Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు వుందన్న నెపంతో ప్రతిఒక్కరు ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, అనవసరమైన ఖర్చులు చేసిపడేస్తున్నారు. అలాగే డిస్కౌంట్స్ సీజన్ వచ్చిందంటే చాలు... వారికి కేవలం ఆ డిస్కౌంట్ బ్యాలెట్లు మాత్రమే కనిపిస్తాయే తప్ప... క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు ఎంత డ్రా చేశాము..? ఎంత ఖర్చు చేశాం..? అందులో ముఖ్యమైనవి వున్నాయా..? లేవా..? అన్న అంశాల గురించి అస్సలు ఆలోచించుకోరు.
''క్రెడిట్ కార్డు తీశామా, గీశామా, కొనుగోలు చేశామా'' అని ప్రతిఒక్కరికి అదొక అలవాటుగా మారిపోయింది. కానీ దీనిని ఒక అలవాటుగా కాకుండా ఒక వ్యసనంగా పోల్చుకుంటేనే మంచిది. ఎందుకంటే.. క్రెడిట్ కార్డు అంటే అప్పు.. అప్పు తీసుకున్నాక దానికి వడ్డీ కూడా కట్టాల్సిందే! ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత ఎక్కువ వడ్డీ... అలాగే ఎంత ఎక్కువ కార్డు ఉపయోగిస్తే.. అంత ఎక్కువ రుణం మీ అకౌంట్లో జమా అయిపోతుందన్నమాట!
ఎలా ఉపయోగించాలి?
క్రెడిట్ కార్డు ఉపయోగం కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే పనికొస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బు అందుబాటులో లేకున్నప్పుడు క్రెడిట్ కార్డు తనదైన ముఖ్యపాత్రను పోషించి, మన గౌరవాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా పండుగ సీజన్లలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓ డ్రెస్సుగానీ, ఇతర సామాగ్రీలు గానీ కొనాలని షాపింగ్ మాల్కి వెళ్లినప్పుడు.. అక్కడ అవసరానికి తగ్గట్టు తక్కువ ధరలో వున్నవాటిని మాత్రమే కొనుగోలు చేసి, క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవాలి. అలా కాకుండా చేతికి ఏదో లడ్డూ దొరికినట్టు దొరికింది కదా అని అవసరమైనవి కాకుండా ఇతర వస్తువులు తీసుకుంటే... క్రెడిట్ కార్ట్ స్క్రాచ్ చేసినట్టే. బ్యాంకువాళ్లు కూడా మీ ఖాతాలో రుణాలను జమచేసి మీకు గుండు గీసేస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి..? ఎంత వరకు ఖర్చు చేసుకోవాలి..? అసలు దాని ఉపయోగమేంటి..? అవసరమైన వస్తువులేవి..? అన్న విషయాలపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాతే క్రెడిట్ కార్డును ఉపయోగించి, ఖర్చులు చేసుకోవాలి. అప్పుడే మీరు మీ ఖాతాలో వున్న డబ్బును కాపాడుకోగలరు.
మనకు అవసరమా లేదా?
క్రెడిట్ కార్డు వాడకం అనేది వారివారి జీవనశైలి మీద ఆధారపడి వుంటుంది. అంటే ముందుగా మనకు క్రెడిట్ అవసరం వుంటుందా..? లేదా..? అన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. సాధారణంగా ఎక్కువ వేతనాలు వున్నవారు తమ డబ్బులను బ్యాంకుల్లోనే జమ చేసి పెట్టుకుంటారు. ఇటువంటివారు తమ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడుపడితే అప్పుడు ఖర్చు చేస్తుంటారు. ఖర్చులకు తగ్గట్టుగా వేతనాలు కూడా వుంటాయి కాబట్టి.. క్రెడిట్ ఉపయోగించడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఖర్చులను మాత్రం సాధ్యమైనంతవరకు అదుపులో వుంచుకునేందుకు ప్రయత్నించాలి. అదే తక్కువ వేతనాలు వున్నవారికి నిత్యావసరాలు తప్ప.. మిగతా ఖర్చులు వుండవు కాబట్టి ఇటువంటివారికి క్రెడిట్ కార్డు అవసరం వుండదు.
ఎంత ఖర్చు చేయాలి?
క్రెడిట్ కార్డు వున్నవాళ్లు ముందుగానే ఏం ఖర్చు చేయాలి..? ఎంతవరకు ఖర్చు చేయాలి..? అవసరమైన వస్తువులు ఏవి..? అన్న వాటి గురించి ఓ లిస్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మొత్తం ఖర్చు ఎంత వరకు వస్తుంది అన్న అవగాహన ముందుగానే వేసుకోవాలి. అప్పుడు మీరు షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు అనవసర ఖర్చులు తగ్గుతాయి. అలాగే క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు పరీక్షించుకొని, చెల్లింపులు చేసుకుంటే.. అధిక రుణభారం నుంచి సులువుగా తప్పించుకోవచ్చు.
విలాస వస్తువులు వద్దు
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే క్రెడిట్ కార్డు ఉపయోగం కొన్ని సందర్భాలలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. మన దగ్గర డబ్బులు అందుబాటులో లేకున్నప్పుడు కేవలం అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. అయితే ఇతర విలాస వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డు ఉపయోగం అంత మంచిది కాదు. ఇతర ఆస్తులను (ఇళ్లు, భూమి) కొనుగోలు చేయడంలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే.. మనకు మంచి లాభాలే అందుతాయి.
రుణ భారం తప్పదు
క్రెడిట్ కార్డును ఉపయోగించుకునే ముందు.. మీరు మీ జీతాన్ని లెక్కవేసుకోవడం మంచిది. మీరు ఎంతవరకు జీతం సంపాదిస్తున్నారో.. అంతకంటే తక్కువగా ఖర్చు చేయాలనుకునే ప్రణాళికతోనే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే మంచిది. దీంతో మీరు బ్యాంకు రుణాల నుంచి కూడా గట్టెక్కుతారు. అలా కాకుండా క్రెడిట్ కార్డులు వినియోగిస్తే ఎక్కువగా పాయింట్లు, రివార్డులు వస్తాయని ఖర్చులు చేస్తే.. తర్వాత మీకు రావాల్సిన జీతానికి బదులు, రుణాలను మోసుకోవాల్సి వస్తుంది.
అత్యవసరాలకు మాత్రమే...
క్రెడిట్ కార్డు ఉపయోగం కేవలం అత్యవసరాలకు మాత్రమేనన్న విషయాన్ని మనసులో పదిలం చేసుకొని ఉపయోగించండి. అప్పుడు మీరు మీ బడ్జెట్‌ను అదుపులో పెట్టుకోగలుగుతారు. లేకపోతే మోయలేని భారం మీ నెత్తిన కూర్చుంటుంది. వాటి నుండి బయటపడలేక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.