Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దశాబ్దాలుగా కొనసాగుతున్న పురుషాధిక్య సమాజంలో మహిళలు తమ ఉనికికై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. సమాజంలో మేము సైతం సగం అంటూ తమ సత్తా చాటుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలో ఇప్పుడు మరో యువకెరటం చేరింది. మహిళా సాధికారతకు మరో ఉదాహరణగా నిలిచింది. ఆమే 23 ఏండ్ల జెని జెరోమ్... కేరళ రాష్ట్రంలో మొదటి వాణిజ్య పైలట్‌గా చరిత్ర సృష్టించింది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఎయిర్ అరేబియా జి 9 449 విమానంలో కో పైలట్‌గా షార్జా నుంచి తిరువనంతపురం చేరుకున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు...
విమానాలపై ఎప్పుడూ మక్కువ చూపే జెరోమ్ సొంత ఊరు తిరువనంతపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొచుతురా అనే తీర గ్రామం. పైలట్ కావాలని ఆమె ఎనిమిదో తరగతిలో ఉన్నప్పటి నుండే కలలు కనేది.
తండ్రి కల కూడా
ప్రస్తుతం అజ్మాన్ అనే ప్రాంతంలో ఆమె నివసిస్తుంది. చిన్నప్పటి నుండి ఆమె కన్న కలను ఇప్పుడు నిజం చేసుకుంది. వాస్తవానికి ఇది ఆమె ఒక్కదాని కల మాత్రమే కాదు. ఆమె తండ్రి అయిన జెరోమ్ కల కూడా. ఈయన లాంప్రెల్ అనే బ్రిటిష్ కంపెనీలో ఫాబ్రికేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కూతుర్ని పైలెట్‌గా చూడాలని ఆయన ఎంతో తప్పించాడు. ఈ విషయంలో కూతురికి అన్ని విధాలా సహకరించాడు. వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహంతోనే ఆమె ఇప్పుడు కేరళ రాష్ట్రంలో వాణిజ్య విమానాన్ని నడిపిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. సోషల్ మీడియాలో ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
అసమానలతో పోరాడుతూ...
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసలు పొందుతున్న 23 ఏండ్ల స్ఫూర్తిదాయక మహిళగా జెని జెరోమ్ ఎందరో ఆడపిల్లలకు మార్గదర్శిగా మారింది. 'తన కలని సాకారం చేసుకోవడానికి అసమానతతో పోరాడుతున్న ఈ యువ పైలట్ జీవితం అందరికీ గొప్ప ప్రేరణ. మహిళలకు అలాగే సాధారణ ప్రజలకు కూడా ఈమె జీవితం ఎంతో స్ఫూర్తినిస్తుంది. జెని కలలు కోరికలకు మద్దతు ఇచ్చిన కుటుంబం కూడా సమాజానికి ఓ రోల్ మోడల్. అమ్మాయిల కలలను నిజం చేసుకునే విషయంలో సమాజం ఎప్పుడూ వారికి మద్ధతుగా నిలబడాలి. వారి విజయాలను అంగీకరించడానికి మొత్తం సమాజం సిద్ధంగా ఉండాలి. జెని భవిష్యత్‌లో ఇంకా ఎత్తుకు చేరుకోవాలని నేను హదయపూర్వకంగా కోరుకుంటున్నాను'' అని ఆయన తన ఫేస్బుక్లో రాశారు.
ఓ మైలురాయిగా...
ఆదివారం ఉదయం జెని జెరోమ్ తన సొంత రాష్ట్రం కేరళకు మొదటి మహిళా వాణిజ్య పైలట్‌గా చరిత్ర సష్టించింది. 23 ఏండ్ల ఆమె తన తొలి విమానమైన ఎయిర్ అరేబియా జి 9 449ను కో-పైలట్‌గా షార్జా నుంచి తిరువనంతపురానికి ఆదివారం ప్రయాణించింది. ఫేస్బుక్ ద్వారా ఈమె విజయాన్ని ఓ మైలురాయిగా ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ కొనియాడారు. ప్రస్తుతం ఆమె కుటుంబం స్థిరపడిన మధ్యప్రాచ్యంలోని అజ్మాన్‌లో పెరిగిన జెని 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏవియేషన్ అకాడమీలో చేరింది.
కుగ్రామం నుండి వచ్చి
రచయిత, తిరువనంతపురం ఎంపి శశి థరూర్ తన ట్విట్టర్లో ''టీవీఎం కొచుతురా నుండి జెని జెరోమ్‌కు కో-పైలట్‌గా తన తొలి విమానంలో ప్రయాణించినందుకు అభినందనలు. ఆమె నేటి ఎయిర్ అరేబియా గ్రూప్ ఫ్లైట్ ఎస్హెచ్జెను టిఆర్వికి ఎగరేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకుంది. ఒక చిన్న కుగ్రామం నుండి వచ్చిన సాధారణ అమ్మాయి ఇప్పుడు వాణిజ్య పైలట్‌గా నిలిచింది. అందరిలో ప్రేరణను నింపింది'' అన్నారు.
- సలీమ