి పని చేయడం నిలిచిపోతుంది. కేవలం వేసవిలోనే కాదు, ఇతర కాలాల్లోనూ డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం) స్థితికి లోనయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి.
నీరు ఎంత సరిపోతుంది: ఆరోగ్యవంతులైన పెద్దవారు రోజులో ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల(మధ్య సైజు) నీటిని (రెండు లీటర్లు సుమారు) తాగాలన్నది ఓ సూత్రం. కానీ వయసు, లింగం, వారి శారీరక చర్యలు, గర్భంతో ఉన్న వారు, పాలిచ్చే తల్లులు ఇలా వివిధ అంశాలను బట్టి తీసుకోవాల్సిన నీటి పరిమాణం ఆధారపడి ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఉదాహరణకు ఎప్పుడూ ఏసీలో ఉండే వారికి చెమట పట్టదు. మూత్ర విసర్జన ద్వారానే నీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి వారు రోజులో రెండున్నర లీటర్లకు మించి తీసుకోకూడదట. ఇంతకుమించితే మూత్ర పిండాల్లో నీటి గాఢత పెరిగి ఎడెమాకు దారితీస్తుంది.
సాధారణ రోజుల్లో కంటే వేసవిలో కనీసం 20 శాతం అధిక పరిమాణంలో నీరు అవసరం. అది కూడా సాధారణ స్వచ్ఛమైన నీరే మంచిదన్నది నిపుణుల సూచన. టీ, కాఫీలు ద్రవ పదార్థాలైనప్పటికీ ఇవి నీటికి ప్రత్యామ్నాయం కాదు. ఉదయం లేచిన తర్వాత 400 ఎంఎల్ నుంచి 800 ఎంఎల్ వరకూ నీటిని తీసుకోవచ్చంటున్నారు. శారీరక శ్రమ ఉండే వారు మూడు లీటర్ల వరకు తీసుకోవచ్చని చెబుతున్నారు. నీరు తగినంత ఉందా? లేదా? అని తెలుసుకోవడం చాలా సులభం. మూత్రం లేత పసుపు రంగులో ఉందంటే సరిపడా నీరు ఉన్నట్టు. చిక్కటి పసుపు రంగులో ఉంటే శరీరంలో నీరు తక్కువగా ఉన్నట్టు.
ఏం టైంలో ఎంత: పరగడుపున ఉదయం నిద్ర లేచిన వెంటనే నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయన్నది వైద్యులు చెప్పే మాట. కడుపును శుభ్రం చేయడమే కాకుండా ఎన్నో వ్యాధులను నివారిస్తుందట. పెద్ద పేగును శుభ్రం చేసి తిన్న ఆహారం నుంచి పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించేలా మారుస్తుంది. చర్మం కాంతులీనుతూ ఉండాలంటే ఇలా నీరు తీసుకోవడం మంచిది. ఇలా పరగడుపునే నీటిని తీసుకోవడం జీవక్రియలకు మంచి బూస్ట్ నిస్తుందంటున్నారు నిపుణులు. కణాల ఉత్పత్తికీ సహకరిస్తుందట. బరువు తగ్గేందుకూ ఉపయోగపడుతుందంటున్నారు. రాత్రి నిద్రించిన తర్వాత నుంచి చాలా గంటల పాటు నీటిని తీసుకోకుండా ఉంటాం గనుక తగ్గిన నీటి పరిమాణాన్ని ఉదయమే తాగిన నీరు భర్తీ చేస్తుందట. పైగా, ఇలా నీరు తాగిన వెంటనే ఏ ఆహారాన్ని వెంటనే తీసుకోరాదు. కనీసం గంట విరామం ఇవ్వాలి..
చల్లటి నీరు ఎప్పుడు: వ్యాయామాలు చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని చల్లబరిచేందుకు ఆ సమయంలో చల్లటి నీరును తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. వ్యాయామాలు చేసిన తర్వాత వేడి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదు. ఇది తప్ప మిగిలిన వేళల్లో వేడి నీటిని తాగడం వల్లే మంచి ఫలితాలను పొందొచ్చన్నది నిపుణులు సూచన. ముఖ్యంగా ఆహారం తీసుకునే సమయంలో, తీసుకున్న తర్వాత చల్లటి నీటిని తాగరాదు. దీనివల్ల ఉష్ణోగ్రతను పెంచేందుకు శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల జీర్ణప్రక్రియ నిదానించి అజీర్ణానికి దారి తీస్తుంది.