Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కక్ష గట్టి మరీ పగతీర్చుకుంటున్నది మనుషుల మీద. రాష్ట్ర ప్రభుత్వ కరోనాను నియంత్రించడానికి ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పెంచింది. మొదట 12వ తేదీ వరకు మాత్రమే లాక్‌డౌన్‌ను విధించారు ఉన్న కరోనా వైరస్సే మనుష్యుల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటే కొత్తగా కొత్తగా వచ్చిన బ్లాక్ ఫంగస్ ఇంకా భయపెడుతోంది. బాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి కంటిని కనిపించని అతి సూక్షక్రిములు మానవులపై దాడి మొదట పెట్టాము. టీకాలు త్వరగా ఇస్తే ఫలితం బాగుంటుంది. ప్రతిచోటా మామూలు కేసుల కన్నా కోవిడ్ కేసులు ఎక్కువైపోయాయి. దాంతో చాలా ఆసుపత్రులు కోవిడ్ సెంటర్లుగా మారుతున్నాయి. ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు కోవిడ్ పేషెంట్లు ఉంటున్నారు. ప్రతి ఊరూ, ప్రతి ఇల్లూ సర్వే చేస్తున్నది కరోనా. ఇప్పుడేమో పిల్లల్నూ వదలటం లేదు. ఏదైనా కరోనాను లొంగదీయాలంటే మనం తలుపులు వేసుకుని ఇళ్ళలో ఉండడమే ఏకైక మార్గం. మనిషి మరో మనిషిని కలిసి మాట్లాడుకోవడం కరోనాకు నచ్చట్లేదు. అందుకని ఫోన్లలోనే పలకరించుకుందాం. ఇంట్లో సమయాన్ని బొమ్మలతో గడుపుదాం.
డ్రైఫ్రూట్స్ ప్యాకింగ్‌తో...
కరోనా దెబ్బకు డ్రైఫూట్స్ వాడకం పెరిగింది గదా! మేం కూడా కొన్ని డ్రైఫ్రూట్స్ ఆర్డర్ చేశాము. ఈమధ్య రకరకాల కంపెనీలు డ్రైఫ్రూట్స్‌ను అందమైన ప్యాకింగుల్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. అలా మూడు రకాల డ్రైఫ్రూట్స్ కలిసి ఒకే ప్యాకెట్లో వచ్చాయి. ఈ ప్యాకెట్‌కు హ్యాండిల్స్ పెట్టి ఒక బ్యాగ్ ఆకారంలో తయారు చేశారు. ఈ ప్యాకింగును మాత్రం భద్రంగా దాచి పెట్టాను. ఆ కవర్ మీద సెల్ఫ్ డిజైన అందంగా ప్రింట్ చేయబడి ఉన్నది. నేను ఆ డిజైన్‌లో ఉన్న పువ్వులు, ఆకులు, కొమ్మలు, మొగ్గలకు రంగులు వేశాను. రంగులు వేసే సరికి ప్రింట్ వేసిన చీరలా కనిపించింది. ఇదొక బాక్స్లా ఉన్నది. కాబట్టి దీనిలో ఏవైనా వస్తువులు పెట్టుకోవచ్చు. నేనైతే స్కెచ్ పెన్నులన్నింటినీ దాచి పెట్టాను. మూత పెట్టేస్తే హ్యాండిల్స్ సాయంతో సూట్‌కేస్‌లా పట్టుకెళ్ళవచ్చు. దీని మధ్యలో కంపెనీ పేరున్నది. అది కనిపించడకుండా ఒక వినాయకుడిని అతికించాను. చాలా పెళ్ళి శుభలేఖల మీద వినాయక ప్రతిమలు ఉంటున్నాయి కదా! అక్కడ నుంచి తీసి ఇక్కడ అతికించాను.
టాబ్లెట్ల అట్ట పెట్టెలతో...
కరోనా వైరస్ సోకుతుందనే భయంతో బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, 'సి' విటమిన్ టాబ్లెట్లు ఇంట్లోనూ వాడుతున్నారు. డాక్టర్లు కూడా కరోనా రోగులకు వీటినే ఇస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా టాబ్లెట్లు వేసుకుంటున్నారు. అదే విధంగా మా ఇంట్లో కూడా బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తెచ్చారు. ఆ టాబ్లెట్లు ఉన్న అట్ట పెట్టెలు బంగారు వర్ణంలో మెరుస్తూ నా కండ్లకు అద్భుతంగా కనిపించాయి. 'టాబ్లెట్లు చేసే మంచి కన్నా, అవి ఎంత అందంగా ఉన్నాయో కనిపించినందుకు ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు' అన్నారు. 'నేను కూడా టాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా' అన్నాను. సరే వెంటనే ఈ అట్ట పెట్టెల్ని, లోపల ఉన్న అట్టల్ని కలిపి ఒక నెమలిని చేశాను. చూడండి టాబ్లెట్ల అట్టల నెమలి ఎంత అందంగా ఉందో. దీని ముక్కు కోసం, కాళ్ళ కోసం సపోటా పండు గింజల్ని ఉపయోగించాను. కన్ను కోసం కూడా సపోటా గింజనే పెట్టాను. విశాలమైన నేత్రాలు అని కవులు పొగిడే విధంగా అమరింది కన్ను. ఇక ఫించాన్ని ఎంత వెరైటీగా చేద్దామా అనుకున్నా. కుక్కల ఆహారం పెడిగ్రీ గురించి చెప్పాను కదా పోయిన వారం. ఈ వారం పెడిగ్రీ చిన్న చిన్న బాల్స్‌లా వచ్చింది. వీటిని తీసుకొని ఫించంలాగా అమర్చాను. టాబ్లెట్ల అట్టపెట్టెలు, కుక్క ఆహారంతో జాతీయ పక్షి తయారైంది.
ఆసుపత్రి వ్యర్థాలతో
ప్రస్తుత కరోనా సమయంలో వైద్యుల పాత్ర అపూర్వమైనది. మనం మాస్క్ వేసుకుంటేనే విసుగ్గా ఉంటుంది. మరి ఒళ్ళంతా పిపిఈ సూట్లు వేసుకొని కరోనా బాధితులకు సేవ చేయటమంటే మామూలు విషయమా! కరోనా గురించి పూర్తిగా తెలియకుండానే పులి బోనులో తల పెట్టినట్టుగా కరోనా రోగులకు చికిత్స అందించడానికి ముందుకు రావడమంటే వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకున్నట్టే. ఈ త్యాగాన్ని గుర్తు చేయడానికి నేనో బొమ్మ తయారు చేశాను. భూగోళం బొమ్మను వేశాను. దాని చుట్టూతా స్టెతస్కోపు వేశాను. దీనికి రెండు వైపులా రెండు ప్లస్ గుర్తుల్ని వేశాను. ఇవన్నీ ఆసుపత్రి లోని ఇంజక్షన్ సీసాల మీద ఉండే మూతలతో తయారు చేశాను. ఇంకా వెంటిలేటర్లలో ఉండే ప్లాస్టిక వ్యర్థాలను కూడా ఉపయోగించాను. వీరి సేవా నిరతిని, త్యాగ బుద్ధిని తెలియజేసే చిత్రమిది.
చెర్రీ పండ్లతో...
పండ్లు తేవడానికి వెళ్ళిన మా అబ్బాయి చాలా రోజులైంది తిని అని చెర్రీ పండ్ల ప్యాకెట్ తెచ్చాడు. తియ్యగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా నచ్చుతాయి. అయితే నాకు వాటిని చూడగానే నెక్లెస్ చేయాలనిపించింది. ఇంతకు ముందు వంటింటి పప్పు దినుసులతో అనేక నెక్లెస్ సెట్లను తయారు చేసి మీకు చూపించాను. అందుకే చెరీల్రను చూడగానే నోరూరటం కన్నా చెయ్యి తహతహలాడింది. ఎర్రటి రత్నాలు, పగడాలతో చేసే నెక్లెస్‌లా ఉంటుందనిపించింది. వెంటనే చెర్రీ పండ్లతో, దానిమ్మ గింజలతో ఒక నెక్లెస్‌ను చేశాను. అక్షయతృతియ రోజు ఈ నెక్లెస్‌లను వీడియోగా రూపొందించి స్నేహితులందరికీ పంపాను. ఖర్చు లేని నగలు. దొంగల భయం లేని నగలు.
మోరంగడ్డతో ఎలుక...
మా సిరిసిల్లలో వీటిని కందగడ్డలు అంటాము. బెంగుళూరులో దీనిని గెనసగడ్డ అంటారట. అదీ మన తెలుగుపేరే. ఏదో కొద్దిగా వంకర్లు తిరిగిన ఈ దుంపను ఎలుక చేద్దామని పించింది. ఎలుక మూతిలా చక్కగా వంపు తిరిగి ఉన్నది. అందుకే దాన్ని తలగా భావించి కండ్లు పెట్టేశాను. ఎలుక మూతికి ఉండే మీసాలు పెట్టాలి కదా! ఎలుక మూతిని చక్కగా పెయింట్ చేశాను. సన్నని పీసు తీసుకొని మూతికి మీసాల్లా అతికేశాను. ఇంకేం మిగిలింది పొడవాటి తోక. ఒక ఆర్నమెంట్ ట్రీ యొక్క ఆకును తెచ్చి తోకగా అమర్చాను. చక్కగా సరిపోయింది. ఈ ఎలుకలు ఇళ్ళలో ఎంత చిరాకును కలిగిస్తాయో అందరికీ తెలుసు. దీని గర్భధారణ కాలం కేవలం మూడు వారాలే. మేము చదువుకునేటపుడు ఎలుక డిసెక్షన్ చేసేటపుడు పొట్టలో పిల్లలుండేవి. ఒక్కొక్క పొర సంచిలో ఒక్కొక్క పిల్ల ఉండేది. ఇవి పాలిచ్చి పెంచే క్షీరదాల జాతికి చెందినవి. బలమైన పళ్ళు కలిగి పెద్ద పొట్టతో 'రోడెన్షియా' క్రమానికి చెందిన జీవులు.