Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కండ్లు చాలా సున్నితమైనవి. వాటిలో ఎన్నో ఆర్గాన్లూ, పార్టులూ ఉంటాయి. అన్నీ చక్కగా పనిచేస్తేనే మనం చక్కగా చూడగలం. కండ్లకు హాని జరిగితే... ఒక్కోసారి చూపు కూడా పోతుంది. సరైన ఆహారం తింటేనే కండ్లకు మేలు జరుగుతుంది. కరోనా వచ్చాక డిజిటల్ క్లాసులు, వర్చువల్ మీటింగ్స్ కారణంగా కండ్లపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా మందికి కండ్లు పొడిగా అవుతూ, మంటలు పెడుతున్నాయి. అందుకే కండ్లకు మేలు చేసే ఆహారం ఏదో తెలుసుకుందాం.
- విటమిన్ ఏ కండ్లకు మేలు చేసే పోషకం. ఈ యాంటీఆక్సిడెంట్... కంటి చూపును నిలబెడుతుంది. కంటిలోని కార్నియాను కాపాడుతుంది. కంటి బయటి పొరను రక్షిస్తుంది. రెటీనా బాగా పనిచేసేలా చేస్తుంది. కాంతిని మెదడులోని నరాలకు పంపడంలో విటమిన్ ఏ బాగా ఉపయోగపడుతుంది. ఏ కలర్ ఏదో గుర్తించడానికి కూడా ఈ విటమిన్ సహకరిస్తుంది. అందువల్ల విటమిన్ ఉండే క్యారెట్, బత్తాయి, బొప్పాయి, గుడ్లు, మామిడి, ఆప్రికాట్స్, వెన్న, బ్రకోలి, చేపలు, ఆవకాడో, దుంపలు మీ డైట్లో ఉండేలా చేసుకోండి.
- ల్యూటెయిన్ మరోరకమైన పోషకం. ఇది కండ్లలోని కలర్స్‌ని గుర్తించే రెండు కెరోటెనాయిడ్స్లో ఉంటుంది. సూర్యుడి ఎండ నుంచి కండ్ల కణజాలాన్ని కాపాడటంలో ల్యూటెయిన్ బాగా పనిచేస్తుంది. వయసు పెరుగుతున్నప్పుడు చూపు కోల్పోకుండా ల్యూటెయిన్ కాపాడుతుంది. ఈ పోషకం కోసం ఆకుకూరలైన బ్రకోలి, తోటకూర, బచ్చలి వంటివి తినాలి. కూరగాయల్లో బఠాణీలు, మొక్కజొన్న వంటివి తినాలి. పండ్లు, చేపలు, గుడ్లు తీసుకోవాలి.
- కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే జీక్సాన్థిన్ అత్యవసరం. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటిపై కాంతి పడేటప్పడు ఎక్కువా, తక్కువ కాకుండా చూస్తుంది. సన్ గ్లాస్ పెట్టుకున్నప్పుడు మనం సూర్యుడి అతి నీల లోహిత కిరణాల నుంచి ఎలా తప్పించుకుంటామో అలాగే... ఈ జీక్సాన్దిన్ కూడా కంటిని కాపాడుతుంది. ముఖ్యంగా టీవీలు, లైట్లు, మొబైల్ ఫోన్లలో ఉండే బ్లూ లైట్ వల్ల కంటికి హాని జరగకుండా చేస్తుంది. దీని కోసం గుడ్లు, బచ్చలి, మొక్కజొన్న, బఠాణీలు, చిక్కుడుకాయలు, బ్రకోలి తినాలి.
- విటమిన్ సీ కూడా కంటికి అవసరం. ఇది కంటిపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటికి హని కరమైన వ్యర్థాలు రాకుండా కాపాడుతుంది. క్యాటరాక్ట్ సమస్య రాకుండా కాపాడుతుంది. కంటిలోని కార్నియాను రక్షిస్తుంది. విటమిన్ సి కోసం పుల్లగా ఉండే పండ్లను తినాలి. అలాగే... టమాటాలు, బ్రకోలి, ఆకుకూరలు, బెల్ పెప్పర్స్, చిక్కుడు కాయలు, క్యాలీఫ్లవర్, దుంపలు, చిలకడదుంపలు, కొత్తిమీర వంటివి తినాలి.
- విటమిన్ ఇ కూడా యాంటీఆక్సిడెంటే. కండ్లకు విష వ్యర్థాలు రాకుండా అడ్డుకుంటుంది. వయసు పెరిగేటప్పుడు వచ్చే కంటి సమస్యలను పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని కోసం గుడ్లు, మొక్కజొన్న, బెల్ పెప్పర్, దోసకాయలు, బచ్చలి, గోధుమలు, ఆవకాడో, కివి, మామిడి, బ్రకోలి, కొత్తిమీర, పల్లీలు, ఎండుమిర్చి, బాదం వంటివి తినాలి.
- కంటి రెటీనా బాగా పనిచెయ్యాలంటే జింక్ తప్పనిసరి. కంటి వెనక కణజాల పొరను ఇది కాపాడుతుంది. లివర్ నుంచి విటమిన్ ఏ ని కంటికి చేర్చడంలో జింక్ బాగా పనిచేస్తుంది. రే చీకటి రాకుండా ఉండాలంటే జింక్ తప్పనిసరి. జింక్ కోసం ధాన్యాలు, గింజలు, నువ్వులు, గుమ్మడికాయ గింజలు, పండ్లు, కూరగాయలు, బచ్చలి, బద్దలు, పుట్టగొడుగులు, మాంసం తినాలి.