Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరైన ఆహారం తీసుకుంటే మన మనసు, శరీరం, మెదడు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలు నోటికి బాగుంటాయి గానీ... క్రమంగా అవి మనకు తీరని నష్టం చేస్తాయి. అందుకే వైద్య నిపుణులు ప్రత్యేకమైన కొన్ని ఆహారాలకు దూరంగా ఉండమని చెబుతున్నారు. వాటిని తీసుకుంటే లేని పోని టెన్షన్లు, ఒత్తిళ్లూ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకొని ఇప్పటి నుంచైనా వాటిని దూరం పెడితే సరి.
- కేకుల్ని చూస్తే తినకుండా ఉండలేము. వాటి రుచి, ఆకారం, వాటిపై ఉండే క్రీమ్ అన్నీ కూడా తిను తిను ఊరిస్తాయి. కానీ అవే కేకుల్లో విపరీతంగా పంచదార కలుపుతారు. అందువల్ల అవి నోటికి నచ్చుతాయి గానీ బాడీకి ప్రమాదకరం. మనకు తెలియకుండానే షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలా జరిగితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో డయాబెటిస్ పేషెంట్లకు తెలుసు. వాళ్లను అడిగితే చెబుతారు వాటిని తినవద్దని. వీలైనంతవరకూ కేకులు, కుకీలు, పాస్ట్రీలకు దూరంగా ఉండటం మేలు.
- కూల్ డ్రింక్స్... ఇది వరకు వేసవిలోనే ఎక్కువగా తాగేవారు. ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వాడేస్తున్నారు. అలా వాటికి అలవాటు పడిపోతున్నారు చాలా మంది. సూపర్ మార్కెట్లలో లీటర్, 2 లీటర్ల బాటిల్స్ ఆఫర్లలో లభిస్తుంటే... తప్పనిసరిగా వాటిని కొంటున్నారు ప్రజలు. కానీ వాటిలో ఉన్నదంతా కలర్స్, కెమికల్స్, పంచదారే. అంతెందుకు 100 పర్సెంట్ ఫ్రూట్ జ్యూస్ అంటారా... వాటిలో ఉండే ఫ్రూట్ జ్యూస్ నిజానికి 30 శాతానికి మించదు. మిగతా 70 శాతం పంచదార, కలర్సే. మీరు ఆ ప్యాకెట్లపై చిన్న అక్షరాల్లో ఉన్న ఇంగ్రేడియంట్స్ చదివితే ఈ విషయం తెలిసిపోతుంది. ఈ స్వీట్ డ్రింక్స్ మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెంచుతాయి. అంతేకాదు వీటిలో ఫైబర్ తక్కువ కాబట్టి అజీర్తి సమస్యలు వస్తాయి. చివరకు లేని పోని టెన్షన్లు మొదలవుతాయి.
- ప్రోటీన్స్ ఉండే ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని మనకు తెలుసు. కానీ మనం ఇష్టపడే చాలా రెస్టారెంట్లు అవి సెర్వ్ చేసే చాలా ఆహారాలు ఫ్రై చేసి, మాడ్చేసి ఇస్తుంటాయి. అలా చేస్తే ప్రోటీన్స్ ఉండవు సరికదా... అవి కాన్సర్ లాంటి రోగాలకు దారితీస్తాయి. అలాంటివి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మీలో ఆందోళన, టెన్షన్, ఏదో అయిపోతోందన్న ఫీలింగ్స్ కలిగిస్తాయి.
- కాఫీ లాంటివి ఓ స్థాయి వరకే అంటే రోజుకు ఒకటో, రెండో కప్పులు తాగాలి తప్ప రోజుకు నాలుగైదు తాగకూడదు. ఎందుకంటే వాటిలో కెఫైన్ అనే పదార్థం ఉంటుంది. అది ఓ రకమైన మత్తు పదార్థం లాంటిది. అది ఎంత డేంజరంటే కాఫీ తాగేవాళ్లకు మొదట్లో కాఫీ తాగాక... హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాతర్వాత అదే కాఫీ తాగకపోతే మైండ్‌లో ఏదో అయిపోతున్న ఫీల్ కలిగిస్తుంది. ఆ తలనొప్పి భరించలేక... కాఫీ తాగుతారు. మళ్లీ కెఫైన్ మెదడుకు వెళ్తుంది. ఇలా కెఫైన్ బాడీలో పెరిగే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. ఇది మనలో ఒత్తిడి, ఆదుర్తాను పెంచుతుంది.