Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్సిజన్ అందక ప్రాణాలు పోవటమనే దుర్భర విషయాన్ని చూడవలసి వస్తున్నది. ముందు ముందు మనం కూడా వీపున ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకొని తిరగవలసిన పరిస్థితి దాపురించేలా ఉన్నది. ఇప్పుడు చేతిలో మంచి నీళ్ళ బాటిల్ పెట్టుకొని తిరిగినట్టుగా. మానవుడు నాగరికత పేరుతో అభివృద్ధి అనుకుంటూ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే దాపురించే పరిస్థితి ఇదే. ప్రకృతి ప్రకోపిస్తే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కరోనా విలయ తాండవాల్లాగానే ఉంటాయి. మలమల మాడిపోయే చీమల్లా, నేల రాలే పిట్టల్లా మనుషుల పరిస్థితి తయారవుతుంది. ఒకరి మీద మరొకరు నెపాలు నెట్టుకుంటూ ప్రకృతిని రక్షించకపోతే మనం మున్ముందు ఇంకా ప్రళయాలు చూడవలసి వస్తుంది. వాక్సిన్ల కొరత, ఆక్సిజన్ల కొరత, బెడ్ల కొరత - ఇవన్నీ గత సంవత్సర ఊహించినవే అయినప్పటికీ ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు. ఈవేళ ప్రపంచం అంతా యుద్ధ వాతావరణమే కానవస్తోంది. మనిషి, తనలో దాక్కున రక్కసి కరోనాతో యుద్ధం సాగిస్తున్నాడు. ఆ రాక్షసిని అంతమొందించాలంటే ఇంట్లో ఉండటమే ప్రధాన అస్త్రం. మాస్కులు, శానిటైజర్లు, దూరాలు మిగతా అస్త్రాలు. మనం ఈ అస్త్రాల్ని ప్రయోగిద్దాం.
ఆలూ, క్యారట్లతో
మన ఫ్రిజ్‌లో ఉండే కూరగాయలతోనే మనం బొమ్మలు చేసుకుందాం. రోజూ కూరలు వండుకొని తినే కూరగాయలను జంతువు లుగా రూపొందించి నేను 'బొటానికల్ జూ' అనే పుస్తకాన్ని రాశాను. ఇప్పుడు కేవలం జంతువులనే కాకుండా మనుష్యులనూ తయారు చేస్తున్నాను. అదీ కూడా రకరకాల హావభావాలతో, రకరకాల ధీమ్‌లతో చేస్తున్నాను. నేను ఏపనైనా చేయగలను అనే ఆత్మనిర్భరత కలిగిన మహిళలను రూపొందించాలనుకున్నాను. నేను ఈ మధ్య ఎక్కువగా మహిళల చిత్రాలనే ఎన్నుకుంటున్నాను. ఒక ఆలుగడ్డను, ఒక క్యారట్ ముక్కను తీసుకున్నాను. క్యారెట్ ముక్కకు కండ్లు, నోరు పెట్టాను. ఈ తలకు మొండెంగా ఆలుగడ్డను పెట్టాను. వంపు తిరిగిన రెండు చిక్కుడు కాయలను రెండు చేతులుగా అమర్చాను. తలపై జుట్టు లాగా కొత్తిమీర ఆకుల్ని కత్తిరించి అమర్చాను. వెడల్పు కుచ్చులతో ఒక లెహంగా కుట్టి తొడిగాను. ఈ లెహంగా కోసంగానూ స్నేక్ లీవ్స్ ఆర్నమెంట్ చెట్టు నుంచి ఆకుల్ని కోసుకొచ్చాను. ఈ ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉండి చిరుగాలికే కదులుతూ ఉంటాయి. లెహంగా ముచ్చటగా అమరింది.
పీస్లిల్లీ, తెల్ల తుమ్మలతో
ఐస్లిల్లీ అనేది 'ఆరేసి' కుటుంబానికి చెందిన మొక్క. దీని పేరుతో లిల్లీ ఉంది కదాని లిల్లీ పూలకూ వీటికీ చుట్టరికమేమీ లేదు. గార్డెన్లల్లో సులభంగా అల్లుకుపోతుందని పెంచుతాయి. చెట్లు చిన్నగా ఉంటుంది. పూలు మాత్రం చెట్టు దాటిపైకి వచ్చి పూస్తాయి. ఇది నాగుపాము పగడ ఆకారంలో ఉంటుంది. లోపల ఉండే కేసరాల గుచ్చాన్ని శివుడు అని అంటారు. పగడ లాంటి ఆకర్షణ పత్రం కింద తెల్లగా పొడుగా గుండ్రంగా ఉండే కేసరాల గుచ్ఛాలను కోసుకొని తెచ్చాను. వీటితో ఏదైనా చేయాలని తలచాను. ఈ పీస్లిల్లీ యొక్క శాస్త్రీయనామము ''స్పాతిఫిల్లమ్''. ఇంట్లో కుండీలలో కూడా సులభంగా పెరుగుతుంది. మా అబ్బాయి చదివే కాలేజీ ముందు గార్డెనంతా ఈ చెట్లతో నిండిపోయి ఆహ్లాదంగా కనిపించింది. ఆ గార్డెన్‌లోనే ఒక పక్కన ఒక పెద్ద చెట్టుంది. దాని కింద రాలిపోయిన కాయల విడిభాగాలున్నాయి. 'అదేమి చెట్టని' అక్కడి సెక్యూరిటీ నడిగితే దీనిపేరు 'బన్నీ మరా' అని చెప్పాడు కన్నడంలో. ఈ చెట్టును దేవాలయాల్లో పెంచి పూజిస్తారట. పువ్వుల్ని గమనిస్తే మన తుమ్మ పూలలా ఉన్నాయి. కాయ విడిపోయి రాలి పోతున్నాయి. విత్తనాలు మాత్రం ఆ కాయలకే అతుక్కుని ఉంటున్నాయి. కేసరాల గుచ్చాలు, కాయలు బద్దలు కలిపి ఆ గార్డెన్ గట్టుమీదనే ఈ చిన్న నెమలిని తయారు చేశాను. నాకు నెమలి బొమ్మ కన్నా రెండు కొత్త చెట్లను పరిచయం చేసుకున్నానని ఆనందంగా ఉంది.
ఎక్స్‌రే ఫలిమ్ కవర్‌తో
మొన్నెప్పుడో పన్ను నెప్పిగా ఉందని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రే తీస్తున్నపుడు దాని కవర్ బాగుందని తీసుకున్నాను. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక ఆ కవరును చూశాను. ఇది కార్బన్ పేపర్లా ఉన్నది. చాలా చిన్న కవరది. హాస్పిటల్లో ఉపయోగించే ప్రతి చిన్న వ్యర్థపదార్థామూ వృధా కాకూడదు. దాంతో బొమ్మలు చేయాల్సిందే అనుకుని ఆ కవరును చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి రెండు పువ్వుల్ని చేశాను. ఇదో వెరైటీ కలర్లో కనపడుతున్నాయి. పెన్సిల్ ముక్కలో ఉండే గ్రాఫైట్ కలర్లో ఉన్నాయి పూలు. ఎక్స్‌రేలు తీసి మనిషిలోని జబ్బు కనిపెట్టి వారి జీవితంలో ఆనందాల పూలు పూయించటమే కాదు. ఎక్స్‌రే కవర్లతో కూడా పూలు పూయించి కనువిందు చేస్తున్నది. ఎక్స్‌రే కవర్ల పూలు అందంగా ఉన్నాయా?
కాకర కాయలతో
కాకరకాయ వేపుడు చేసుకుందామని కాయలు ఫ్రిజ్‌లో నుంచి తీసినపుడు ముదురు ఆకుపచ్చ రంగులో ముద్దుగా కనిపించాయి. నేను ఇంతకు పూర్వం పెద్ద పొడుగాటి కాకరకాయతో మోసలిని చేశాను. గానీ ఇవి చిన్నగా ముద్దుగా ఉండే సరికి పిల్ల మొసళ్ళను చేయాలనిపించింది. వెంటనే నాలుగు కాయలను తీసుకొని ముందు వైపు నోరు లాగా కత్తితో చీల్చాను. ఆ చీలిన నోటిలో ఎర్రటి కాగితపు ముక్కలు పెట్టాను. పైన కళ్ళుండే స్థానంలో చాకుతో గుంటలు పెట్టి అందులో మిరియం గింజల్ని గుచ్చాను. ఉబ్బెత్తు కళ్ళతో తెరిచిన నో్లతో, గొగ్గుల గొగ్గుల చర్మంతో మొసళ్ళలానే ఉన్నాయి కదా! కాకపోతే ఇవి చిన్ని కాకరకాయలు కాబట్టి పిల్ల మొసళ్ళన్న మాట. ఇవి పాకే జంతువులైన సరీసృపాలు. వీటికి రాత్రిపూట నిశితంగా చూసేశక్తి గలదు. అందుకే ఇవి ఎక్కువగా రాత్రిపూట వేటాడతాయి. వీటి జ్ఞానేంద్రియాలు సమర్థవంతగా పనిచేస్తాయి.
పెడిగ్రీతో
''పెడిగ్రీ'' అనేది కుక్కల ఆహారం. మనకు కుర్కురేలు, అలూచిప్స్ ఉన్నట్టుగా వాటికీ ఇవి ఉన్నాయి. ఇవి రకరకాల ఆకారాల్లో దొరుకుతాయి. గుండ్రంగా ఓవల్‌గా, ఎముకల ఆకారంలోనూ ఉంటాయి. ఈసారి 'పెడిగ్రీ' ప్యాకిట్ తీసి దానికి తినిపిస్తున్నపుడు ఈ బోన్ ఆకారపు చిప్స్‌తో ఏదైనా చేద్దామనిపించింది. కాసేపు ఆలోచించాక కుక్క ఆహారంతో కుక్కనే తయారు చేస్తే బాగుంటుంది అనిపించి మొదలుపెట్టాను. బొమ్మ చేసే లోపల నాలుగు సార్లు నాకు ఇంటరప్షన్. దాంతో కుక్క మెడ సాగిపోయింది. మరీ బిక్క మొహం వేసుకొని చూస్తున్నది. నా ఆకారం తెలిసీ నన్నింత చిన్నగా చేస్తావా అని అలిగింది మా కుక్క. మా కుక్క పేరు మైలో. పిలవండి మీరూ! దగ్గర కొచ్చేస్తుంది.