Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవనశైలి మార్పులు, శారీరక శ్రమకు దూరంగా ఉండటం వంటి కారణాలతో యువత టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, హైపర్ టెన్షన్ వంటి అనారోగ్యాలను ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలం వేధించే అధిక రక్తపోటు సమస్య.. గుండెపోటు, స్ట్రోక్, డిమెన్షియాకు కూడా దారితీస్తోంది. వీటన్నింటినీ వ్యాయామం లేదా ఫిజికల్ యాక్టివిటీ దూరం చేస్తుందని పరిశోధనల్లో నిరూపించారు.
ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి?: శరీర కండరాలు కదల్చడం ద్వారా శక్తిని ఖర్చు చేయడాన్ని శారీరక శ్రమ అంటారు. నడక, పరుగు, సైక్లింగ్, ఆటలు, పనిచేయడం వంటివన్నీ శారీరక శ్రమ కిందకు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 18 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు వారు వారంలో కనీసం 150 - 300 నిమిషాల పాటు ఒక మాదిరి తీవ్రత ఉండే ఏరోబిక్ ఫిజికల్ యాక్టివీటీ అవసరం. వీరు వారంలో కనీసం 75-150 నిమిషాల పాటు ఎక్కువ తీవ్రత ఉండే ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీలు చేయాలి. లేదంటే వారం పొడవునా ఇలాంటి రెండు రకాల వ్యాయామాలు కలిపి చేయాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కానీ తాజా అధ్యయనం మాత్రం ఈ వ్యాయామాన్ని వారానికి ఐదు గంటల వరకు పెంచడం విశేషం. దీనివల్ల మధ్య వయసులో హైపర్ టెన్షన్ సమస్యకు దూరంగా ఉండవచ్చని తాజాగా నిర్వహించిన బెనిఆఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పరిశోధన వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించారు.
పరిశోధన ఇలా: 18 నుంచి 30 ఏండ్ల వయసు ఉన్న సుమారు 5,000 మందిపై ఈ అధ్యయనం చేశారు. వీరందరి ఆరోగ్యాన్ని 30 ఏండ్ల పాటు పర్యవేక్షించారు. వారి వ్యాయామ అలవాట్లు, మెడికల్ హిస్టరీ, పొగతాగే అలవాట్లు, ఆల్కహాల్ తీసుకోవడం వంటి వివరాలను క్రమం తప్పకుండా అడిగి తెలుసుకున్నారు. వీరందరి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులు, రక్తపోటు, బరువును నమోదు చేశారు. వీరిలో యుక్తవయసులో వారానికి కనీసం ఐదు గంటలు వ్యాయామం చేసినవారు 17.9 శాతం మంది ఉన్నారు. ఇతరులతో పోలిస్తే వీరికి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం 18 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 11.7 శాతం మంది వ్యక్తులు 60 ఏండ్లు వచ్చే వరకు వ్యాయామ అలవాట్లను కొనసాగించారు. వీరు హైపర్ టెన్షన్‌కు గురయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉందని గుర్తించారు.