Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సోకిన వారిని ఆదరించేందుకు సొంత కుటుంబ సభ్యులు ముందురు రాని పరిస్థితి. ఇక మరణించిన తర్వాత వారి మృతదేశాలు దిక్కులేనివిగా మారిపోతున్నాయి. అటువంటి అనాధశవాలను దహనం చేసేందుకు ముందుకు వచ్చారు మధుస్మిత.. నర్సుగా పని చేస్తున్న 38 ఏండ్ల ఈమె దీని కోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ప్రస్తుతం తన భర్తతో కలిసి కోవిడ్-19 బాధితుల మతదేహాలను దహనం చేస్తోంది. ఆ జంట స్ఫూర్తిదాయక కథ గురించి మనమూ తెలుసుకుందాం...
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ప్రదీప్ సేవా ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న మధుస్మితా ప్రస్తి, ఆమె భర్త ప్రదీప్ కుమార్ ప్రస్తి గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్ -19 వల్ల ఎదురైన కష్టాలకు సాక్ష్యమిస్తున్నారు. మధుస్మితా 2019లో కోల్‌కతాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో చేస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి భువనేశ్వర్‌లోని తన స్వగ్రామంలోని శ్మశానవాటికలో పనిచేస్తున్న తన భర్త ప్రదీప్‌తో కలిసి కరోనాతో చనిపోయిన వారి శరీరాలను దహనం చేసేందుకు సాయం చేస్తుంది.
రోజుకు 20 మృతదేహాలు
కోవిడ్ -19 రెండవ దశ ప్రారంభమైన నాటి నుండి మధుస్మిత రోజుకు కనీసం 20 మృతదేశాలను దహనం చేస్తున్నారు. ఈ జంటకు రోజులో 20 గంటలు ఆసుపత్రులలో పోస్టుమార్టం గదులల్లో, మతదేహాలను దహన ప్రదేశాలకు తీసుకెళ్లడం, వాటిని దహనం చేసే ఏర్పాట్లు చేయడంతోనే సరిపోతుంది.
తినేందుకు సమయం లేదు
''మాకు పగలు, రాత్రి ఏ సమయంలోనైనా కాల్స్ వస్తాయి. అప్పుడు మేము వెళ్ళాలి. భోజనం చేయడానికి కూడా మాకు సమయం ఉండదు. ఎప్పుడు ఖాళీగా ఉంటామో మా చేతుల్లో లేదు. నిన్న, మేము భోజనానికి బదులు బిస్కెట్లు తీసుకున్నాము'' అని అంటున్నారు ప్రదీప్. కోవిడ్ -19 మరణాల సంఖ్య పెరగడం వల్ల ఈ జంట ఇప్పుడు భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన శ్మశానవాటికలో పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
చాలా బాధగా ఉంది
''నేను నర్సుగా నా గత అనుభవం ద్వారా కరోనా రోగులకు మందులు ఇవ్వడం, ఆసుపత్రులకు తీసుకెళ్లడం వంటి సేవలు కూడా చేస్తున్నాను. పిల్లల కోసం జీవితాంతం కష్టపడే తల్లిదండ్రులు చివరకు వారికి ఇలా అపరిచితులుగా మారిపోవడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. వైరస్ సోకిన వారిని సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది.
బాల్యం నుండే సేవ
మధుస్మిత ఇబ్బందులంటే ఏమిటో తెలియకుండా పెరిగిన వ్యక్తి. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ... ఆమె నోయిడాలోని ఒక సాంప్రదాయ, ఉన్నత కుటుంబంలో పెరిగారు. ఇతర వ్యక్తులను తాకవద్దు, ఇతరుల ఇళ్లకు వెళ్ళవద్దు అని ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. కానీ మధుస్మిత మాత్రం తన ఇంటి నుండి బియ్యం, కూరగాయలు, పండ్లు వంటి కిరాణా సామాను ప్యాక్ చేసుకుని సమీపంలో ఉన్న నిరుపేదలకు ఇస్తుండేది. ''నేను ఏడవ తరగతి చదువుతున్న సమయంలో మా ఇంటి తోటలోని చెట్టు పండ్లను పేదలకు ఇచ్చేందుకు తీసుకుపోతుంటే మానాన్న చూసి పట్టుకున్నాడు. వీటిని ఎక్కడికి తీసుకెళుతున్నావు అని నన్ను కొట్టారు'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.
సేవకు అంకితమైన వ్యక్తితో...
కొన్నేండ్ల తర్వాత ఆమె తన భర్త ప్రదీప్‌ను ఫేస్బుక్లో కలిసింది. ''ఇతరులకు సహాయం చేయడంలో నాకు ఆనందం లభించినట్టే, దశాబ్దాలుగా సామాజిక సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆ వ్యక్తితో నేను ప్రేమలో పడ్డాను. మేము ఆన్లైన్లో కనెక్ట్ అయ్యాము నేను ఒడిశాలోని మా సొంతూరుని సందర్శించినప్పుడల్లా నేను అతనితో కలిసి పనిచేసేదాన్ని. మేము 2010లో వివాహం చేసుకున్నాము'' అని మధుస్మిత చెప్పారు.
మహిళపై విరుచుకుపడతారు
వివాహం అయిన వెంటనే మధుస్మిత కోల్‌కతాలో నర్సింగ్ చేశారు. తర్వాత అక్కడే నర్సుగా పని ప్రారంభించారు. ఆమె 2019లో తిరిగి ఇంటికి తిరిగి వచ్చి కోవిడ్ మృతదేశాలను దహనం చేసేందుకు ఒంటరిగా కష్టపడుతున్న భర్తకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. అయితే పురాతన హిందూ సాంప్రదాయం స్మశాన వాటిక వద్ద మహిళల ఉనికిపై విరుచుకుపడుతుంది. అయితే మధుస్మితకు ఈ నియమాలకంటే కూడా ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే ముఖ్యమని బాగా తెలుసు. కాబట్టి ఏ సాంప్రదాయ సంకెళ్ళు ఆమెను ఆపలేకపోయాయి.
కానీ సవాళ్లు ఉన్నాయి
మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఆమె ఒంటరిగా బయటికి వచ్చినప్పుడు.. అర్థరాత్రి అంబులెన్స్ నడుపుతుండగా.. ఇతర మగ డ్రైవర్లు ఆమెను ఆటపట్టిస్తుండేవారు. అన్నింటికంటే ముఖ్యమైనది ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ పని చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. ''కొన్ని సమయాల్లో, ప్రజలు స్టేషన్ నుండి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైలు నుండి దూకి ఆత్మహత్యలు చేసుకునేవారు. రైల్వే ట్రాక్‌ల మధ్య వాహనాలను నడపలేము. అలాంటి మతదేహాలను సేకరించడం చాలా కష్టం. మతదేహాలను వెలికితీసేందుకు ట్రాక్‌ల మధ్య వెళ్లడం మాకు ప్రాణాంతకం'' అని ఆమె చెప్పారు.
కుటుంబం గడిచేందుకు
ప్రస్తుతానికి తమ సేవలను ఉచితంగా అందిస్తున్న ఈ జంట, మతదేహాలను దహనం చేయడానికి కుటుంబ సభ్యులు అందించే వాటిని సాధారణంగా అంగీకరిస్తారు. వీరిక ఓ కొడు, ఓ కూతురు ఉన్నారు. నలుగురు సభ్యులు ఉన్న వీరి కుటుంబం ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటారు. వీరి ట్రస్ట్‌కు సుమారు 50 మంది సభ్యులు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం దంపతులు మతదేహాలను తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు ఆర్థిక సహాయం కోసం ఇంకా ఎంతో మంది దాతలు ముందుకు రావాలని వారు కోరుకుంటున్నారు.''ఇది మా రెండవ అంబులెన్స్, ఎందుకంటే మేము దానిని విస్తతంగా ఉపయోగిస్తాము. దాన్ని నిత్యం కడగాలి. దీని మెయిటెనెన్స్కు చాలా ఖర్చు అవుతుంది'' అని ఆమె అంటున్నారు.
- సలీమ