Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా రెండవ దశలో ఆక్సిజన్ దొరక్క.. సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారికి సరైన సమయంలో సరైన సమాచారం అందించడానికి ఆలీషా లోబో ముందుకు వచ్చారు. దానికోసం 'కోవిడ్ఆషా'ను ప్రారంభించారు. ఆమెతో పాటు మరెంతో మంది వాలంటీర్లు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఈ కోవిడ్ఆషా ప్రస్తుతం చాట్‌బాట్, విఎమ్ వేర్, గూగుల్, హెచ్‌పి, ఎంగటి వంటి సంస్థల భాగస్వామ్యంతో 55 నగరాల్లో... ఎనిమిది భాషలలో సమాచారాన్ని అందిస్తుంది. అసలు ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చింది... దీని కోసం ఆమె చేసిన ప్రయత్నం ఏమిటో మనమూ తెలుసుకుందాం...
ఢిల్లీలో నివసిస్తున్న తన తండ్రి కోవిడ్-19తో బాధపడుతున్నాడని బెంగుళూలోని తన స్నేహితుడిని నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. అప్పటికే ఆయన పరిస్థితి విషయమంగా ఉంది. ఆక్సిజన్ అందడం లేదు. అంబులెన్స్‌లో అతన్ని ఆర్మీ ఆస్పత్రికి తీసుకుపోవాలి. కానీ ఆంబులెన్స్ వెంటనే ఎలా దొరుకుతుంది అని ఆవేధన చెందుతున్న సమయంలో కోవిడ్ఆషాకు ఫోన్ చేస్తే కచ్చితంగా అంబులెన్స్ వస్తుంది అని ఆమె స్నేహితుడు ఆమెకు ఆలీషా లోబో నెంబర్ ఇచ్చాడు. ఆమె ఆలీషాతో మాట్లాడింది కానీ సరైన సమయంలో అంబులెన్స్ వస్తుందో లేదో అనే అనుమానం ఆమెకు. కానీ ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఎయిర్‌పోర్ట్‌లో దిగేసరికి ఆంబులెన్స్ సిద్ధంగా ఉంది. తర్వాత ఆమె కూడా ఆ టీంలో ఓ వాలంటీర్‌గా మారిపోయింది.
మొదట ఆమె సందేహించింది
''నేను ఆమెకు వాట్సాప్‌లో కోవిడ్ఆషా వారి నెంబర్ ఇచ్చాను. దాని ద్వారా అంబులెన్స్ బుక్ చేసుకోవాలని సమాచారం ఇచ్చాను. అయితే ఆమె మొదట కాస్త సందేహించింది. మరో అవకాశం లేక ముందుకు సాగింది. ఆమె ఢిల్లీకి చేరుకునే సమయానికి అంబులెన్స్ సిద్ధంగా ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత నా స్నేహితుడు ఆమె తల్లిదండ్రులు కార్డులు ఆడుతున్న చిత్రాన్ని నాకు పంపారు. ఆమె తండ్రి కరోనా నుండి కోలుకున్నారు. అప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది'' అన్నారు ఆలీషా.
వాలంటీర్ల సహకారంతో...
ఆక్సిజన్ సరఫరా, అంబులెన్సులు, బ్లడ్ ప్లాస్మా వంటి ముఖ్యమైన సేవలను, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి కోవిడ్ఆషా ఈ ఏడాది ఏప్రిల్‌లో వెబ్, వాట్సాప్, టెలిగ్రామ్‌లలో చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌గా అలీషా ప్రారంభించారు. సింగపూర్‌కు చెందిన చిన్న వ్యాపార సంస్థలో పనిచేసే అలీషాకు వాలంటీర్లు కూడా కలిసి వచ్చారు. లాక్డౌన్ వల్ల ఆలిసా గోవాలోని తన ఇంటి నుండి పని చేస్తున్నారు. కోవిడ్ -19 వచ్చిన తన కజిన్ కోసం ఆస్పత్రిలో బెడ్ కోసం ప్రయత్నించాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె దీనిపై కొంత పరిశోధన చేసింది.
ముగ్గురు సభ్యులతో ప్రారంభమై...
అప్పటి వరకు అలీషాకు టెక్నికల్ విషయాలపై పెద్దగా అవగాహన లేదు. అయినప్పటికీ కోవిడ్-19 రోగులకు వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ఆమె టెక్నికల్ వనరును అభివద్ధి చేయాలనుకుంది. ''మన దేశంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది వుంది. వాటిని మనం ఉపయోగించుకొని సహాయం చేయాలి. అప్పటికే కొంత మంది ఇలాంటివి ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. వారికి నేను మెసేజ్‌లు పెట్టాను''. అంటున్నారు ఆమె. ముగ్గురు ఆమె మెసేజ్‌లకు స్పందించారు. అలా ముందుగా ముగ్గురు సభ్యులతో వారి మొదటి టెలిగ్రామ్ బాట్ ప్రారంభమైంది. 24 గంటల్లోనే ఇది 50కి పెరిగింది ప్రస్తుతం లక్ష మంది సభ్యులను కలిగి ఉంది.
వాట్సాప్ ద్వారా కూడా...
తర్వాత వీరు వాట్సాప్ బాట్‌ను ప్రారంభించడంపై దృష్టిపెట్టారు. ఎందుకంటే ప్రస్తుతం వాట్సాప్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే వేదిక. దీని ద్వారా అయితే సమాచారం మరింత సులభంగా ప్రజలు తెలుసుకోగరు. దీని గురించి అలీషా ఏమంటున్నారంటే ''మన దగ్గర అందరూ వెబ్సైట్, ట్విట్టర్ ఉపయోగించే అవకాశం లేదు. అదే వాట్సాప్ ద్వారా అయితే ప్రమాదంలో ఉన్నప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారానే కావల్సిన సమాచారాన్ని అత్యంత త్వరగా తెలుసుకోవచ్చు'' అంటున్నారు.
55 నగరాల్లో...
బోట్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి మాట్లాడుతూ ''దీన్ని ఉపయోగించడం చాలా సులభం. మీరు దానితో చాట్ చేయవచ్చు. ఇది మీకు ఏమి అవసరమో అడుగుతుంది. ఆక్సిజన్ రీఫిల్లింగ్, ఆక్సిజన్ సరఫరాదారులు, ప్లాస్మా, అంబులెన్సులు ఇలా ఏది అవసరమైతే దాన్ని వెంటనే అవి ఎక్కడ దొరుకుతాయో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మేము 55 నగరాల్లోని కరోనా బాధితులకు సమాచారం అందిస్తున్నాము. సరఫరాదారుల కోసం చాట్‌బాట్ ఉంది. ఎవరైనా సమాచారం అడిగినప్పుడు అత్యంత త్వరగా అవి చేరేలా చేస్తుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది అత్యవసర సేవలు అడిగినప్పుడు వెంటనే గుర్తించి వారికి సరైన సమయంలో సరైన సమాచారం అందేలా చేస్తాము. దానికి కావల్సిన టెక్నికల్ సమాచారం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. కోవిడ్ఆషా పనిని మరింత సులభతరం చేసుకునేందుకు కొన్ని సంస్థలు సహకరిస్తున్నాయి. దీనికోసం అవిశ్రాంతంగా పనిచేసే ఇంజనీర్లు, ఇతర నిపుణులను అందించిన కొన్ని సంస్థల భాగస్వామ్యంతో ఇది నడుస్తుంది''.
ఎనిమిది భాషల్లో...
ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక భాషలో ప్రజలకు సమాచారం అందించడం చాలా అవసరం. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఇచ్చిన సలహాతో దీన్ని ఆలిషా ప్రారంభించారు. ప్రస్తుతం కోవిడ్ఆషా ఎనిమిది భాషలలో మాట్లాడుతుంది. ఆర్సి మెడిక్రూకు చెందిన డాక్టర్ విధి షాతో పాటు భారతదేశంలోని 65 నగరాల్లోని వారి 350 వైద్య, పారామెడికల్ విద్యార్థులు, నిపుణులు కోవిడ్ఆషాతో చేతులు కలిపి బోట్లో జరుగుతున్న సమాచారాన్ని మాన్యువల్‌గా ధవీకరిస్తున్నారు.
సహాయకారిగా ఉంది
కోవిడాఆషా ప్రారంభించినప్పటి నుండి 3,500 మంది కరోనా బాధితులు, 20,000 మందికి పైగా సాధారణ ప్రజలు దీని సేవలు ఉపయోగించుకున్నారు. పరస్పర చర్యలను కలిగి ఉన్నారు. వారు సమాచారం అడిగిన రెండు నిమిషాల్లోపు వారి కాంటాక్ట్‌ను సరఫరాదారులను అందిస్తుంది. 2,000 మందికి పైగా ప్రజలు దీన్ని సహాయకరంగా గుర్తించారు. ఇది దాని ప్లాట్ఫామ్లో 5,000 కంటే ఎక్కువ మంది సరఫరాదారులను, అనుబంధ సంస్థల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. .
సరైన సమయంలో సరైన సమాచారం
రెండవ దశలో కరోనా విజృంభిస్తున్నా అవసరమైన సమయంలో బాధితులకు కావల్సిన సమాచారం దొరకడం లేదు. పైగా మోసాలు బాగా జరుగుతున్నాయి. ఆన్లైన్లో సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నించే వారికి స్థానిక భాషలు తెలియకపోవడం వల్ల కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తన పరిశోధనలో ఇవన్నీ తెలుసుకున్నారు. అప్పుడు ఈ మోసాలు నివారించాలని, బాధితులకు సరైన సమాచారం అవసరమైన సమయంలో ఇవ్వాలని దీనికోసమే 'కోవిడ్ఆషా ' ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకన్నారు.
ఇంకా భాగస్వాములు కావాలి
''ఈ మహమ్మారిని ప్రస్తుతం మనం ఏమీ చేయలేము. మా చేతుల్లో ఉన్నది మా వాలంటీర్ల ద్వారా రోగంతో బాధపడుతున్న వారికి సరైన సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడుకోవడమే. దీనిపైనే మా కోవిడ్ఆషా టీం దృష్టి సారిస్తుంది. మరో విషయం ఏమిటంటే ఆరోగ్య సేవలు ఎంతో అవసరమైన మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు ఈ సహాయం అందించడానికి మరింత మంది దీనిలో భాగస్వాములు కావల్సి వుంది. కలిసి వచ్చే భాగస్వామ్యాలను చేర్చడానికి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి
- సలీమ