Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిండిపదార్ధాలు, మాంసకత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను మంచి ఆహారం అంటారు. పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మనిషికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను మనం సాధారణంగానే తింటూ ఉంటాం. వీటితో పాటు తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ప్రస్తుత కరోనా కాలంలో మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇటువంటి ఆహారం తీసుకోకతప్పదు. మరి తృణధాన్యాలంటే ఏమిటి.. వాటిని ఎలా తినాలి... వీటిని తీసుకోవడం వల్ల ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి... ఇవన్నీ ఈ రోజు తెలుసుకుందాం...
సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఓదెలు, అరికెలు... ఇవన్నీ చిరు/తణధాన్యాలే. వీటన్నింటినీ కలిపి ఇంగ్లిష్‌లో మిల్లెట్స్ అంటారు. పోషకాలను బట్టి ముతకధాన్యాల్లోని రకాలైన జొన్నల్ని కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. మనిషి తొలినాళ్లలో సాగుచేసిన పంటల్లో ఇవే ఎక్కువ. కానీ అభివద్ధి చెందిన, చెందుతోన్న దేశాలన్నీ వీటిని వదిలి రుచికోసం బియ్యం, గోధుమల్నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే గత కొన్నేండ్లుగా మన ఆహారంలో ప్రధానపాత్ర పోషిస్తున్న బియ్యం మీద అనేక పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు. బాగా పాలిష్ చేసిన బియ్యం తినడంవల్ల బరువు పెరగడం, మధుమేహం బారినపడటం పెరిగింది. ఆధునిక జీవనశైలి కూడా మరో కారణం. ఈ పరిస్థితుల్లో మిల్లెట్స్‌ని రోజూవారీ ఆహారంలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందనీ, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివనీ నిపుణులు నొక్కి చెబుతున్నారు.
అన్నీ వండుకోవచ్చు
పీచు ఎక్కువగా ఉండటంతో ఈ చిరుధాన్యాల పిండితో రుచికరమైన వంటలు చేయలేం. చూడ్డానికీ అంత బాగుండవు. అందుకే చిరుధాన్యాల వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు పొట్టు తీసి, పీచును తగ్గించి మదువైన పిండిని తయారుచేసే యంత్రాలు చాలానే వచ్చాయి. వీటిద్వారా పిండి, రవ్వ పట్టిస్తే అన్ని రకాలూ చేసుకోవచ్చు.
కొవ్వు శాతం తక్కువ?
బియ్యం, జొన్నల్లో మాదిరి పిండి పదార్ధాలూ గోధుమల్లోని ప్రొటీన్లూ వాటిల్లో లేని విధంగా కొద్దిపాళ్లలో కొవ్వులూ చిరుధాన్యాల్లో ఉంటాయి. అందుకే ఇవి సమతులాహారంగా ఉపయోగపడతాయి. సజ్జలు, సామలతో పోలిస్తే రాగుల్లో కొవ్వుల శాతం చాలా తక్కువ.
ఎలా తినాలి?
కొర్రలయినా, సజ్జలయినా అన్నం వండాలంటే తీసుకున్న ధాన్యానికి సుమారు మూడురెట్లు నీళ్లు పోసి ఉడికించాలి. వీటిని అన్నం రూపంలోనే తీసుకోవాల్సిన పనిలేదు... పిండి లేదా రవ్వగా చేసుకుని మన అభిరుచికి తగినట్టుగా ఉప్మా, దోశ, ఇడ్లీ, వడ, బజ్జీ, నిప్పట్లు, పొంగల్, ముద్ద, కిచిడీ, బిర్యానీ, పాయసం, రొట్టె... ఇలా పలు రుచుల్లో చేసుకుని తినవచ్చు. పిండిని బేక్డ్ ఉత్పత్తుల్లోనూ వాడుకోవచ్చు. ధరలు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతూ బియ్యాన్నీ గోధుమల్నీ మాత్రమే కొనుగోలు చేసేవాళ్లంతా వాటికన్నా శ్రేష్ఠమైన చిరుధాన్యాల్ని నమిలి తింటే వాటి ధరలూ దిగి వస్తాయి. మన భోజనం ప్లేటుతో పాటు పంటల్లోనూ వైవిధ్యం పెరుగుతుంది. నేలతల్లీ సారవంతమవుతుంది.
వీటీవల్ల ఉపయోగాలు
- చిరుధాన్యాలన్నింటిలోనూ బి-విటమిన్ శాతం ఎక్కువ. ఐరన్, కాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్... ఖనిజాలన్నీ సమద్ధిగా ఉంటాయి.
- మరే ధాన్యంలోనూ లేని విధంగా 100 గ్రా. రాగుల నుంచి 344 మి.గ్రా. కాల్షియం లభిస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటంవల్ల దంతాలూ ఎముకల పరిపుష్టికి ఇవి దోహదపడతాయి.
- వీటిల్లో అధికంగా ఉండే మెగ్నీషియం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువ. ముఖ్యంగా కొర్రలవల్ల మధుమేహం తగ్గుతుందని వేంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.
- కొరియన్ నిపుణులు ఎలుకల్లో చేసిన పరిశీలనల్లో కూడా ఇతర వాటితో పోలిస్తే కొర్రలు తీసుకున్నప్పుడు ట్రై గ్లిజరైడ్ల శాతం బాగా తగ్గిందనీ అందువల్ల హద్రోగులకు ఇవి ఎంతో మంచివనీ చెబుతున్నారు.
- పీచు ఎక్కువగా ఉండటంవల్ల చిరుధాన్యాల్లోని పిండిపదార్థాలు మెల్లగా జీర్ణమవుతాయి. గ్లూకోజ్ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంటుంది. అందుకే మధుమేహరోగులకి ఇవి ఎంతో మంచివి. ఈ పీచు వల్ల కాస్త తినగానే పొట్ట నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. దాంతో అతిగా తినే ప్రమాదమూ తప్పుతుందన్నది నిపుణుల ఉవాచ.
- వీటిల్లోని పీచు వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవు.
- అన్నింటికన్నా ముఖ్యంగా మిల్లెట్స్‌లో ఫైటేట్స్, టానిన్స్ అనే యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌నీ మధుమేహాన్నీ తగ్గిస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా పండించే అరికెల్లోనూ తరవాత రాగుల్లోనూ ఈ రకమైన ఫినాలిక్స్ అత్యధికంగా ఉన్నాయని తేలింది. అరికెల్ని ఆయుర్వేద వైద్యంలోనూ వాడుతుంటారు.
ఉ వీటిల్లోని ఫైటేట్స్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ క్యాన్సర్లూ, గుండెవ్యాధులు రాకుండానూ కూడా కాపాడతాయట.
- ఎలాంటి ఆమ్లగుణం లేని చిరుధాన్యాలు ఎసిడిటీతో బాధపడేవాళ్లకి ఎంతో మేలు.
- మెనోపాజ్ దాటిన మహిళలూ, అధికరక్తపోటూ, కొలెస్ట్రాల్‌తో బాధపడేవాళ్లూ మిల్లెట్స్‌ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.
- వీటిల్లో అలర్జీ కలిగించే గుణం ఉండదు. అందుకే చిరుధాన్యాల మొలకల్ని పిండి పట్టించి, వండిన ముద్దను పిల్లలకీ, పాలిచ్చే తల్లులకీ, ముసలివాళ్లకీ కూడా పెడుతుంటారు.
- థైరాయిడ్ వ్యాధితో బాధపడేవాళ్లు మాత్రం మిల్లెట్స్‌ని మితంగా తీసుకోవడం మంచిది. వీటిల్లో అయొడిన్ని వ్యతిరేకించే గుణం ఎక్కువ.