Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపాసనా దష్... ఈమె జజాబోర్ బ్రాండ్ అనే సంస్థకు ఫౌండర్ సీఈఓ. అలాగే ఇండియా రత్స్కి కో-ఫౌండర్. ఓ వ్యాపారవేత్తగా మహమ్మారి సమయంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళను మనతో పంచుకుంటున్నారు. అలాగే ఎంతో మంది మహిళలు ఈ సమయంలో కుటుంబ భారాన్ని ఒంటరిగా మోయాల్సి వచ్చిందంటున్నారు ఆమె. ముఖ్యంగా స్త్రీలు మహమ్మారి కాలంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు. మన పైన దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించడం ఎలాగో తెలుసుకున్నాం అంటున్న ఆమె ఇంకా ఏమంటున్నారో చూద్దాం...
నా అనుభవాలు
ఈ మహమ్మారి నాకు కొన్ని అద్భుతమైన అనుభవాలను ఇచ్చింది. ఈ సమయంలో రోజుకు 30-40 మంది ఫోన్లు చేసేవారు. వీటిలో సంగం ఫోన్లు భయంతో వచ్చినవే. వాళ్ళు తమ వ్యాపారాల్లో మహమ్మారి వల్ల చాలా నష్టపోయారని చెప్పారు. కొంత మంది నష్టాలు భరించలేక తమ సంస్థలను మూసివేసుకున్నారు. అయితే లాక్డౌన్ వల్ల కొంత మంది నష్టపోతే మరికొంత మందికి అనూహ్యమైన లాభాలు కూడా వచ్చాయి. ఆ లాభాలను ఏం చేయాలో తెలియక వారు సతమతమైనవారు కూడా లేకపోలేదు. నాకు తెలిసిన ఒకరు తమ ఫుడ్ వెంచర్ మూసివేయాల్సిన భయంకర పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆమె కుంగిపోతుందేమో అనుకున్నాను. కానీ ఆమె నా అంచనాలకు భిన్నంగా ''నేను ఇంత కష్ట సమయంలో మూసివేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నేను సంపద పరంగా పేదదాన్ని కావచ్చు, కాని నేను పాఠాల పరంగా గతంలో కంటే ధనవంతురాలిని అవుతాను. ఆ పాఠాలతో మళ్ళీ నా వ్యాపారం ప్రారంభించడానికి ఎదురు చూస్తాను'' అన్న ఆమె మాటలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఓటమి అనేది మన గెలుపుకు మొదటి మెట్టు అని తెలుసుకున్నాను.
నేను కూడా 'విజన్ 2020'లో అద్భుతాలు సష్టించాననే చెప్పాలి. అయితే వాస్తవానికి 2020లో వచ్చిన ఈ మహమ్మారి ఎన్నో సవాళ్ళను తెచ్చిపెట్టింది. నాతోపాటు నా చుట్టూ ఉన్నవారు దీన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా లేరు. ఈ మహమ్మారి కేవలం వ్యాపారాన్ని మాత్రమే కాకుండా మనుషుల ఆలోచనలు, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపింది. ఓ వ్యాపారవేత్తగా నిత్యం సవాళ్ళను ఎదుర్కోవల్సి వస్తూనే ఉంటుంది. ఈ మహమ్మారిని కూడా అలాగే ఎదుర్కునేలా ప్రయత్నించాం. ముందు కాస్త భయపడినా తర్వాత మమ్మల్ని మేము సిద్ధం చేసుకున్నాం. ఈ విషయంలో మా టీం కూడా నాకు పూర్తిగా సహకరించింది. లాక్డౌన్ సమయంలో 'ఇంటి నుండి పని చేయడం' కాదు 'మహమ్మారితో కలిసి పని చేయడం' అని మాకు తెలుసు. అందుకే పనితో పాటు మా మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాము. అంతకు ముందు కంటే మరింత బలంగా పని చేసేందుకు సిద్ధమయ్యాము.
సమత్యులం చేసుకుంటూ
నా విషయంలో ఈ మహమ్మారి చేసిన ఓ మంచి పని ఏమిటంటే మా ఇంట్లో వారితో కలిసి గడిపే అవకాశాన్ని ఇచ్చింది. ఇది నాకు కాస్త ఊరటగా అనిపించింది. లాక్డౌన్ లేకపోతే నేను నా ఇంట్లో వారితో ఇంత సమయం గడపగలిగేదాన్ని కాదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంట్లో ఉంటూనే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కుటుంబంతో పాటు పనిని సమతుల్యం చేయగలిగాను. ఇది నా వ్యాపార అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది.
పరిష్కారం దొరికితే...
మహమ్మారితో నేను చేసిన యుద్ధంలో సగమే గెలిచానని చెప్పాలి. మనకు సవాళ్ళు చాలా వున్నా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. అయితే పరిష్కారం దొరికితే ఈ యుద్ధాన్ని గెలిచే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఇది ఓ సైకిల్ లాంటిది. సవాళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మన దగ్గర సరైన ఆలోచనలు, సహకరించే మనుషులు ఉంటే దీని నుండే బయటపడడం సులభమవుతుంది. మహమ్మారి నుండి ఈ విషయాన్ని నేను నేర్చుకున్నాను. మా సంస్థలో పని చేసే ఉద్యోగులు నాకు అన్ని విధాలుగా సహకరించారు. కాబట్టే ఈ మాత్రమైనా ఈ మహమ్మారిని ఎదుర్కోగలిగాను.
కోవిడ్ తర్వాతి ప్రపంచం
ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ మహమ్మారి మమ్మల్ని సమిష్టిగా మార్చింది. మా టీంలో ఐకమత్యాన్ని పెంచింది. ఇది వ్యాపారంతో సహా మన జీవితంలోని ప్రతి అంశంలో ప్రతిబింబిస్తుంది. ఇలాంటి కొన్ని మార్పులు ఉండాలని నేను ఆశిస్తున్నాను. కోవిడ్ తర్వాత కూడా ఇదే స్ఫూర్తితో వచ్చే సవాళ్ళను అధిగమిస్తామనే నమ్మకం మాకు వచ్చింది.