Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిఒక్కరి జీవితంలో బాధ్యతలు తప్పనిసరిగా వుంటాయి. వాటిని తీర్చుకోవడం లేదా తీర్చడం కోసం ఎటువంటి భ్రదతాలోచనలు లేకుండా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తుంటారు. అటువంటి సమయాల్లో వారికి భవిష్యత్లో అవసరమయ్యే ఓ ఆర్థిక రక్షణ గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు. ఇదే మొదటిగా చేసే ఒక పెద్ద తప్పు. పైగా ప్రస్తుతం మనం సంక్షోభంలో ఉన్నాము. కరోనా వల్ల దాదాపు అందరూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పలేం. అందుకే కరోనా మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో... కాబట్టి ఇలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఆర్థికంగా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందాం...
ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందిన తరువాత ప్రభుత్వమే వారి సాంఘిక భద్రతను చూసుకుంటుంది. ఇటువంటి ప్రణాళికలు మన దేశంలో కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువగా వుంది. మన దేశంలో ఈ సదుపాయాన్ని కేవలం 12 శాతం మంది మాత్రమే అనుభవిస్తున్నారు. అంటే ప్రైవేటురంగంలో వున్న ఉద్యోగస్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తమ భవిష్యత్ కోసం ముందుగానే ప్రణాళికలు చేసుకోక తప్పదు. ప్రస్తుతకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా చాలా పెరిగిపోతోంది. బయట మార్కెట్లలలో కూడా ధరలు ఏకధాటిగా పెరిగిపోతున్నాయి. పైగా బాధ్యతలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మీ ఉజ్వల భవిష్యత్ కోసం జాగ్రత్త పడకతప్పదు...
అవసరాలకు తగ్గట్టు
ముందుగా అవసరాలకు తగ్గట్టు డబ్బులను వెచ్చించడం ఎంతో ముఖ్యం. పిల్లల చదువులకు కావలసిన ఖర్చులు, ఇంట్లో ఖర్చులు ఇలా రకరకాల బాధ్యతలు వుంటాయి. అటువంటి సమయంలో వాటికి కావలసిన డబ్బును మాత్రమే కేటాయించుకోవాలి. సంపాదించే డబ్బులో ఎంతో కొంత ఆదాయాన్ని మదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి.
పొదుపు చేయాలి
సంపాదించుకున్న కష్టార్జితంలో నుంచి మిగిలే ఎంతోకొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడం చాలా మంచి పద్ధతి. అధికంగా డబ్బులు వెచ్చించి సామాన్లు ఖరీదు చేయడం, దూరప్రయాణాలను విహరించడం కోసం డబ్బులు వెచ్చించడం అంత మంచిది కాదు. ఇప్పుడు పొదుపు చేసుకుంటే భవిష్యత్లో వచ్చే కష్టాలను ఎదుర్కోవడంతోపాటు సుఖంగా జీవితాన్ని గడపవచ్చు.
ఏదో ఒక పథకంలో...
ప్రస్తుతకాలంలో పొదపు చేసుకోవడానికి చాలారకాల పథకాలు వున్నాయి. బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వంటి తరహా పథకాలు వున్నాయి. ఇవి దీర్ఘకాలికంగా సాగే పథకాలు. మీ లక్ష్యాలను, నష్టభయాన్ని బట్టి ఇందులోనుంచి ఏదో ఒక పథకాన్ని మీరు ఎంచుకోవచ్చు.
ఆరోగ్య బీమా
ఆరోగ్య బీమా చేయించుకోవడం తప్పనిసరి. పైగా ప్రస్తుత కాలంలో వైద్యఖర్చలు మరీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కరోనా సోకిన వారినే చూశాము. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక, ప్రైవేట్ ఆస్పత్రులకు లక్షలు పెట్టలేక ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అందుకే ముందుగానే ఈ పాలసీలను తీసుకొని కొనసాగిస్తే.. అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురయినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం వుండదు.
ఎండోమెంట్ పాలసీ
డబ్బులను పొదుపు చేయడానికి ఇది ఎంతో మంచి పథకం. ఇవి దీర్ఘకాలంపాటు సాగే పథకాలు. వీటిని క్రమం తప్పకుండా మీరు ప్రీమియం చెల్లిస్తే.. వ్యవధి తీరిపోయిన తర్వాత మీరు డబ్బుతోపాటు బోనస్, ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడికి ఏమైనా అయితే ఆ డబ్బును నామినీకి ఇచ్చేస్తారు.
తొందరపాటు వద్దు
సాధారణంగా ప్రతిఒక్కరు అధిక లాభాలను పొందడానికి ముందుగా పెట్టుబడులు పెట్టడానికి మక్కువ చూపిస్తారు. అయితే అందులో తొందరపాటు నిర్ణయాలు అంత మంచివి కావు. పెట్టుబడులు పెట్టేడానికి ముందుగానే అందులో వచ్చే నష్టాలను, లాభాలను లెక్కలేసుకోవాలి. ఒకవేళ నష్టం వస్తే.. దానిని భరించగలిగే ధైర్యాన్ని కలిగి వుండాలి. అదే విధంగా ఏదైన ఒక కంపెనీని, సంస్థను స్థాపించడానికి ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అందులో వచ్చే లొసుగుల్ని ఎదిరించి.. భవిష్యత్ లో వచ్చే సమస్యలను ఎదుర్కోగలుగుతాము.