Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగాల్లో పనిఒత్తిడి దీర్ఘకాలంలో ఎన్నో దుష్ప్ర భావాలకు కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. పెరుగుతున్న పనిగంటల వల్ల చనిపోతున్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య, కోవిడ్-19 మరణాల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. నిర్ణీత సమయం కంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల సంవత్సరానికి లక్షలాది మంది చనిపోతున్నారని సంస్థ ఇటీవల తెలిపింది.
- ఎక్కువ పని గంటలు మరణాలకు ఏవిధంగా కారణమవుతున్నాయనే అంశంపై డబ్ల్యూహెచ్ఓ మొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది. దీని ఫలితాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించారు. ఈ పరిశోధనను డబ్ల్యూహెచ్ఓ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి.
- 2016లో హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులతో 7,45,000 మంది ఉద్యోగులు మరణించినట్టు అధ్యయనం తేల్చింది. 2000 నుంచి చూస్తే ఈ సంఖ్య దాదాపు 30 శాతం పెరిగింది. పని ఒత్తిడి బాధితుల్లో సుమారు 72 శాతం మంది మగవాళ్లు, మధ్య వయస్కులు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే కావడం గమనార్హం.
- వారానికి 55 గంటలు, అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓలో పర్యావరణ, వాతావరణ మార్పులు, ఆరోగ్య శాఖ విభాగం డైరెక్టర్ మరియా నీరా తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల రక్షణ, ఆరోగ్య భద్రతకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు.
- ఉద్యోగంలో చేరిన చాలా సంవత్సరాల తర్వాత మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. మొత్తం 194 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధ్యయనం చేశారు. వారానికి 35-40 గంటలు పనిచేసే వారి ఆరోగ్యాన్ని... వారానికి 55, అంతకంటే ఎక్కువ గంటలు పని చేసే వారి ఆరోగ్యంతో పోల్చారు.
- ఎక్కువ పని గంటల వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35 శాతం, గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 17 శాతం ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. చైనా, జపాన్, ఆస్ట్రేలియాతో సహా ఆగేయాసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల ప్రజలు అధిక పని గంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
- కోవిడ్ ప్రభావానికి ముందు, 2000-2016 మధ్య కాలాన్ని ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను కూడా లెక్కలోకి తీసుకుంటే, పనిగంటల పెరుగుదల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
- మహమ్మారి తరువాత కనీసం తొమ్మిది శాతం మంది ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని సంస్థ అంచనా వేసింది. పనిగంటలపై పరిమితి విధించడం వల్ల యాజమాన్య సంస్థలే లబ్ధి పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- దీనివల్ల కార్మికుల ఉత్పాదకత పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ ఆఫీసర్ ఫ్రాంక్ పెగా చెప్పారు. వివిధ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పని గంటలు పెంచకూడదని ఆయన సూచిస్తున్నారు.