Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబోయే భర్త గురించి సహజంగానే ఎన్నో ఊహించుకుంది కావ్య. పెండ్లి తర్వాత తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్లాన్ చేసుకుంది. పెండ్లి ముహుర్తం రానే వచ్చేసింది. కట్నం, నగలు అన్నీ బాగా ఇచ్చి ఘనంగా పెండ్లి చేశారు సత్యం దంపతులు. ఎంతో సంతోషంగా కావ్య అత్తారింట్లో అడుగుపెట్టింది. పెండ్లయిన మొదటి రోజు దినేష్ తల్లితో కలిసి హాల్లో పడుకున్నాడు. భర్త ప్రవర్తన కావ్యకు ఆశ్చర్యంగా అనిపించింది. ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. తర్వాత రోజు పరిస్థితి మరీ దారుణం. అలా తెల్లవారిందో లేదో 'ఆఫీస్‌కి బయలు దేరుతున్నావా?' అడిగింది అత్త.
వారం రోజులు ఆఫీస్‌కు సెలవు పెట్టానని చెప్పింది కావ్య. 'ఇంట్లో ఉండి ఏం చేస్తావు, ఆఫీస్‌కు వెళ్ళరాదు' అంది. ఆమె మాటలకు కావ్య నోట మాట రాలేదు. భర్త పక్కనే ఉన్నా నోరు తెరవడు. అసలు తల్లి ముందు కావ్యతో మాట్లాడటానికే భయపడతాడు.
వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించుకుంటూ ఆ రోజు ఇంటి పనులన్నీ తనే చేసింది. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. కావ్య కూడా తినడానికి కూర్చోబోతే 'నువ్వు కూడా ఇప్పుడే తినాలా? మీ అమ్మ నీకు ఇదేనా నేర్పింది? పెద్దవాళ్ళు తిన్నతర్వాత తినాలని తెలియదా? ముందు మాకు వడ్డించు, తర్వాత నువ్వు తినొచ్చు' అంది. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. దినేష్, కావ్యవైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు.
తర్వాత రోజు భార్యా,భర్తలు కలిసి కావ్య ఇంటికి వెళ్ళారు. అక్కడ మూడు రోజులు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. భర్తతో కాస్త చనువు పెరిగిన తర్వాత కావ్య మెల్లగా 'అక్కడ ఉంటే ఎందుకు నాతో మాట్లాడలేదు' అని అడిగింది. దానికి అతను ''మా అమ్మకు కాస్త కోపం ఎక్కువ, నువ్వేం పట్టించుకోకు. తన మాటలు కటువుగా ఉన్నా చాలా మంచిది. రెండు నెలల వరకు ఇంట్లో పనులు నువ్వేం చేయకు. అన్నీ మేమే చూసుకుంటాం. పనమ్మాయి వస్తుంది. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో' అన్నాడు.
మళ్ళీ ఇద్దరూ దినేష్ ఇంటికి వెళ్ళారు. అదే పరిస్థితి. కావ్య సెలవులు అయిపోయాయి. ఇక ఆఫీస్‌కు వెళ్ళాలి. వారు ఉండే ఇంటి నుంచి బ్యాంక్ ముఫ్పై కిలో మీటర్లు ఉంటుంది. సుమారు రెండు గంటల ప్రయాణం. దాంతో ఉదయం ఐదు గంటలకే లేచి ఇంటి పనులన్నీ చేసి ఏడుగంటలకల్లా ఆఫీస్‌కు బయలు దేరేది. ఇంటి పనుల్లో భర్త ఏమైనా సహకరిస్తుంటే 'ఆడంగిలా ఆ పనులు ఏంటిరా? ఎప్పుడూ పెళ్ళాం కొంగుపట్టుకుని తిరుగుతావా?' అని తల్లి దినేష్‌ను తిట్టేది. తల్లికి భయపడి దినేష్ అటువైపుకు వెళ్ళేవాడు కాదు.
కావ్య ఎప్పుడైనా బయటకు వెళదాం అంటే వాళ్ళతో పాటు అత్తకూడా వచ్చేది. దినేష్ ఎప్పుడైనా 'మేమిద్దరం వెళ్ళొస్తాం' అంటే 'అప్పుడే తల్లి నీకు చేదయిందా' అంటూ కొడుకు ముందు కన్నీళ్ళు పెట్టుకునేది. దాంతో దినేష్ కాదనలేకపోయేవాడు. అలా నెల రోజులు గడిచింది. కావ్య ఉదయం ఏడు గంటలకు బయలు దేరితే ఇంటికి చేరుకునే సరికి తొమ్మిది అయ్యేది. రోజూ ఇంటి పనులు, ఆఫీస్ పనులతో బాగా అలసి పోయేది.
ఇక ప్రయాణం చేయలేక 'నాకు బ్యాంక్ వాళ్ళు క్వార్టర్స్ ఇస్తారు. అది మా ఆఫీస్‌కు కాస్త దగ్గరగా ఉంటుంది. అక్కడకు మారదాం' అని భర్తను అడిగింది. 'అమ్మతో మాట్లాడిన తర్వాత చూద్దాం' అన్నాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పైగా 'వచ్చీ రాగానే వేరు కాపురం పెడతానంటావా?' అంటూ కోడలిపై అంతెత్తు ఎగిరింది. అప్పటి నుంచి దినేష్‌కు, కావ్యకు మధ్య మాటలు ఆగిపోయాయి. కావ్య తన బాధంతా తల్లిదండ్రులతో చెప్పుకుంది. ఇల్లు మారే గురించి అత్తగారితో చెప్పి ఒప్పించమంది. వాళ్ళూ ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఒప్పుకోలేదు. చివరకు 'మా అబ్బాయి రాడు, మీకు ఇష్టం ఉంటే మీ అమ్మాయిని ఇక్కడ ఉంచండి, లేకపోతే తీసుకుపోండి' అని కఠినంగా చెప్పింది.
ఇక చేసేది లేక కావ్య అలాగే పనులు చేసుకుంటూ ఆఫీస్‌కు వెళ్ళేది. వారం రోజుల తర్వాత ఇంట్లో పని మనిషిని మాన్పించేశారు. దాంతో కావ్యకు పనులు ఇంకా పెరిగిపోయాయి. దినేష్‌లో కూడా చాలా మార్పు వచ్చింది. కావ్యను అస్సలు పట్టించుకోవడం లేదు.
కొన్ని రోజులకు కావ్యలో ఓపిక నశించింది. దినేష్‌ను నిలదీసింది. 'క్వార్టర్స్‌లో ఇల్లు తీసుకుంటేనే నీతో ఉంటాను, లేకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతాను' అంది. దినేష్ కావ్యపై చేయిచేసుకున్నాడు. దాంతో తన తల్లిదండ్రులను తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. దినేష్‌ను, ఆమె తల్లినీ రమ్మని లీగల్‌సెల్ సభ్యులు లెటర్ పంపారు. తర్వాతి వారం వాళ్ళు వచ్చారు. కానీ దినేష్ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వాళ్ళ అమ్మ మాట్లాడుతూ 'ఉద్యోగాలు చేసే ఆడోళ్ళందరూ ఇంటి పనులు చేసుకోవడం లేదా? ప్రపంచంలో ఈమె ఒక్కతే ఉద్యోగం చేస్తుందా? అంత కష్టమైతే ఉద్యోగం మానుకోమనండి. మా వాడే పోషిస్తాడు. ఉద్యోగం కోసం మేం మా సొంత ఇంటిని వదులుకోవాలా?' అంది.
దానికి సభ్యులు 'మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక్కసారి కావ్య గురించి ఆలోచించండి. ఇప్పుడు బ్యాంక్‌లో ఉద్యోగాలంటే గతంలో మాదిరిగా లేవు. పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది. గొడ్డు చాకిరి చేయిస్తున్నారు. టార్గెట్లు పెడుతున్నారు. ఆమె తెల్లవారు జామునే లేచి ఇంటి పనులన్నీ చేసి నాలుగు గంటలు ఈ సిటీలో జర్నీ చేసి ఆఫీస్‌కి వెళ్ళొచ్చే సరికి ఎంత అలసిపోతుంది. ఇక మీ అబ్బాయితో సంతోషంగా ఎలా ఉంటుంది. మీది సొంత ఇల్లే కావొచ్చు. అక్కడైనా అద్దెకట్టే పని లేదు. ముఖ్యంగా కావ్యకు బ్యాంక్ దగ్గరవుతుంది. ఇంటికి తొందరగా రాగలుకుతుంది.
అలాగే మీ అబ్బాయి ఇంటి పనుల్లో సాయం చేస్తుంటే ఆడంగి పనులు చేస్తున్నావని ఆపేస్తున్నారు. ఇది అస్సలు మంచిది కాదు. అన్ని పనులూ అందరూ చేసుకోవాలి. పనులకు ఆడా మగా తేడా లేదు. తిండి అందరూ తింటున్నప్పుడు వంట ఇద్దరూ చేయడంలో తప్పేముంది. పరిస్థితులు మారుతున్నాయి. కాలం మారుతుంది. కాలంతో పాటు అందరూ మారాలి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. పెండ్లయి ఐదు నెలలే అవుతుంది. ఇప్పటి వరకు మీ అబ్బాయి ఏమైనా సంతోషంగా ఉన్నాడా? ఒక్క సారి ఆలోచించండి. మీక్కావల్సిది కూడా పిల్లల సంతోషమే కదా' అన్నారు.
దానికి ఆమె 'నాదేముంది. భార్యా, భర్తల ఇష్టం. వాళ్ళకు ఏది నచ్చిదే అదే చేసుకోమనండి' అంది. దినేష్‌తో మాట్లాడితే 'మా అమ్మకు ఇష్టం లేకుండా నేను ఎక్కడికీ వెళ్ళను' అన్నాడు. దానికి సభ్యులు 'చూడు భర్తగా కావ్యకు, కొడుకుగా తల్లికి సర్ధిచెప్పాల్సింది నువ్వే. కానీ తెలివిగా తప్పించుకుంటున్నావు. తప్పంతా నీ తల్లిపై వేసి పక్కకు తప్పుకుంటున్నావు. నువ్వు వారం రోజుల కిందట కావ్యను కొట్టావు. అప్పుడు ఆమె హాస్పిటల్‌కి కూడా వెళ్ళింది. ఆ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆమెను ఇంట్లో హింసిస్తున్నావని కేసు పెడతాం. కొత్తగా పెండ్లయిన వాడివి అనవసరంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగుతావా? ఆలోచించుకో. చిన్న సమస్యను పెద్దది చేసుకోవద్దు. బ్యాంక్ క్వార్టర్స్‌లోకి మారండి. మేము మీ ఇద్దరినే ఉండమనడం లేదుగా? మీ అమ్మా, నాన్న కూడా మీతో పాటే ఉంటారు. ఏదో వేరు కాపురం పెట్టమన్నట్టు రాద్దాంతం చేస్తారేంటి. ఇదైనా మీ కోసమే కదా? కొత్తగా పెండ్లయిన వారు సరదగా గడపరా. ఆమె పనులు చేయడం, ఆఫీస్‌కి వెళ్ళడం అలసిపోయి ఇంటి రావడం. ఇదేనా జీవితం. ఆమె ఆఫీస్ ఎంత దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం అంత పెరుగుతుంది. మీరిద్దరూ దగ్గరైనప్పుడే మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఇలా దూరంగా ఉంటే ఎలా? మీరు ఇల్లు మారకపోతే మీ సమస్య ఇలాగే ఉంటుంది' అన్నారు.
పోలీస్‌స్టేషన్ అనే సరికీ తల్లీ, కొడుకులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. వారం రోజుల తర్వాత తమ నిర్ణయం చెబుతామని వెళ్ళిపోయారు. మళ్ళీ వారం తర్వాత వచ్చి 'మీరు చెప్పినట్టే బ్యాంక్ క్వార్టర్స్‌కు మారిపోతాం' అని చెప్పారు. వారి నిర్ణయానికి అందరూ సంతోషించారు. కావ్య ఆనందానికైతే హద్దు లేకుండా పోయింది. రెండు వారాల తర్వాత కావ్య ఫోన్ చేసి 'మేడం మేము ఇల్లు మారి రెండు రోజులు అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. మేం ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. మీరు మాట్లాడిన తర్వాత అర్థం చేసుకున్నారో లేదా భయపడ్డారో మొత్తానికి ఇల్లు మార్చారు. నాతో కూడా మంచిగానే ఉంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండీ' అని చెప్పి ఫోన్ పెట్టేసింది.-
- సలీమ