Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీమల్ని తరిమేసేందుకు చీమల మందు ఉంటుంది. దాన్ని వాడితే అవి చచ్చిపోతాయి. పైగా ఆ మందు మనకు హాని చేస్తుంది. అందువల్ల చీమలు చావకుండా వెళ్లిపోయే టిప్స్ పాటించాలి. ఇళ్లలో మనం వదిలేసే ఆహారం, కింద పడే గింజలు ఇతరత్రా వాటి నుంచి వచ్చే వాసనను చీమలు పసిగడతాయి. టీ పెడుతూ... పంచదార వేస్తున్నప్పుడు కొద్దిగా కింద పడితే ఆ వాసన చీమలకు చేరుతుంది. దాంతో పంచదార పలుకులు పట్టుకెళ్దామని వస్తాయి. అలా వచ్చిన చీమల్ని చంపడం మంచిది కాదు. ఎందుకంటే... అవి మన పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. ఈ భూమిపై చీమలే లేకపోతే చాలా రకాల చెట్లు పెరగవు. వాటి వేర్లు నేలలోకి బాగా వెళ్లేలా చీమలు చేస్తాయి. కాబట్టి చీమల్ని చంపకుండానే బయటకు పంపేసే టిప్స్ మనం పాటించాలి.
క ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే... చీమల మందు వాడటం ప్రమాదకరం. ఎందుకంటే... ఆ వాసనకు పిల్లలు వాంతులు చేసుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమలు వచ్చే చోట తినే సోడాను చల్లవచ్చు. ఇంట్లో మిగిలిన చెత్తను పారేసే డస్ట్ బిన్ చుట్టూ కూడా బేకింగ్ సోడా చల్లితే చీమలు రావు.
- దాల్చిన చెక్క వాసన మనకు నచ్చుతుంది... చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి దాల్చిన చెక్క పొడిని చీమలు వచ్చే కన్నాల దగ్గర వేస్తే ఇక అవి వేరే దారి చూసుకుంటాయి. లేదంటే దాల్చిన చెక్క ఆయిల్ బాటిల్ కొని నీటిలో కొన్ని చుక్కలు కలిపి చీమలు వచ్చే చోట ఆ నీటిని చల్లినా చాలు. చీమలు ఇక రావు. అలాగే కిటికీలు, తలుపుల మూలల్లో దాల్చిన చెక్కను ఉంచితే చీమలు, ఇతర పురుగులు రావు.
- వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. చీమల్ని తరిమేసేందుకు ఇది సరైన ఆలోచన. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి... ఆ నీటిని చీమల పుట్టపై స్ప్రే చెయ్యాలి. అంతే... చీమలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇక మళ్లీ అక్కడికి రావు. కిటికీలు, తలుపులపైనా స్ప్రే చేస్తే మంచిదే. మీరు స్ప్రే చేసిన తర్వాత కూడా చీమలు ఉంటే... మరింత స్ప్రే చెయ్యాల్సి ఉంటుంది.
- బొరాక్స్ను సోడియం టెట్రాబొరేట్ అని కూడా అంటారు. దీన్ని క్లీనింగ్ చెయ్యడానికీ, పురుగుల్ని తరిమెయ్యడానికీ వాడుతారు. ఇది మీకు మందుల షాపుల్లో, కొన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దాన్ని తెచ్చి గోరు వెచ్చట నీటిలో 2 టేబుల్ స్పూన్లు కలిపి కొద్దిగా పంచదార కూడా వేసి మిక్స్ చేసి... పురుగులు, చీమలు ఉన్న చోట చల్లితే అవి వెళ్లిపోతాయి. బొరాక్స్ కలిపిన నీటిలో దూది ముద్దల్ని ముంచి కిటికీలు, తలుపుల దగ్గర, చీమలు వచ్చే ఏరియాల్లో ఉంచితే ఇక అవి అటు రావు. అయితే బొరాక్స్ వల్ల చీమలు చచ్చిపోతాయి. కాబట్టి... పై టిప్స్ వల్ల చీమలు తగ్గకపోతే అప్పుడు మాత్రమే బొరాక్స్ వాడటం మేలు.