Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో వ్యత్యాసముంది. ఏకాంతంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఆందోళన ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా మనిషిని కుంగదీస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. తాజాగా ఓ పరిశోధనలోనూ ఇదే తేలింది.
ఒంటరిగా ఉండే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తేల్చింది. ముఖ్యంగా మధ్య వయసులో ఉండే వారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తెలిపారు. ఈస్ట్ ఫిన్లాండ్ యూనివర్సిటీ చెందిన కొంతమంది పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.సామాజిక సంబంధాలు.. ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నివారణలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒంటరితనం అనేది పొగతాగడం, అధిక బరువు మాదిరిగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు అంచనా వేశాయి.
ఈ సమస్యపై శ్రద్ధ వహించాలనే ఆలోచననకు తమ పరిశోధన మద్దతు తెలుపుతుందని అధ్యయన బంద సభ్యులు, ఈస్ట్ ఫిన్లాండ్ వర్సిటీకీ చెందిన సిరీ లిసి క్రావ్ చెప్పారు. ఈ అధ్యయనాన్ని సైకియాట్రీ రిసెర్చ్ జర్నల్‌లో ప్రచురించారు.
80వ దశకంలో తూర్పు ఫిన్లాండ్లో 2570 మంది మధ్య వయస్కులతో ఈ పరిశోధన ప్రారంభించారు. ఇప్పటి వరకు నమోదైన డేటా ఆధారంగా వారి ఆరోగ్యం, మరణాల రేటును పరిశీలించారు. ఇందులో 649 మంది పురుషులు, అంటే 25 శాతం మందికి క్యాన్సర్ వచ్చింది. 283 మంది పురుషులు (11 శాతం) క్యాన్సర్‌తో మరణించారు. అంటే ఒంటరితనం క్యాన్సర్ ప్రమాదాన్ని పది శాతం పెంచింది. వయస్సు, సామాజిక-ఆర్థిక స్థితి, జీవనశైలి, నిద్ర, డిప్రెషన్ లక్షణాలు, బాడీ మాస్ ఇండెక్స్, గుండె జబ్బులు, ఇతర ప్రమాద కారకాలతో సంబంధం లేకుండా క్యాన్సర్‌ను మాత్రమే ఈ పరిశోధనలో పరిశీలించారు.
అంతేకాకుండా అవివాహితులు, వితంతువులు లేదా విడాకులు తీసుకున్న క్యాన్సర్ రోగుల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఒంటరితనం వల్ల కలిగే అనారోగ్య ప్రభావల పట్ల అవగాహన పెరుగుతోందని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించే యంత్రాంగాలను మరింత వివరంగా పరిశీలించడం చాలా ముఖ్యమని లిసీ క్రావ్ అన్నారు. ఈ సమాచారం ఒంటరితనం వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని, నివారణ చర్యలకు సరైన పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు.