Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సష్టిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈసారి కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే గతేడాది కరోనా వైరస్ పిల్లలు, యువతపై పెద్దగా ప్రభావంలో చూపలేదు. మరోవైపు చిన్నారులకు వైరస్ సోకదని, ఒకవేళ వచ్చినా వారికేం కాదనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ చిన్నారుల మీద కూడా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ బాధితుల్లో 15 శాతం వరకు పిల్లలే ఉండటం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో కరోనా వైరస్ను గుర్తించడం ఎలా..? వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.
చిన్నారుల్లో చాలా మందికి కరోనా సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని, కొందరిలో మాత్రం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
పిల్లల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నాయో లేదో.. ఒకవేళ చిన్నారులు మహమ్మారి బారిన పడితే తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక మార్గాలు, మార్గదర్శకాలతో కూడిన జాబితాను విడుదల చేసింది.
జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కుదిబ్బడ, దగ్గు, గొంతునొప్పి, శ్వాస వేగంగా తీసుకోవటం, వికారం, వాంతి, విరేచనాలు, విడవకుండా కడుపునొప్పి, ఆహారం సరిగా తినకపోవటం, ఆకలి లేకపోవటం, రుచి, వాసన తగ్గటం.
సాధారణంగా పిల్లలు కోవిడ్ బారిన పడితే త్వరగానే కోలుకుంటారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక లక్షణాలు కనిపంచని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందివ్వాలని.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వంటి లక్షణాలుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
విడవకుండా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి ఉన్నా వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చూపించాలి.
సాధారణంగా పిల్లలు జలుబు, జ్వరం ఉంటే రెండు, మూడు రోజుల్లో కోలుకుంటారు.. కానీ నిరంతరం అవే లక్షణాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.