Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతు చిక్కని కరోనా కారణంగా మనలో ఒక భయానకమైన ఆందోళన. వేల సంఖ్యలో మరణాలు. లక్షల్లో పాజిటివ్ కేసులు సమయానికి వైద్య సేవలు అందక, ఆక్సిజన్ అందుబాటులో లేక, వాక్సిన్ల కొరత వల్ల ప్రజల్లో మానసికంగా ఎంతో అలజడి... ముఖ్యంగా మహిళలు మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారు. అలాంటి వారి జీవితంలో వెలుగు నింపేందుకు స్వచ్చంధంగా పని చేస్తున్నారు ఆనంద దివాకర్. అధ్యాపక వృత్తిలో ఉంటూ సమాజసేవ చేయాలనే ఉద్దేశంతో ఆ వృత్తిని వదిలి పెట్టి రోష్ని అనే సంస్థలో కార్యకర్తగా పని చేస్తూ సమాజానికి తన వంతు సేవలు అందిస్తున్న ఆమె గురించి ఈ రోజు మానవిలో తెలుసుకుందాం...
నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా హైదరాబాద్‌లోనే. నాన్న మంగిని రామయ్య, అమ్మ వరలక్ష్మి. నా చిన్నతనంలో ఆడపిల్లలకు చదువుకునే అవకాశాలు చాలా తక్కువ. అందుకే తొందరగా పెండ్లి చేయాలనుకుంటారు పెద్దలు. మా నాన్న కూడా నాకు తొందరగా పెండ్లి చేసి పంపించాలనే ఎప్పుడూ ఆలోచిస్తూ వుండేవాడు. కానీ నాకు మాత్రం బాగా చదువుకోవాలని ఉండేది. అందుకే నాన్న పెండ్లి అన్నప్పుడల్లా అన్నం తినకుండా అలుగుతుండేదాన్ని. మా అక్కకు 16 ఏండ్లకే పెండ్లి చేసి అమెరికా పంపించారు. మా బావగారు యు.ఎస్‌లో సైంటిస్ట్. ఆయన మాకు గైడ్‌గా ఉండేవారు. బావతో నేను పెండ్లి చేసుకోను చదువుకుంటా అని నాన్నకు చెప్పించేదాన్ని. బావ నన్ను బాగా ప్రోత్సహించేవారు. నాన్న సమస్య ఏంటంటే నేను డిగ్రీ చేస్తే పీజీ చేసిన వ్యక్తిని చూసి పెండ్లి చేయాలి. పీజీ చేస్తే పీహెచ్డీ చేసిన అల్లుడిని వెదకాలి. అందుకే నన్ను చదివించడానికి భయపడేవారు.
మావారు ప్రోత్సహించారు
పీజీ చేసేటప్పుడు అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి, నా క్లాస్‌మెట్ అయిన దివాకర్గారితో పెండ్లి అయ్యింది. ఆయన కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నన్ను చాలా ప్రోత్సహించేవారు. పెండ్లి తర్వాత 18 సంవత్సరాలు కాలేజీలో జువాలజీ లెక్చరర్‌గా పని చేశాను. కాలేజీలో చేసేటప్పుడు అమ్మాయిల చదువు కోసం ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ ఉండేదాన్ని. నాతో పాటు పని చేసే లెక్చరర్స్ కూడా సహకరించేవారు. మేమంతా కలిసి అమ్మాయిల చదువుకు అన్ని విధాల సహకరించేవాళ్ళం. నా వంతుగా ప్రతి సంవత్సరం పది మంది పేద అమ్మాయిలకు చదువు చెప్పించేదాన్ని. 2003లో విద్యా సంస్థలో, వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఆ సమయంలోనే వీఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చేశాను. అప్పటికే మహిళలకు, అమ్మాయిలకు సేవ చేయాలి అనే ఆలోచన బాగా ఉండేది. వ్యక్తిగతంగా కూడా సాయం చేస్తూ ఉండేదాన్ని. అమ్మాయిల చదువు కోసం సాయం చేస్తున్నానని 'రాజీవ్‌గాంధి అవార్డు' కూడా ఇచ్చారు.
18 ఏండ్లుగా...
వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత కొన్ని స్వచ్చంధ సంస్థల్లో పని చేశాను. 2003లోనే రోష్ని వాళ్ళ యాడ్ చూశాను పేపర్లో. ఆ సంస్థలో పని చేయాలని ఫోన్ చేస్తే ఇంటర్వ్యూలకు రమ్మన్నారు. ఆరు నెలల తర్వాత ఇంటర్వ్యూకు పిలిచారు. అందుకో ఎంపికైన తర్వాత ఆరు రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 18 ఏండ్లుగా ఇదే సంస్థలో స్వచ్చంధ కార్యకర్తగా పని చేస్తున్నాను. రోష్ని అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ 1997లో 'గుడ్ సమరికన్' అనే పేరుతో మొదటి సారి యుకేలో ప్రారంభమయింది. ఇండియాలో అన్ని మెట్రో సిటీల్లో మా సంస్థ తన సేవలు అందిస్తుంది. అయితే ఏ రాష్ట్ర భాషను బట్టి ఆ రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలవడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'రోష్ని' అని పేరు పెట్టారు. మా గైడ్‌లైన్స్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి.
సమస్య వింటే కాస్త ఊరట
'నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నా బాధ వినే వాళ్ళు లేరు. నేను ఒంటరి దాన్ని' అని మానసికంగా కుంగిపోయే మహిళలకు రోష్ని చేదోడుగా వుంటుంది. వారికి అన్ని రకాలుగా కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది. ఇందులో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. మహిళలకు వచ్చే సమస్యలు ముందు వినే వారు ఉండాలి. వింటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మీకు మేమున్నాం
కరోనా ప్రారంభమైన నాటి నుండి ఒక్క రోజు కూడా రోష్నికి ఫోన్ రాకుండా లేదు. ప్రతి రోజు ఫోన్లు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ మనలను మరింత మానసికంగా కుంగ దీస్తుంది. బతుకు మీద ఆశ లేకుండా చేస్తుంది. ప్రియమైన వారిని దూరం చేస్తుంది. రేపు ఉంటామా అనే అనుమానాన్ని కలిగిస్తుంది. దీని నుండి ఎలా బయటపడాలి. ఎలా బతకాలి. నన్నూ, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి. ఈ ఆలోచనలు, అనుమానాలతో, బాధతో, భయాలతో మా సంస్థకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. అలాంటి వారికి మనోధైర్యాన్నిస్తూ, ఓదార్పుగా, వారి బాధలను, ఆలోచనలను వింటున్నాం. బాధను పంచుకుంటున్నాం. స్వాంతన కలగ జేస్తున్నాం. మేము మీకు అండగా వున్నాం అని వారిలో ఆత్మ విశ్వాసాన్ని, జీవితంపై ఆశను కలగజేసే ప్రయత్నం చేస్తున్నాం. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం రోష్ని ముఖ్య ఉద్దేశం.
సేవలు పొందాలనుకుంటే...
గత ఇరవై సంవత్సరాల నుండి నిరంతరం ఉచితంగా సేవలు చేస్తున్న సంస్థ రోష్ని. ప్రస్తుత కరోనా కాలంలోలో కూడా ప్రతిరోజూ బాధల్లో వున్న వారిని ఓదార్చుతూ వారికి అండగా వుండి, ఎంతో మందిని మానసిక ఒత్తిడి నుండి బయటికి తీసుకురాగలిగాం. జీవితంపై ఆశలేక, అంతం చేసుకుందాం అనుకొని కాలం చేసిన వారిని ఎన్నో వేల సంఖ్యలో తిరిగి వారిని ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన సంస్థ రోష్ని. మా సేవలు పొందాలనుకునే వారు 040-66202000, 66202001 ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటలకు వరకు ఫోన్ చేయవచ్చు. మా దగ్గర తమ సమస్యలను చెప్పుకున్న వివరాలు గోప్యంగా వుంచుతాము.
రోష్ని భరోసా ఇస్తుంది
కోవిడ్ కష్టాలను భరించలేక డాక్టర్లు, నర్సులు కూడా రోష్నికి ఫోన్ చేసి తమ బాధలను పంచుకుని ఊరటపొందుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఈ మధ్య ప్రతి ముగ్గురిలో ఒకరికి మానసిక పరమైన ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ సంఖ్య చాలా పెరిగింది. వీటివల్ల మనలో భయం, చికాకు, కోపం, ఆందోళన, ఒత్తిడి, అనుమానం, జీవితంపై నిరాశతో మనిషిని పిరికివారిని చేస్తున్నాయి. కొందరు భయపడి కరోనా వచ్చిందని కుటుంబం మొత్తం ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు కావల్సింది కాస్త ఓదార్పు. మానసిక ధైర్యం, మన బాధలను, ఆలోచనలను పంచుకుని మనల్ని అర్థం చేసుకునేవారు. అండగా నీకు మేమున్నాం అని భరోసా ఇచ్చేవారు. అలాంటి భరోసానే మా రోష్ని ఇస్తుంది.
- సలీమ