Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం రకరకాల జీన్స్, షర్ట్స్‌ని కొనుగోలు చేస్తూ ఉంటాం. మార్కెట్లో కొత్త కొత్త ట్రెండ్స్ కూడా వస్తున్నాయి. అయితే మనం పాత వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. మీరు కూడా మీ పాత మోడల్ జీన్స్‌ను పక్కన పెట్టేశారు...? అయితే కొన్ని ఆలోచనలతో ఆ పాత వాటితో కొన్ని వస్తువులు తయారుచేసుకోవచ్చు. చూడడానికి కొత్త ఫ్యాషన్లాగా ఉంటాయి. వీటితో హాండ్ బ్యాగులు, డెనిమ్ పౌచెస్ ఇలా ఎన్నో రకాలు మనం తయారు చేసుకోవచ్చు. అలాంటి కొన్ని ఈ రోజు మనమూ నేర్చుకుందాం...
మనం ఈ పాత జీన్స్‌తో వాల్ హ్యాంగింగ్స్ లాంటి వాటిని తయారు చేయొచ్చు. ప్రస్తుత రోజుల్లో ఇవి చాలా ట్రెండీగా ఉంటున్నాయి. ఇక మనమే స్వయంగా తయారు చేసి వీటిని ఇంట్లో ఉపయోగిస్తే ఇంటికి ఎవరైనా వచ్చినా ఆశ్చర్యపోతారు. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటువంటి హ్యాంగింగ్స్ని ఇంట్లో చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. పొడుగ్గా ఉండే వాటిని 20 నుంచి 30 పొడవుతో వుండే వాటిని చెక్క హ్యాంగర్‌తో చేయొచ్చు. చతురస్రాకారంలో కట్ చేసి క్రియేటివిటీగా మంచి డిజైన్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి గోడ మీద పెడితే ఎంతో బాగుంటాయి.
డెనిమ్ చోకర్
పాత జీన్స్‌తో ఎంతో ఈజీగా చోకేర్ వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. డెనిమ్ ప్యాంట్ తాలూకా రెండు చివర్ల బటన్ పెట్టి, ఎలాస్టిక్ పెట్టి, డెనిమ్‌తో చోకర్‌ని తయారు చేయొచ్చు. దీన్ని తయారు చేయడం చాలా తేలిక. కావాలంటే దీనిలో స్టోన్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే పెయింట్ కూడా వేసుకోవచ్చు. ఎలా తయారు చేసినా చాలా అందంగా ఉంటాయి. పెయింట్ వేయాలంటే జిగ్ జాగ్లో తెల్ల కలర్‌తో వేస్తే బాగుంటుంది.
లెనిన్ స్కరుంచిస్
ఇది కూడా చాలా ఫ్యాషన్‌గా ఉంటుంది. పైగా ఇవి ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తాయి. వీటిలో చాలా రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీన్ని తయారు చేయడం కోసం జీన్స్‌ని రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి సైడ్‌ని ముడివేయాలి. సేఫ్టీ పిన్స్ లేదా ఎలాస్టిక్ సహాయంతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మీ జుట్టును మొత్తం పట్టుకుంటుంది. పైగా దీంతో మీరు ఎంతో కొత్తగా, ఫ్యాషన్‌బుల్‌గా తయారు కావొచ్చు.
డిన్నర్ ప్లేస్‌మెంట్స్
డిన్నర్ ప్లేస్మెంట్స్గా కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. దీనికోసం మీరు పాత జీన్స్‌ని ఓపెన్ చేసి కట్ చేయాలి. తర్వాత జీన్స్ చివర్లు కూడా కత్తిరించాలి. ఇలా మీరు మీ డైనింగ్ టేబుల్ మీద ప్లేస్మెంట్ కింద ఉపయోగించవచ్చు. జీన్స్ తాలూక పాకెట్ మీకు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. మీరు పాకెట్ని ఒక సైడ్ కుట్టేస్తే సరిపోతుంది. ఇలా ఈజీగా దీన్ని మీరు తయారుచేసుకోవచ్చు. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా తయారు చేసి ఉపయోగించుకోవచ్చు. రోజువారీ టేబుల్ మీద దీన్ని ఉపయోగించుకుంటే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటికి ఎవరు వచ్చిన వారు మీ క్రియేటివిటీకి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.
లాంప్ షేడ్
దీని కోసం మీరు జీన్స్ది ఒక కాలుని కట్ చేయాలి. దీనిలో రెసిన్ వేసి ఎండలో ఒక రోజు ఆరబెట్టాలి. అయితే ఎండపెట్టినప్పుడు దీన్ని గుండ్రంగా ఆరబెట్టాలి. దాని సైజు అంత ప్లాస్టిక్ జార్లు తీసుకుని లోపల పెట్టండి. ఒకసారి అది ఆరిన తర్వాత మీకు గుండ్రంగా సర్క్యులర్ బేస్ వస్తుంది. దీనిని మీరు లాంప్ షేడ్ కింద ఉపయోగించవచ్చు. దీనిలో మీరు ఎలక్ట్రికల్ సామాన్లు పెట్టేసి సీలింగ్ నుండి వేలాడతీయచ్చు. లేదంటే మీకు నచ్చిన చోట దీన్ని పెట్టుకోవచ్చు.
చూశారుగా... మనం వాడి పారేసే జీన్స్‌తో ఎన్ని రకాల వస్తువులు తయారు చేసుకోవచ్చో. ఇంకా ఎన్నో అందమైన వస్తువులను వీటితో తయారు చేసుకుని ఇంటిని మరింత అందంగా మార్చుకోవచ్చు. పడేసే వాటితో వీటిని తయారు చేశాము కాబట్టి ఖర్చు కూడా ఉండదు. పైగా చూడటానికి వెరైటీగా, కొత్తగా కూడా కనిపిస్తాయి. మనం కావాలంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఎన్నో వేస్ట్ సామన్లతో పనికొచ్చే ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎక్కువగా వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కప్స్ లాంటివి ఉంటాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో మొక్కలు నాటొచ్చు. ఆ వాటర్ బాటిల్స్ పైన పెయింట్ వేస్తే మరింత అందంగా ఉంటుంది. అదే విధంగా చాలా మంది పాత టైర్లను కూడా ఉపయోగిస్తున్నారు. పాత టైర్లకి మంచిగా పెయింట్ వేసి వాటిని గార్డెన్లో పెట్టుకుంటే గార్డెన్ ఎంతో అందంగా కనబడుతుంది. ఇలా మీకు నచ్చినట్టుగా.. మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా.. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా.. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.