Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో ఊహలు... మరెన్నో ఆశలు... ఎవరైనా జీవితం హాయిగా సాగిపోవాలనే కోరుకుంటారు. ఇది ఆడపిల్లలో మరీ ఎక్కువ... పెండ్లి తర్వాత తమ ఇష్టాలు మారిపోతాయి. మరో కుటుంబానికి విధేయతగా ఉండాలి. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన బంధాలను పదిలపరుచుకోవాలి. ఇది అటువైపు కూడా ఉంటే సమస్యే లేదు. లేదంటే ఓర్పుగా అన్నీ భరించాలి. కన్నీళ్ళను దిగమింగాలి. ఆ ఓర్పే నశిస్తే... కట్టడి చేసిన గొంతు స్పందిస్తే... చివరకు తిరగబడుతుంది. అలా తిరబడిన చిత్ర జీవితం గురించి ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదవండి.
చిత్రది మధ్య తరగతి కుటుంబం. ఓ చెల్లెలు కూడా ఉంది. తల్లి గృహిణి. తండ్రి బ్యాంక్ ఉద్యోగి. మంచి జీతం. ఇద్దరు కూతుళ్ళకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు తండ్రి. పై చదువులు చదివించాడు. బంధువుల్లో మంచి గౌరవం. చిత్రకు పెండ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి పిల్లలకు కూడా మంచి స్థాయిలో ఉన్న వ్యక్తికే ఇచ్చి చేయాలని ఎదురు చూశాడు. అలాంటి సంబంధం కోసం చాలా వెదికాడు. చివరకు ఓ సంబంధం దొరికింది. అతను ప్రభుత్వ ఉద్యోగి. పేరు సతీష్. జీతం బాగా వస్తుంది. అమ్మాయి హాయిగా బతుకుతుందని ఆశపడ్డారు. ఆ సంబంధాన్నే ఖాయం చేశారు. అడిగినంత కట్నం, బంగారం ఇవ్వడానికి సిద్దపడ్డారు. సతీష్, చిత్రతో రోజూ ఫోన్లో మాట్లాడేవాడు.
పెండ్లి రోజు దగ్గర పడింది. చిత్ర తల్లిదండ్రులు మొదటి శుభలేఖను వియ్యాల వారికి ఇవ్వడానికి బయలు దేరారు. అలా వాళ్ళు వెళ్ళారో లేదో ఇలా సతీష్, చిత్రకు ఫోన్ చేశాడు. ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. తర్వాత అరగంటకే చిత్ర ఇంటి దగ్గరకు వచ్చి 'నేను మీ ఇంటి బయటే ఉన్నాను, ఇద్దరం కలిసి బయటకు వెళదాం రా' అన్నాడు. ముందు చిత్ర ఒప్పుకోలేదు. తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కాబోయే భర్త కాదా అని తండ్రి వెళ్ళమన్నాడు.
ఇద్దరూ కలిసి దగ్గర్లోనే ఓ రెస్టారెంట్‌కు వెళ్ళారు. ఇంత సడన్‌గా, చెప్పకుండా ఎందుకు వచ్చావని చిత్ర అడిగితే 'నీతో మాట్లాడలని వచ్చాను' అన్నాడు. విషయం ఏంటని అడిగితే ''ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా?' అడిగాడు. అలాంటిదేమీ లేదని చిత్ర అంటే 'ఇంత అందంగా ఉన్నావు, ఇప్పటి వరకు నిన్ను ఎవ్వరూ ప్రేమించలేదా, కనీసం ఒక్క లవ్ లెటర్ కూడా రాలేదా?' అని గుచ్చి గుచ్చి అడిగాడు. 'అలాంటిదేమీ లేదు, అయినా ఇలా ఎందుకు అడుగుతున్నావు. నాపైన అనుమానమా' అడిగింది. 'ఏమీ లేదు, సరదాగా అడిగాను. మా ఇంట్లో మా అమ్మా, నాన్న, నేనూ ఉంటాం. మాతోపాటు నా స్నేహితుడు కూడా ఉంటాడు. ఇంట్లో మేమందరం అతని మాటే వింటాం. రేపు నువ్వు కూడా అతను చెప్పినట్టే నడుచుకోవాలి' అన్నాడు. ఇదంతా చిత్రకు ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అతని దగ్గర ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. ఆ రోజు జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది.
పెండ్లికి ముందే ఇలా మాట్లాడుతున్నాడంటే, తర్వాత ఇంకెలా చేస్తాడో అని చాలా కంగారు పడ్డారు. అయితే కార్డులు కూడా పంచిన తర్వాత పెండ్లి ఆపితే పరువు పోతుందని, ఇంకా పెండ్లి కావల్సిన చెల్లి ఉందని చిత్ర తండ్రి, సతీష్ తల్లిదండ్రులను పిలిచి జరిగిందంతా చెప్పాడు. 'అయ్యో అలాంటిది ఏమీ ఉండదు. మా వాడు ఏదో సరదాగా అనుంటాడు. మీ అమ్మాయి అనవసరంగా భయపడింది. వాడికి మేం నచ్చజెబుతాం. మీ అమ్మాయికి మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. తన స్నేహితుడు కూడా మూడు నెలలు ఏదో కోర్సు చేయడానికి వచ్చాడు. తర్వాత అతను వెళ్ళిపోతాడు'' అని చెప్పారు. వారి మాటలు నమ్మి పెండ్లి చేశారు.
కానీ పెండ్లైన రోజే చిత్ర కష్టాలు మొదలయ్యాయి. ఆరోజు నుంచి ఆమెను పుట్టింటికి వెళ్ళ కూడదని, వాళ్ళెవ్వరూ తన ఇంటికి రాకూడదని సతీష్ షరతు పెట్టాడు. చిత్ర ఎంత ఏడ్చినా, ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమలాడినా సతీష్ కరగలేదు. ఇక కూతురు అక్కడ సంతోషంగా ఉంటే చాలని మౌనంగా ఉండిపోయారు.
అక్కడకు వెళ్ళిన తర్వాత చిత్రను వేరే గదిలో ఉంచి తను మాత్రం తన స్నేహితుడి గదిలో పడుకున్నాడు. అప్పటి నుంచి రోజూ అదే పరిస్థితి. చిత్ర మాత్రం ఇంటి పనులన్నీ చేయాలి. ముందు రోజు మిగిలిపోయిన అన్నం, కూరలు తినాలి. సతీష్, చిత్రను అస్సలు దగ్గరకు రానియ్యడు. పైగా అసభ్యమైన మాటలతో బాధపెట్టేవాడు. ఇవన్నీ భరిస్తూ అక్కడే ఉంది. అప్పుడప్పుడు వాళ్ళకు తెలియకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసేది. కానీ ఇక్కడి విషయాలేమీ చెప్పేది కాదు. అలా ఆరు నెలలు గడిచింది. సతీష్‌లో ఎలాంటి మార్పూ లేదు. స్నేహితుడితో మాత్రం చాలా క్లోజ్‌గా ఉండేవాడు. అప్పుడప్పుడు తండ్రి కూడా వాళ్ళ గదిలోనే పడుకునేవాడు.
ఓ రోజు ఆ గదిలో చిత్ర కంట పడిన ఓ దృశ్యంతో ఆమె నోట మాట ఆగిపోయింది. సతీష్ తనను ఎందుకు దూరంగా ఉంచుతున్నాడో అర్థమయింది. సతీష్‌కు, వాళ్ళ నాన్న, ఆ స్నేహితుడి మధ్య లైంగిక సంబంధం ఉంది. వాళ్ళు హోమోసెక్స్‌కు అలవాటు పడ్డారు. ఈ విషయం ఇంట్లో అత్తగారికి కూడా తెలుసు. ఇక చిత్ర అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక పుట్టింటికి వచ్చేసింది. విషయం తెలుసుకున్న చిత్ర తల్లిదండ్రులు కుమిలిపోయారు. కానీ పోలీస్ స్టేషన్‌కు వెళితే పరువు పోతుందని భయపడి మౌనంగా ఉండిపోయారు. కానీ చిత్ర ఊరుకోలేదు. ఇన్నాళ్ళు తను పడ్డ బాధలన్నీ ఒక్క సారిగా కండ్ల ముందు తిరిగాయి. తనను మోసం చేసిన ఆ కుటుంబానికి ఎలాగైనా శిక్ష వేయాలనుకుంది. అందుకే తెలిసిన వారి ద్వారా ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది.
తల్లిదండ్రులకు తెలియకుండా కేసు పెట్టాలనుకుంది. కానీ దానికి లీగల్‌సెల్ సభ్యులు ఒప్పుకోలేదు. ఒంటరిగా పోరాడడం కరెక్టు కాదని, చిత్ర తల్లిదండ్రులను పిలిచి...
''మీరు మొదటి నుంచి పరువు గురించే ఆలోచిస్తున్నారు. మీ కూతురి భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు. చాలా మంది తల్లిదండ్రులు మీలా ఆలోచించడం వల్లనే ఆడపిల్లల పరిస్థితి ఇలా అయిపోయింది. కష్టాల్లో ఉన్న ఆడపిల్లలకు ధైర్యం చెప్పాలి. బయట పడే మార్గం వెదకాలి. కానీ మీరు మౌనంగా ఉండి, ఆమెను భయపడితే సమస్య ఎలా పరిష్కారమవుతుంది. చిత్రకు మంచి భవిష్యత్ ఉంది. మీరు ఇలా వదిలేస్తే ఆమె జీవితం ఏం కావాలి. ముందు వాళ్ళపై పోలీస్ స్టేషన్లో కేసుపెట్టండి. మీరేం చేయలేరని వాళ్ళ ధైర్యం. అతనిది ప్రభుత్వ ఉద్యోగం, పోలీస్ స్టేషన్‌కు వెళితే కచ్చితంగా దారికొస్తాడు'' అని ధైర్యం చెప్పారు.
లీగల్‌సెల్ సభ్యులు చెప్పినట్టే చిత్ర అతనిపై కేసు పెట్టింది. కానీ ముందు అతను డబ్బుతో తప్పించుకోవాలనుకున్నాడు. కానీ చిత్రకు లీగల్‌సెల్ వారు అండగా ఉండడంతో పోలీసులు తోకముడిచారు. దాంతో సతీష్ దారికొచ్చాడు. చిత్ర కాళ్ళపై పడ్డాడు. ఐద్వా ఆఫీస్‌కు వచ్చి ''మేడమ్ చిత్రను నేను బాగా చూసుకుంటాను. ఇకపై ఎలాంటి పొరపాటూ చేయను. నా అలవాట్లన్నీ మార్చుకుంటాను. డాక్టర్ దగ్గర కూడా చూపించుకుంటాను. నా స్నేహితుడిని మా ఇంటి నుంచి పంపించేస్తాను. నా మాట నమ్మండి. మరోసారి నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీరు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను'' అని బతిమలాడుకున్నాడు.
''ఇన్ని రోజులు చిత్రను హింసించావు. చిత్ర ఎంత ఓపిగ్గా ఉన్నా నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. ఇప్పుడు నీకు సమస్య వచ్చేసరికి నటిస్తున్నావు. అయినా నిన్ను నమ్మాల్సింది చిత్ర. నీతో కలిసి బతకాలా వద్దా అని నిర్ణయించుకోవల్సింది ఆమెనే'' అన్నారు.
చిత్ర మాత్రం అతనితో కలిసి బతకడానికి అస్సలు అంగీకరించలేదు. సతీష్‌ను ఉద్యోగం నుండి సప్పెండ్ చేశారు. ప్రస్తుతం అతని నుంచి విడాకులు కోసం చిత్ర కోర్టుకు వెళ్ళింది.