Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాపారం చేయడం ఆమె కల... మహిళా సాధికారత ఆమె లక్ష్యం... తన సొంత కాళ్ళపై నిలబడుతూ నలుగురికి ఉపాధి కల్పించాలని చిన్నతనం నుండే కలలు కన్నారు. ఆ కలను నిజం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేశారు. చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి లాండ్రీ స్పా ప్రారంభించారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని వ్యాపారంలో ముందుకు సాగుతున్నారు. 'ఏంటీ బట్టులు ఉతికే పని చేస్తున్నావా' అని ఒకప్పుడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపోయేలా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఎంచుకున్న రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. ఆమె ప్రతిభా వనంబతిన. హైదరాబాద్ మహానగరంలో లాండ్రీ స్పా ప్రారంభించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో తెలుసుకుందాం...
ప్రతిభ పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా విజయవాడలో. అక్కడే ఎమ్మెస్సీ చేసిన ఈమె పదిహేనేండ్లపాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఈమెకు ముగ్గురు పిల్లలు. కుటుంబ కారణాల రిత్యా 2013లో హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించారు. అయితే చిన్నప్పటి నుండి వ్యాపారం చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఆర్థికంగా తన సొంత కాళ్ళపై తాను నిలబడటమే కాదు... మహిళలకు తన ద్వారా ఉపాధి కల్పించాలని ఎప్పుడూ కలలు కనేవారు. అయితే పిల్లలు చిన్నగా ఉండడం వల్ల మొదట్లో వ్యాపారం చేయడం కుదరక ఉపాధ్యాయినిగానే కొనసాగారు. అయినా మహిళా సాధికారత గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు.
స్నేహితురాలి సలహాతో...
పిల్లలు కాస్త ఎదిగిన తర్వాత ఏం వ్యాపారం చేయాలనే ఆలోచనలో పడ్డారు. ఈమెకు వంటలు చేయడమంటే ఇస్టం. కాబట్టి దాన్నే వ్యాపారం చేయాలనుకున్నారు. అయితే అది చెఫ్‌లపై ఆధారపడి చేయాల్సిన పని. వాళ్ళు రాకపోతే కష్టం. అందుకే దాన్ని వదిలేశారు. అలాంటి సమయంలోనే గీత అనే తన స్నేహితురాలు ఇచ్చిన సలహా లాండ్రీ సర్వీసెస్ ప్రారంభించమని. దానికి కావల్సిన పెట్టుబడికి కూడా ఆమె సహకరిస్తానన్నది. ఇక ఆమె ఇచ్చిన ధైర్యంతో ప్రతిభ అడుగులు ముందుకు వేశారు.
నాకు నమ్మకం ఉంది
'ఎమ్మెస్సీ చదివిన నువ్వు బట్టలు ఉతికే పని చేస్తావా' అంటూ చాలా మంది ఎగతాళి చేశారు. 'మన సమాజంలో బట్టలు ఉతికే వాళ్ళంటే చాలా చులకన భావం ఉంది. కానీ చేస్తున్న పనిపై నాకు గౌరవం ఉంది. నేను ఎలాంటి తప్పుచేడయం లేదు అనే నమ్మకం ఉంది. అందుకే వాళ్ళ మాటలను నేను పట్టించుకోకుండా ముందుకే వెళ్ళాను'' అంటున్నారు ప్రతిభ.
మొదటి ఎదురుదెబ్బ
లాండ్రీ బిజినెస్‌నే ప్రారంభించాలని నిర్ణయించుకున్న ప్రతిభ స్నేహితురాలి సాయంతో పాటు కొంత బ్యాంక్ రుణం తీసుకుని మొత్తం పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి లాండ్రీ స్పా సేవల్ని ఫ్రాంచైజీ తీసుకున్నారు. అయితే ఆ సంస్థ డబ్బులైతే కట్టించుకుంది కానీ మార్కెటింగ్ సాయం చేయలేదు. దాంతో ఆమె అక్కడ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. మూడు నెలలకే వారి నుండి బయటకు వచ్చేశారు. ఇది ఆమెకు తగిలిన మొదటి ఎదురుదెబ్బ. అయినా వారు సహకరించలేదని ఆమె కుంగిపోలేదు. వెనకడుగు వేయలేదు. తనే సొంతంగా ఓ పేరుతో వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ కొంత లోన్ తీసుకుని హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో 'లాండ్రీస్పా' పేరుతో 2016లో ఓ సంస్థను ప్రారంభించారు.
అంచలంచలుగా ఎదుగుతూ...
ఇప్పుడు ఆమె వ్యాపారం చేయాలనే కలను నిజం చేసుకున్నారు. అంతేకాదు మహిళాసాధికారతకు నిజమైన అర్థం చెబుతున్నారు. 25 మంది మహిళలకు తన వద్ద ఉపాధి కల్పిస్తున్నారు. 2018లో విజయవాడ లబ్బీపేటలో కూడా తన బ్రాంచ్ ఓపెన్ చేశారు. 2019లో హైదరాబాద్‌లోనే కొత్తపేట్, మాదాపూర్‌లో బ్రాంచ్‌లు ప్రారంభించారు. ఇలా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు.
అందరిలా కాకుండా...
ఆమె తన వ్యాపారంలో తనదైన ప్రత్యేకను చూపిస్తున్నారు. సాధారణంగా లాండ్రీ సరీస్వసింగ్ అంటే లాండ్రీ, డ్రై క్లీనింగ్ మాత్రమే ఉంటాయి. కానీ ఈమె మాత్రం ఏడాదికి ఓ సర్విస్‌ను తన వినియోగదారులకు అందిస్తున్నారు. డోర్‌మ్యాట్స్ నుండి మొదలుకొని డోర్ కటన్స్, కార్పెట్స్, షూ, లెదర్, బొమ్మలు, ఆల్ట్రేషన్ ఇలా ప్రతి వస్తువును వీరు క్లీన్ చేసి ఇస్తారు. అంతే కాకుండా ఇటీవలనే డయింగ్, ప్రింటింగ్ కూడా మొదలుపెట్టారు. మార్కెటింగ్‌పై పెద్దగా అవగాహన లేని ఆమె తన క్వాలిటీ సేవలతో వినియోగదారులకు దగ్గరయ్యారు. కష్టమర్ల బట్టలను శుభ్రం చేసి ప్యాక్ చేసి పంపించే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు ఇంటికే వచ్చి దుస్తులు సేకరించి మళ్ళీ ఇంటికే అందిస్తారు. లాక్డౌన్ సమయంలో కూడా తన వద్ద పని చేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించి మానవత్వాన్ని చాటుకున్నారు ప్రతిభ.
కెమికల్స్ అవసరం లేదు
''ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఎక్కువమంది ఇండ్లల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా హోం ఐసొలేషన్‌లో ఉండేవాళ్ళు తమ బట్టలను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. బయట నుంచి వచ్చిన వెంటనే వాటిని వేడి నీళ్ళలో ముంచి మనం ఇంట్లో వాడే సర్ఫ్‌తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వైరస్‌ను చంపేయవచ్చు. దీని కోసం ప్రత్యేక కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు'' అంటున్నారు ప్రతిభ.
-మహిళలకు ప్రోత్సాహం లేదు
నేను చేస్తున్న వ్యాపారంలో మహిళలకు అస్సలు ప్రోత్సాహం లేదు. దీనికి సంబంధించి కొన్ని సంఘాలు ఉన్నాయి. కానీ మహిళలను గుర్తించరు. అందుకే గుర్తింపు లేని చోట ఎందుకు అని ఆ సంఘాల జోలికి పోను. నా స్నేహితురాలి గీతతో కలిసి నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. 20 మంది మహిళకు ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం అందరూ బిజీ జీవితం గడుపుతున్నారు. లాండ్రీ అవసరం అందరికీ వుంది. కాబట్టి ఇది మంచి బిజినెస్‌గా నేను భావిస్తున్నాను.
అసలైన మహిళా సాధికారత
మహిళలకు ఉపాధి కల్పించడానికే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అందులోనూ ముఖ్యంగా వెనకబడిన తరగతుల వారికి సహకరిస్తాను. ఎందుకంటే వాళ్ళు బయటకు రావడానికి భయపడతారు. అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వారికి సపోర్ట్ చేస్తే అసలైన మహిళా సాధికారత సాధించగలమని నా నమ్మకం. ఏ వ్యాపారంలైనా సమస్యలు వస్తాయి. అయితే ఆగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. పట్టుదలతో మన కష్టాన్ని నమ్ముకుని పని చేయాలి.
- సలీమ