Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నం తినమంటే పిల్లలు వెంటనే మూతి ముడుచుకుంటారు. పిల్లల కడుపు నింపాలంటే తల్లిదండ్రులకు పెద్ద సవాల్. రోజుకో కొత్త రుచి కావాలని మారాం చేస్తారు. చిరుతిండి ఎంత తిన్నా అన్నంతో సమానం కాదు. అందుకే అన్నంతో కాస్త వెరైటీగా, కొత్తగా చేసి పెడితే కడుపు నిండా తింటారు. అయితే కొత్త దనంతో పాటు పిల్లలు పెట్టే ఆహారంలో రుచి, బలాన్ని ఇచ్చి పదార్థాలు కూడా చాలా అవసరం. లేదంటే పిల్లలు వేసవిలో ఊరికే నీరసించి పోతారు. అందుకే అలాంటి కొన్ని వెరైటీ రైస్ రెసిపీస్ ఈరోజు మీకోసం...
మష్రూమ్ క్యాప్సికం రైస్
కావల్సిన పదార్థాలు: అన్నం - రెండు కప్పులు, మష్రూమ్స్ - 200 గ్రాములు, క్యాప్సికం - మూడు, జీలకర్ర పొడి - అరస్పూన్, ధనియాల పొడి - ఒక స్పూను, గరం మసాల పొడి - ఒక స్పూను, నెయ్యి - సరిపడా, ఉప్పు - తగినంత, పచ్చి మిర్చి - నాలుగు, జీడిపప్పు - పది, లవంగాలు - నాలుగు.
తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నెయ్యి వెసుకొని లవంగాలు, జీడిపప్పు వేయించుకున్న తర్వాత అందులో క్యాప్సికం ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి, కొంచం ఉప్పు వేసి మగ్గనివాలి. తర్వాత మష్రూమ్స్ ముక్కలను కూడా వేసి మగ్గనివాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొంచం వెగనిచ్చి అందులో రైస్ వేసి బాగా కలిపి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. తర్వాత గరం మసాల వేసుకొని కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి...
బీట్రూట్ బిర్యానీ
కావల్సిన పదార్థాలు: బీట్రూట్ - రెండు, బియ్యం - మూడు కప్పులు, ఉల్లిగడ్డ - రెండు, పుదీనా - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా
పచ్చి మిర్చి - ఆరు, అల్లం వెల్లుల్లి పేస్టు - స్పూను, ధనియాల పొడి - రెండు స్పూన్లు, గరం మసాలా - ఒక స్పూను, కారం - రెండు స్పూన్లు, పసుపు - చిటికెడు, మిరియాలు - కొద్దిగా, మసాలా ఆకు - నాలుగు, ఉప్పు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా నీళ్ళల్లో బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత బీట్రూట్ని తురుముకోవాలి. ఒక గిన్నెలో తగినంత నూనె పోసుకొని వేడి అయ్యాక అందులో మసాల ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి వేసుకొని వేయించుకోవాలి. అందులో బీట్రూట్, అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాల పొడి, కారం, పసుపు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. వేగాక అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే బీట్రూట్ బిర్యానీ రెడీ.
మీల్మేకర్ పులావ్
కావల్సిన పదార్థాలు: మీల్మేకర్ - 250 గ్రాములు, బాస్మతి బియ్యం - 300 గ్రాములు, నెయ్యి - 100 గ్రాములు, ఉప్పు - ఒక టేబుల్ స్పూను, దాల్చిన చెక్క - ఒక ముక్క, అల్లం - 25 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 25 గ్రాములు, యాలకులు - 3, లవంగాలు -12, బిర్యానీ ఆకులు -2, పుదీనా- 1 కట్ట, కొత్తిమీర - 1 కట్ట, పచ్చిమిర్చీ -5, పచ్చి బఠాణీ - ఒక కప్పు, ఆలు - 1, ఉల్లిగడ్డ - ఒకటి.
తయారు చేసే విధానం: ముందుగా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీ, మీల్మేకర్ విడిగా ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న కుక్కర్ పెట్టి నెయ్యి వేసి కొద్దిగా వేడి చేయాలి. దాల్చిన చెక్క, ఇలాచి, సగం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠాణీ , ఆలు ముక్కలు, మీల్ మేకర్ వేసి వేయించి సరిపడా నీళ్ళు పోసి ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.
మసాలా రైస్
కావల్సిన పదార్ధాలు: రైస్ - రెండు కప్పులు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - ఒక రెమ్మ, ఆలూ - ఒకటి చిన్నది, క్యారట్ - ఒకటి, కాలీఫ్లవర్ - అర కప్పు (కట్ చేసినది), టమాటాలు - రెండు, పుదీనా - సరిపడా, కొత్తిమీర - కొంచం, ఉప్పు, కారం - రెండు స్పూన్లు, పసుపు - సగం చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక స్పూను, గరంమసాలాపొడి - ఒక స్పూను, నూనె - సరిపడా, షాజీర, లవంగాలు, చెక్క,అనాసపువ్వు - సరిపడా.
తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనెవేసి వేడిచేసి మసాల దినుసులు వేయాలి. ఇప్పుడు తరిగిన కూరలన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి. తరిగిన పుదీనా, కారం, అర టీ స్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పసుపు వేసి బాగా కలిపి వేగనివ్వాలి. చివరిలో రైస్, కొంచం ఉప్పు, అర టీ స్పూన్ గరంమసాలా పొడి వేసి వేయించాలి. కొంచెం పుదీనా వేస్తే రైస్ రెడీ