Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్... పిల్లలలో నిద్ర, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా జంక్ ఫుడ్, నిద్రలేమి, స్క్రీన్ సమయం వంటివి ఊబకాయంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. కరోనా కట్టడికి అనేక రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో దాదాపు ఏడాది నుంచి విద్యాబోధన అంతా ఆన్‌లైన్‌కి మారింది. ఫలితంగా పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇది పిల్లల్లో కొత్త సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లాక్డౌన్ వల్ల చిన్నపిల్లల్లో ఊబకాయ సమస్య పెరుగుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు వ్యాయామం, ఆటలకు దూరమవ్వడంతో ఈ సమస్య తీవ్రమవుతుందని.. ఇది క్రమంగా కోవిడ్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా రెండేండ్ల వయసు పిల్లలు 9 కిలోలు ఉండాలి. కానీ వారిలో ఎక్కువ శాతం 16 కిలోల వరకు ఉంటున్నారని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు.
చిన్నారులు ఎక్కువగా గాడ్జెట్స్‌పై గడపడంతో పాటు జంక్ లేదా కొవ్వు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడానికే ఇష్టపడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ సమయంలో శారీరక శ్రమ అస్సలు ఉండటం లేదు. ఇది రాబోయే కాలంలో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ప్రస్తుత కరోనా మహమ్మారి ఊబకాయం సమస్య ఉన్న వారిపై ఎక్కువ ఎటాక్ చేస్తోంది. అందువల్ల అధిక బరువు క్రమంగా తీవ్రమైన కోవిడ్ -19 సంక్రమణకు దారి తీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం ఉన్న పిల్లలను వెంటిలేటర్లో ఉంచాల్సి వస్తోంది. కొంతమందికి ఆక్సిజన్ చికిత్స సైతం అవసరమవుతోంది. అందువల్ల పిల్లలకు పోషకాహారమే ఇవ్వాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచి ఇంట్లో వండిన ఆహారాన్ని తినిపించాలని తల్లిద్రండులకు సూచిస్తున్నారు. వీటితో పాటు ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామాలు చేసేలా ప్రోత్సహించాలి.
ఆన్లైన్ క్లాసుల కారణంగా కంటిపై భారం పడటమే కాకుండా, శారీరక శ్రమలో బాగా తగ్గుతుంది. దీనితో పాటు పాఠశాలలో ఉన్న విధంగా గేమ్స్ సెషన్, బ్యాడ్మింటన్ లేదా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ వంటివి దూరమవుతున్నారు. వీటికి బదులు గాడ్జెట్‌లో గేమ్స్ ఆడటం వంటివి చేస్తున్నారు. మరోవైపు, కొవ్వు, మోనోశాచురేటెడ్ ఫుడ్, ఫిజీ డ్రింక్స్, ప్రాసెస్డ్ లేదా ప్యాకేజ్డ్ ఫుడ్ అధికంగా తినడం చేస్తున్నారు. ఇవన్నీ పిల్లలలో ఊబకాయానికి దారితీస్తున్నాయి. పిల్లలలో ఊబకాయం కూడా రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.