Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం కరోనా కారణంగా అందరి దృష్టి ఆరోగ్యం వైపు మళ్ళింది. ఆరోగ్య కరమైన ఆహారం తీసుకునేందుకు సాధ్యమైనంత వరకు అందరూ ప్రయత్నిస్తున్నారు. మనం రోజు వారి తీసుకునే ఆహారంలో ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రోజు మొత్తం మనం ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే తిండి పుష్టికరమైనదై ఉండాలి. అలాంటి కొన్ని రుచికరమైన అల్పాహారాలు మీకోసం...
పెసరపప్పు దహి వడ
కావల్సిన పదార్థాలు: పెసరపప్పు - రెండు కప్పులు, నూనె - తగినంత, పెరుగు - మూడు కప్పులు, కొత్తిమిర - కట్ట, ఉప్పు - తగినంత, జీలకర్ర - చెంచా, అల్లం - తగినంత, పచ్చిమిర్చి - నాలుగు, కారం - చెంచా, ఎండుమిర్చి - మూడు, స్వీట్ చట్నీ - రెండు చెంచాలు, జీలకర్ర పొడి - చెంచా, చాట్ మసాలా - చెంచా.
తయారు చేసే విధానం: మూడు గంటల ముందు పెసరపప్పును నీళ్ళల్లో నానపెట్టాలి. తర్వాత పెసరపప్పు కడిగి నీటిని మొత్తం తీసేసి వడకట్టి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకుని ఈ పిండిని గుండ్రంగా వడల్లా చేసుకుని నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన వడలను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉప్పు వేసి తాలింపు వేసిన పెరుగును పోయాలి. దానిపై జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, కారం వేసి, స్వీట్ చట్నీ వేసి కొత్తిమిరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.
చిరుధాన్యాలతో దోశ
కావల్సిన పదార్ధాలు: రాగి, కొర్రలు, జొన్న, సజ్జలు, బార్లీ అన్ని కలిపి - కప్పు, మినపప్పు - కప్పు, బియ్యం- రెండు కప్పులు, ఉప్పు - చెంచా, మెంతులు - చెంచా, నూనె - సరిపడినంత.
తయారు చేసే విధానం: మల్టీ గ్రైన్ ప్యాకెట్లు బజారులో కూడా దొరుకుతాయి. ఆ రవ్వ అయినా ఒక కప్పు నానబెట్టుకోవచ్చు. ఇవ్వన్నీ నాలుగు గంటల పాటు నానబెట్టుకుని మినప్పప్పు, బియ్యం, అన్ని కలిపి మెంతులతో సహా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని ఆరు గంటల పాటు అలా ఉంచితే కాస్త పులుస్తుంది. దానిలో ఉప్పు వేసి పెనంపై నూనెరాసి దోశల్లా వేసుకోవాలి. ఇవి కాస్తా కోరా రంగు నుంచి గోధుమ రంగులో వస్తాయి. పైన క్యారెట్ తురుము, ఉల్లి పొట్టు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి తయారుచేసుకుంటే చాలా బావుంటాయి. వీటిలోకి టమాటా పచ్చడి, కొత్తిమీర, అల్లం... ఏ పచ్చడి అయినా బావుంటుంది. ఈ దోశలు వేడిగా తింటే మరింత రుచిగా ఉంటాయి. పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యానికి ఎంతో మంచివి.
దొండకాయ పకోడి
కావల్సిన పదార్థాలు: దొండకాయలు - పావుకిలో, నూనె - సరిపడా, కొత్తిమీర - కట్ట, శనగపిండి - పావుకిలో, ఉప్పు - తగినంత, కార్నఫ్లోర్ - ఒక టేబుల్ స్పూను, పచ్చిమిర్చి - నాలుగు,
జీలకర్ర - టీ స్పూను.
తయారు చేసే విధానం: ముందుగా దొండకాయల్ని నిలువుగా, సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఈ పిండితో పకోడీలు వేసుకోవాలి.
ఓట్స్ చపాతీ
కావల్సిన పదార్థాలు: ఓట్మీల్ పిండి - కప్పు, గోధుమపిండి - కప్పు, శనగపిండి - కప్పు, మెంతిపొడి - అరటీస్పూను, నెయ్యి - తగినంత, ఉప్పు- తగినంత, జీలకర్ర పొడి - అరటీస్పూన్.
తయారుచేసే విధానం: ముందుగా ఓట్స్ పిండి, గోధుమ పిండి, శనగ పిండి అన్నింటినీ కలిపి అందులో ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి రెండు స్పూన్ల నెయ్యి గోరువెచ్చని నీళ్ళు వేసి చపాతీలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అర గంట నానిన తర్వాత ఉండలు చేసుకుని చపాతీల్లా చేసి పెనం మీద కాల్చాలి. చివరలో చపాతీ మీద నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. ఈ చపాతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా కాని రాత్రీ డిన్నర్ లోకి కాని తీసుకోవచ్చు.