Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఏదోఒకటి సాధించాలని అనుకుంటూ వుంటారు. తమ కెరీర్ తామే ముందుకు కొనసాగించాలనుకుంటారు. ఇతరులమీద ఆధారపడకుండా తమ సొంత ప్రణాళికలతో జీవన విధానాన్ని కొనసాగించాలని అనుకుంటారు. సొంతంగా వ్యాపారాలు లేదా పెట్టుబడులను నిర్వహించుకుని.. ఓ మంచి కెరీర్ని నిర్మించుకోవడానికి జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడుతారు. ముందుగానే అన్ని విషయాల గురించి ఆలోచించుకుని, సమయానుకూలంగా ముందడుగు వేస్తూ.. విజయాలవైపు ముందుకు సాగిపోతారు.
అడుగులు ఎటు వేయాలి?: మరికొంతమంది మాత్రం దొరికిన అవకాశతోనే సర్దుకుపోతూ.. కెరీర్ గురించి ఆలోచించకుండా సామాన్య జీవితాన్ని గడుపుతారు. ఇంకొంతమంది అయితే కెరీర్ను ఎలా మలుచుకోవాలో సరిగ్గా అర్థం కాక.. తికమకతో ఇటు అటూ నిర్ణయాలు తీసుకుంటూ సతమతమవుతుంటారు. ఏ సమయంలో ఎటువంటి అడుగు వేయాలి..? ఎటువంటి ప్రణాళికలు మన జీవితానికి తోడ్పడుతాయి..? అన్న విషయాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.
మీ గురించి మీకే తెలుసు: ఇతరుల చెప్పిన విధంగా నడుచుకోకుండా మీకు మీరుగానే వుండాలి. మీరు నిర్దేశించుకున్న బాటలోనే ముందుకు నడవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే.. మీ గురించి మీకంటే బాగా ఇంకెవ్వరికీ తెలియదు. మీలో వున్న ఇష్టాలు, కోర్కెల గురించి ఈ జగత్తులోనే మరెవ్వరికీ తెలియదు. వాటికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణకు, కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే.. మీరు కోరుకున్న జీవితాన్ని, కెరీర్ ను మలుచుకోగలుగుతారు. వాటికి సంబంధించిన కొన్ని ముందు ప్రణాళికలు, పనులు కూడా నిపుణులు మనకు సూచిస్తున్నారు.
మీరు హ్యాపీగా ఉండాలి: మానవుని కోరికలు అనంతం అంటుంటారు చాలామంది. వాటిని తీర్చుకోవడానికి మొత్తం జీవితాంతం సరిపోదు కాదుకదా... ఆలోచించడానికే సమయం సరిపోతుంది. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైన కోరికలు కూడా వుంటాయి. అటువంటి వాటికే ప్రత్యేక ప్రాధాన్యతను కూడా ఇస్తారు. అలాగే మీకు ఏం చేస్తే నచ్చుతుందో.. ఎలాంటి ఉద్యోగం చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో.. ఏ పని అయితే ఎక్కువ శ్రమ అనిపించదో.. ముందుగా అటువంటి విషయాల గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి!
ఓ పట్టిక రాసుకోండి: మీకు నచ్చిందో ఏదో కూడా మీరు తెలుసుకోలేకపోతే.. ముందుగా మీకు ఎక్కువగా నచ్చే విషయాల గురించి ఒక పట్టికను రాసిపెట్టుకోండి. వాటిగురించే నిత్యం ఆలోచించడం మొదలుపెట్టండి. అందులో మరీ ముఖ్యమైనవి ఏదో ఏకాగ్రతతో గమనించండి. అప్పుడే మీరు మీలో వున్న నైపుణ్యత, సామర్థ్యతను తెలుసుకోగలరు. దానిద్వారా మీకు నచ్చే ఉద్యోగంగానీ, పనిగానీ, భవిష్యత్ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం గానీ జరుగుతుంది.
మరింత పదును చేసుకోవచ్చు: ఇటువంటి వాటి గురించే ఎక్కువసేపు ఆలోచిస్తూ సమయాన్నే వధా చేసుకోకుండా.. దొరికిన ఉద్యోగాలలో చేరిపోవాలి. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ అభిరుచులను, కోరికలను, బేరీజు వేసుకుంటా.. మీ నైపుణ్యాలను మరింత పదును చేసుకోవచ్చు. పని ఎంత కష్టం అయినప్పటికీ దానిని అధిగమిస్తూనే భవిష్యత్ కార్యాచరణలను ఏర్పాటు చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమయానుకూలంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ.. కెరీర్ను నచ్చిన విధంగా మలుచుకుంటూ వెళ్లాలి.