Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్‌వేవ్‌లో పెద్దవాళ్ళతో పాటుగా పిల్లలూ దాని బారిన పడుతున్నారు. ఇంట్లో ఎవరైనా కరోనా రోగులు హోం క్వారంటైన్లో ఉన్నపుడు పిల్లల్ని దూరంగా ఉంచాలి. లేకుండా వారికీ వచ్చే ప్రమాదముంది. అదీ పాలు తాగే పిల్లలయితే మరీ కష్టం. ఆసుపత్రులలో డ్యూటీలు చేసేవాళ్ళయితే ఇంటికి వెళ్ళగానే పిల్లల్ని ఎత్తుకోవద్దు. ఆ బట్టల్ని తీసేసి స్నానం చేసి పిల్లల దగ్గరకు వెళితే మంచిది. అప్పుడు కూడా మాస్కులు, శానిటైజర్ల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే. ఇప్పుడు రోజూ మా ఆసుపత్రిలో చూస్తున్నాను పిల్లలకు కరోనా రావటం. చాలా బాధగా ఉంటుంది వాళ్లనలా చూసినప్పుడు. పెద్దవాళ్ళు క్వారంటైన్లో ఉండడం వేరు పిల్లల్ని హోం కార్వరంటైన్లో ఉంచడం చాలా కష్టం. అందువలన కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి. పసిపిల్లల్ని ఎవరైనా ముద్దాడుతుంటారు. ఈ సమయంలో అలాంటి వాటికి తావివ్వవద్దు. మన పిల్లల్ని మనం కూడా ఇంట్లో ముద్దాడవద్దు. పిల్లల్ని వేరే పిల్లలతో కలిసి ఆడుకోనివ్వకూడదు. బయటకు తీసుకెళ్లకూడదు. పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని పెద్దవాళ్ళు కూడా వారితో ఆటలు, పాటలు, బొమ్మలు ఏమైనా చేయించి జాగ్రత్తగా ఉంచండి.
పల్లీలతో...
గతంలో నేను పల్లీ తొక్కతో బొమ్మలు చేశాను. ఈసారి మూడు విత్తుల పల్లీలను మా పేషెంట్ తెచ్చిచ్చాడు. వెంటనే దాన్ని చేద్దామని కూర్చున్నా. మూడు విత్తుల పల్లీలతో ఆడపిల్ల బొమ్మను చేద్దా మనుకున్నా. దీంట్లో కొంత పల్లీ తొక్కను కూడా వాడాను. ఇవి భూమి లోపల పండే పంట. అలాగని వేర్లకు కాసే దుంపల్లాగా కాదు. దీని పువ్వులు నేల పైననే పూస్తాయి. ఆ తర్వాత నేల లోపలికి వెళతాయి. అప్పుడు కాయలు కాస్తాయి. వీటిని ప్రధానంగా నూనె కోసం పెంచుతారు. పల్లీలు చాలా బలవర్ధకమైన ఆహారం. ఇది ఉష్ణమండల నేలలలో బాగా పెరుగుతుంది. భారతదేశం అంతటా కూడా పెరిగేపంట. దీని శాస్త్రీయనామం ''అరాఖిస్ హైపోజియా''. వీటి పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. కాయల్లో ఒకటి నుంచి నాలుగు గింజల వరకు ఉంటాయి. ఆంధ్రరాష్ట్రంలో ప్రధాన నూనె పంట అయిన పల్లీలతో అమ్మాయిని తయారు చేశాను. మధ్యలో కొన్ని సపోటా గింజల్ని వాడాను. బాలికా సంరక్షణ కొరకు, ఆడపిల్ల అనగానే అబార్షన్ వైపు మళ్ళకుండా ఉండేందుకు ఆడపిల్లల బొమ్మల్ని చేస్తున్నాను. 'సేవ్ గర్ల్ చైల్డ్' పేరుతో ఇది వరకు చేశాను. ఈ అందాల బాల నచ్చిందా! మీరూ ప్రయత్నించండి.
వెంటిలేటర్ వేస్టుతో...
కరోనా కారణంగా ఆసుపత్రులలో ఉండే వెంటిలేటర్ మిషన్లు, పల్స్ ఆక్సీమీటర్లు, సిటి స్కాన్లు ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళాయి. వీటిపై అవగాహన బాగా పెరిగింది. ఇప్పుడు ఈ పదాలు తెలియని పల్లెటూరి వారు కూడా లేరు. సరే... ఇందులో ఉండే ప్లాస్టిక్ మూతలతో నేను బొమ్మ చేయదలుచుకున్నాను. ప్రస్తుతం ఎలాగూ ఆడపిల్లల విషయం గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఈ ప్లాస్టిక్ క్యాప్లతో కూడా అందమైన ఆడపిల్లను తయారు చేసుకుందాం. నేను ఆసుపత్రి వ్యర్థాలతో, చాక్లెట్ కాగితాలతో ఆడపిల్లల్ని తయారు చేశాను. ఈ ప్లాస్టిక్ మూతలు కేవలం తెలుపు రంగులో మాత్రమే ఉంటాయి. చాలా పెద్దగా చేద్దామని ఈ అమ్మాయిని నేల మీదే వేశాను. ప్లాస్టిక్ మూతల్ని చాలా కాలం నుంచి దాచిపెడుతున్నాను. వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్లకు పెట్టే పైపులకు ఈ ప్లాస్టిక మూతలు ఉంటాయి. ఒక బొమ్మ తయారుకావాలంటే సంవత్సరాల టైం పడుతుంది. ఆడపిల్ల అని అబార్షన్ చేయించుకోవద్దు. అమ్మాయిని, అబ్బాయిని సమానంగా చూడండి.
పాపడాలతో...
పూర్వ కాలంలో ఎండా కాలంలో వచ్చిందంటే చాలు ఇళ్ళలో వడియాలు పెట్టేవాళ్ళు. అవి కాకులు తినకుండా ఎవరో ఒకరు కర్ర పట్టుకొని కాపలా ఉండేవాళ్ళు. మంచాల మీద ఆరుబయట గానీ, డాబా మీద గానీ తెల్లటి బట్టవేసి దానిపై వడియాలు పెట్టే దృశ్యాలు ఇప్పుడు సినిమా ల్లోనే కనిపిస్తున్నాయి. బయట సూపర్ మార్కెట్లలో రంగుల్లో, భిన్న ఆకృతుల్లో, విభిన్న పదార్థాలతో విరివిగా దొరుకుతున్నాయి. నేను కూడా ఈ ఎండాకాలంలో రకరకాల వడియాలు తెచ్చుకున్నాను. తీరా వేయించబోయే సరికి నాకందులో రకరకాల బొమ్మలు కన్పించసాగాయి. అందుకే అమ్మాయిలు, చిలకలు, నెక్లెస్‌లు ఎన్నో తయారు చేశాను. ప్రస్తుతం ఆటీన్ షేపులో ఉన్న వడియాలతో అమ్మాయిని తయారు చేశాను. ఈరోజేమిటఅ అందరూ అమ్మాయిలే వస్తున్నారు. ఆడపిల్లలు తక్కువ కాదు ఎవరికీ. ఆకాశంలో సగం దాకా అవకాశమివ్వాలి. ఆడపిల్లలు కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్దినియోగం చేసుకోవాలి. ఈ అమ్మాయి గంపలో సామాన్లు పెట్టుకొని ఇంటింటికీ తిరిగి అమ్ముకునే బాలిక. బాలకార్మికురాలైన బాలిక.
స్పాంజి ముక్కలతో...
స్కూళ్ళలో బోర్డులు తుడవటానికి డస్టర్లు అనేవి ఉండేవి మా చిన్నప్పుడు. ఆ తర్వాత డస్టర్లుగా స్పాంజి ముక్కలు వచ్చాయి మా పిల్లల చిన్నప్పుడు. ఇప్పుడసలు బోర్డులే లేవు ఇక డస్టర్లు ఎలా వస్తాయి. ఈ జనరేషన్‌కి ఇది కొత్త పదమే కావచ్చు. మరీ ఈ కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులతో స్కూలు, బ్లాక్ బోర్డు, చాక్‌పీసులు, యూనిఫామ్‌లు, బూట్లు, టై, బ్యాగులు అన్నీ పోయాయి. అలాంటి స్పాంజి ముక్కలతో ఇద్దరమ్మాయిలను చేశాను. పసుపు, పింక్ రంగు శరీరంతో అమ్మాయిలు అందంగా ఉన్నారు. అల్ల నేరుడు పళ్ళ లాంటి కండ్లతో, కోల ముక్కుతో, దొండ పండు పెదవులతో అందంగా ముద్దుగా ఉన్నారు. చెమ్కీల డ్రెస్సులతో మెరిసిపోతున్నారు. వీళ్ళు కొద్దిగా కొంటె పిల్లలు. తలలు చక్కగా దువ్వుకోలేదు. ఆఫ్కోర్స్ ఇప్పటి ఫ్యాషన కూడా ఇదేనేమో!
ప్లాస్టిక్ స్పూన్లు, వాటర్ యాంపుల్స్తో...
వరసగా అమ్మాయిలే వస్తున్నారని వీళ్ళనీ అమ్మాయిలుగానే మార్చేశాను. కాకపోతే వీళ్ళని బుట్టబొమ్మలుగా తీర్చిదిద్దాను. మరి ఈ బుట్టబొమ్మల పావడాలు దేనితో కుట్టాననుకుంటున్నారు. చాక్లెట్ కాగితాలతో కుట్టాను. ఈ మధ్య స్కూళ్ళలో ఫ్యాన్సీ డ్రస్సుల పేరుతో క్యారీబ్యాగులు, న్యూస్ పేపర్లతో డ్రెస్సులు వేసుకుంటున్నారు. మరి మా పాపలు తక్కువా. టానిక్ సాసీల్లోని స్పూన్లతో ముఖాలు చేసి, వాటర్ యాంపుల్స్తో చేతులు, శరీరం రూపొందించాను. ఇప్పుడు వీళ్ళకి చాక్లెట్ కాగితాలతో లాంగ్‌ఫ్రాక్ కుట్టేశాను. ముఖానికి ఫౌండేషన్, పౌడర్, కాజల్, స్టిక్కర్ అన్నీ పెట్టుకొని మేకప్ వేసుకున్నారు. మస్కారా, లిప్‌స్టిక్ కూడా వేసుకున్నారు. ఎలా ఉన్నారీ అందమైన బాలలు. నల్లని ఊలు దారాల జుట్టును కూడా పెట్టుకున్నారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్