Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు సోకుతుంది... పదే పదే ఇదే చెబుతున్నారు. మరి పిల్లల్ని కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలో.. ఏ ఆహారం ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మరీ పసికందులైతే... తల్లిపాలే వారికి సరైన ఆహారం. కాస్త పెరిగి దంతాలు వచ్చిన పిల్లలకు మాత్రం రకరకాల ఆహారాలు పెట్టాలి. అవేంటో చూద్దాం.
- రోజూ ఉదయం పిల్లలకు తప్పనిసరిగా పాలు ఇవ్వండి. బ్రేక్ పాస్ట్ కోసం చపాతీలు, ఇడ్లీలు, పరాఠాలు, దోసెలు... ఏవైనా పెట్టొచ్చు. వాటిలో కాస్త పల్లీ చట్నీ, పప్పు ఉండేలా చెయ్యండి. వీలైతే ఓ ఉడకబెట్టిన గుడ్డు జత చెయ్యండి.
- మధ్యాహ్నం భోజనం పెట్టే లోపు మధ్యలో ఓ అరటిపండో, పుచ్చకాయ జ్యూసో వంటిది ఏదైనా రసం లాంటిది ఇవ్వండి. దీంతో జీర్ణక్రియ బాగా జరిగి విటమిన్స్ బాడీ మొత్తం అందుతాయి.
- మధ్యాహ్నం రైస్తోపాటూ ఏదైనా కర్రీ ఇవ్వండి. ఈ కర్రీలు... వారంలో రకరకాలవి వండాలి. అంటే మాంసం, గుడ్లు, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు ఇవన్నీ వారంలో పిల్లలకు అందేలా చెయ్యాలి. ప్రతి వారం ఇవన్నీ అందుతున్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి. మాంసం తినని వారు వారానికి రెండుసార్లు కందిపప్పు వండిపెట్టాలి. అలాగే గుడ్లు కూర తప్పనిసరిగా వారంలో రెండు సార్లు పెట్టాలి.
- ఆకుకూరల్లో విటమిన్లు, పోషకాలు ఎక్కువ. పిల్లలు వద్దు అని మారం చేసినా అవి వారు తినేలా చెయ్యాలి. వాటిలో అప్పడం, వడియాల వంటివి జతచేసి పెట్టండి. అప్పుడు తింటారు. చివర్లో పెరుగుతో అన్నం తినేలా అలవాటు చెయ్యండి.
- సాయంత్రం వేళ చాలా మంది టీ తాగి సరిపెట్టుకుంటారు. పిల్లల విషయంలో టీ మాత్రమే సరిపోదు. వాళ్లు మధ్యాహ్నం భోజనం చేశాక... ఆడతారు లేదా... ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి జ్యూస్ లేదా స్నాక్స్ లాంటివి పెట్టవచ్చు. ఏవైనా సరే ఇంట్లోనే వండి పెట్టండి. బయటవి అస్సలు పెట్టవద్దు. ఆలూ చిప్స్, సమోసా, పకోడి, బజ్జీ, మొలకలు ఇలా ఏవైనా కొద్దిగా పెట్టండి. ఇవేవీ కుదరవు అనుకుంటే ఏవైనా ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టండి. అంతేగానీ చాక్లెట్లు, ఐస్క్రీమ్లు, కేకులు, స్వీట్లు, ఆయిల్ ఫ్రైల వంటివి వీలైనంత వరకూ పెట్టకండి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీ ప్రయత్నం మొత్తం వథా అవుతుంది.
- రాత్రి వేళ అన్నం కంటే చపాతీ, రోటీ, పుల్కా వంటివి మేలు. వాటితోపాటూ రకరకాల కర్రీలు పెట్టాలి. ఒక్కో రోజు ఒక్కో కర్రీ వండాలి. ఏదైనా సరే... పిల్లలు తినేలా చెయ్యాలి. వారి ఫుడ్ విషయంలో పూర్తి సంతప్తితో తినేలా చెయ్యాలి. చివర్లో మజ్జిక ఇస్తే మంచిదే. ఇలా ప్రతి వారం వారికి సమగ్రంగా అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ అందుతున్నాయో లేదో గమనించుకోండి.
- ఇంట్లో గోడపై ఓ డైట్ చార్ట్ వేలాడ దీసుకోండి. అందులో ఆదివారం ఏం వండాలో, సోమవారం ఏం వండాలో... ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి ఏం వండాలో లిస్ట్ రాసుకోండి. ఈ చార్టులో వారంలో అన్ని రకాలూ వండేలా రెడీ చేసుకోండి. దాంతో వారం వారం పూర్తిగా సమగ్రమైన ఆహారాన్ని పిల్లలకు పెట్టినట్టు అవుతుంది. అలాగే... పిల్లలను రాత్రివేళ ఎక్కువ సేపు మెలకువగా ఉంచకండి... వారికి నిద్ర ద్వారానే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. రాత్రి భోజనం చేశాక రెండు గంటల్లో నిద్రపోయేలా చెయ్యండి. వాళ్ల ఆరోగ్యం విషయంలో రాజీ పడకండి.