Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యం మనం ఉపయోగించే కంప్యూటర్ల వల్ల విచిత్రమైన వ్యాధులు కొనితెచ్చుకోవాల్సి వస్తోంది. కంప్యూటర్ల వాడకం పెరుగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కంప్యూటర్ స్క్రీన్‌ను తదేకంగా చూడటం వల్ల కండ్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే కంప్యూటర్ స్క్రీన్ కండ్లను ప్రభావితం చేస్తుంది. దీంతో కండ్లలో నీరు ఇంకిపోవడంతో కొన్ని సమయాలలో, తల తిరిగినట్టు అనిపించడం, తల నొప్పి వస్తుంటాయి. మరి వీటి నుండి కాపాడుకోవడం ఎలాగో.. నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం....
యూనివర్సిటీ ఆఫ్ అయోవా హాస్పిటల్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కంప్యూటర్ ఉపయోగిస్తున్నప్పుడు మనిషి 66 శాతం తక్కువగా కండ్లు ఆర్పుతున్నాడని, దీంతో కండ్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని స్పష్టమైంది. సాధారణంగా కండ్లు బ్లింక్ చేయడం ఎంతో ముఖ్యం. నిమిషానికి కంటి రెప్పలు 18 సార్లు కొట్టుకుంటాయి. దాని వల్ల కంటిలో ఉండే పలుచని పొరలా ఉన్న ద్రవం మన కంటి గుడ్డుకు కంటి రెప్పలకూ మధ్య లూబ్రికెంట్ అవుతూ ఉంటుంది. అయితే మనం కంప్యూటర్ను తదేకంగా చూస్తున్నప్పుడు 8-10 సార్లు మాత్రమే కంటి రెప్పలు కొట్టుకుంటాయని, దీనివల్ల కంటిలోని నీరు ఇంకిపోయి కండ్లు పొడిబారతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ఒత్తిడిని తగ్గించుకోండి
కంపూటర్లను ఉపయోగించేవారు స్క్రీన్కు కనీసం 25 అంగుళాల దూరం నుంచి చూడడం అలవాటు చేసుకోవాలి. మానిటర్ మధ్యభాగం కండ్లతో పోల్చినప్పుడు 4 నుంచి 6 అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పి ఉంచుతాయి. అంతేకాక 20-20-20 సూత్రాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ స్క్రీన్ నుంచి దష్టి మరల్చి, కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుల వైపు 20 సెకన్లపాటు దష్టి సారించాలి. దీన్ని 20-20-20గా గుర్తు ఉంచుకొని సాధన చేయాలి. దాంతో కండ్లపై వుండే ఒత్తిడి తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు వంటివాటిని ఎక్కువగా వాడడం వల్ల వాటినుండి వచ్చే రేడియేషన్ ప్రభావం తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. దీనివల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (సివిఎస్), రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీ (ఆర్ఎస్ఐ), టొయస్ట్ స్కిన్ సిండ్రోమ్, టెక్నోస్ట్రెస్ వంటి వ్యాధులకు గురవుతారు. శరీర భాగాలపై నిరంతర ఒత్తిడి అనేది ఆర్ఎస్ఐకి దారితీసే కారణాల్లో అతి ముఖ్యమైనది.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వల్ల
కండ్ల అలసటగా ఉండటం, మాసకబారడం, పొడి బారడం, తలనొప్పితో ఇబ్బంది పడటం, భుజాలు, మెడ నొప్పులు రావడం. ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్ఎస్ఐ అంటారు. ఉదాహరణకి కంప్యూటర్ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సిటిఎస్ (కార్పల్ టన్నెల్ సిండ్రోమ్) అనేది ఒక రకమైన ఆర్ఎస్ఐ. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను సిటిఎస్ అంటారు.
అదేపనిగా పనిస్తుంటే
దక్షిణాసియా దేశాలతో పోల్చితే కంప్యూటర్ల వాడకం ఎక్కువగా ఉన్న యురోపియన్ దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వున్నట్టు అంచనా. కేవలం చేతులకే కాక శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆర్ఎస్ఐ ఎందుకు వస్తుంది? అనే దానిపై జరిగిన ఓ సర్వేలో ఎడతెరిపిలేకుండా టైప్ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని ఉండటం, కాళ్ళ కింద ఫుట్ రెస్ట్ లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం వల్ల అని తేలింది.
సీవీఎస్
ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. కండ్లు పొడిబారడం, నొప్పిగా, దురదగా అనిపించడం దీని లక్షణం. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు అమెరికాలో జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కండ్లమంట, కండ్లలో తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కండ్లు మసకబారడం వంటివి ఈ సీవీఎస్ లక్షణాలు. ఈ సమస్యకు కంప్యూటర్ మోనిటర్ నుండి జనించే రేడియేషన్ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టెక్నోస్ట్రెస్
దీనివల్ల కంప్యూటర్ ప్రొఫెషనల్స్‌లో ఒకరకమైన టెన్షన్, అసహనం, ఇతరులపై సానుభూతి లోపించడం, భావోద్వేగాలకు లోనుకాకపోవడం, మెషీన్లా పనిచేయడం వంటి లక్షణాలు గోచరిస్తాయి. నిరంతరం కంప్యూటర్లతో కలిసి వుండడం వల్ల మనుషుల్లో కూడా యాంత్రిక ధోరణి గూడు కట్టుకుంటోందని, దీనివల్ల అడిగినదానికి వెంటనే జవాబివ్వడం, చాలా అలెర్ట్‌గా వుండడం, భావోద్వేగాలకు లోనుకాకపోవడం, ఎంతో సమయం పట్టేపనిని కొద్ది సెకన్లలోనే పూర్తి చేయాలనుకోవడం వంటి లక్షణాలు కంప్యూటర్ ప్రొఫెషనల్స్‌లో కొట్టవచ్చినట్టు కనబడతాయని, దీని వల్ల మనుషుల్లో యాంత్రికత చోటుచేసుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.
టొయస్ట్ స్కిన్ సిండ్రోమ్
ఇదొక చర్మవ్యాధి. ముఖ్యంగా ల్యాప్‌టాప్ వాడేవారికి 'టొయస్ట్ స్కిన్ సిండ్రోమ్' సోకే ప్రమాదం ఉంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్' అధ్యయనంలో తేలిందని టెలిగ్రాఫ్ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్ నుంచి 125 ఫారిన్‌హీట్ (52 సెంటీగ్రేడ్) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్ బసెల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని ఈ సర్వే ద్వారా స్పష్టమైందని పరిశోధకులు పేర్కొన్నారు.