Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వాడిన పూలే విసకించెనే.. చెర వీడిన హృదయాలు పులకించెనే'' అంటూ 'మాంగల్య బలం' సినిమాలో పాటను రాసినట్టుగా ఈరోజు ఎండిన పూలతో బొకేలు చేద్దాం. పోయిన వారం మా ఇంట్లో ఫంక్షన్కు చక్కని ఫ్లవర్ బొకేలు ఇచ్చారు మిత్రులు. అవి ఎండిపోయాక అన్నీ తీశేశాను. దాని వెనక ఉన్న వెదురు అల్లిక చాలా నచ్చింది. దాన్నలాగే ఉంచి ఎండిపోయిన ఆస్పరాగస్ కొమ్మలు, జినియా పూలు తీసి పారేశాను. మరి ఇందులో ఏమి పెట్టాలి. మేము గత సంవత్సరం కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టాము. అప్పుడు పిచ్చుకల కోసం వరి కంకులు తెచ్చి పెట్టాము. ఆ వరి గొలుసుల కంకుల్ని వెనక వైపుగా గుచ్చాము. మా ఇంట్లో శంకుపూలు విపరీతంగా పూస్తాయి. వాటి ఎండు కొమ్మల్ని కాయల్తో సహా కోసి ఇందులో గుచ్చాను. అలాగే సెంటుమల్లెలు, గులాబీలు ఎండు కాయల్ని సైతం ఇందులో ఉపయోగించాను. ఎందుకంటే ఇవి నల్లగా ఉన్నాయి. శంకుపూల కొమ్మలు గడ్డిరంగులో ఉన్నాయి. కాంబినేషన్ కోసం వాడాను. తోటకూర కొమ్మల పూల గుత్తులు ఎండినవి తెచ్చి ఇందులో వాడాను. ఇంకా కుండీల్లో వాడిపోయిన పట్నం బంతిపూలు, గులాబీపూలను గుచ్చాను. చేపలబుట్ట లాంటి వెదురు బుట్టకు ఇలా నాసొంత డెకరేషన్తో ఎండు పూల బొకే తయారయింది.