Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటికి ఇంపైన రంగుతో వుండే కారెట్లు చూడగానే తినాలనిపిస్తాయి. పోషకాలు సమృద్ధిగా వుండే వారెట్ను నిత్య వంటకాల్లో వాడితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కారెట్ను కూరల్లో వేసుకోవడం, పచ్చివి తినడం అందరూ చేస్తూనే ఉంటారు. వాటితోపాటు కారెట్ జ్యూస్, హల్వా చేసుకుంటూనే ఉంటాము. అలాగే దీంతో చట్నీలు కూడా చేసుకోవచ్చు. కారెట్తో కొన్ని వెరైటీ చట్నీలు ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం...
కారెట్ - కొబ్బరితో...
కావల్సిన పదార్థాలు: కారెట్ తురుము - ఒకటిన్నర కప్పు, కొబ్బరి కోరు - ఒక కప్పు, పచ్చిమిర్చి - రెండు, టమాట - ఒకటి, ఎండుమిర్చి - రెండు, నూనె, ఉప్పు, కొత్తిమీర - సరిపడినంత, పోపు కోసం - మినపప్పు, ఆవాలు, ఇంగువ.
తయారు చేసే విధానం: ముందుగా బాణలీలో నూనె పోసి కారెట్కోరు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాట ముక్కలు వేసి వేయించి పక్కకు పెట్టకోవాలి. వేరే బాణలీ తీసుకుని నూనె పోసి మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు వేయించండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి వేయించిన కారెట్, టమాట ముక్కలు, కొబ్బరికోరు వేసి కొంచెం నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. బాణలీలో కొంచెం నూనె పోసి ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేయించి పచ్చడిలో వేయండి. పైన కొత్తిమీర చల్లండి.
స్పైసీ కారెట్ చట్నీ
కావల్సిన పదార్థాలు: కారెట్ తురుము - రెండు కప్పులు, శనగపప్పు - మూడు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - ఆరు, జీలకర్ర - టీస్పూను, వెల్లుల్లి - మూడు, చింతపండు - కొంచెం.
తయారు చేసే విధానం: బాణిలో నూనుపోసి ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర వేయించి పక్కకు తీయండి. అదే బాణిలో కొంచెం నూనెపోసి కారెట్ తురుము వేయించండి. మొదట శనగపప్పు, మిర్చి మెత్తగా గ్రైండ్ చేయండి. తర్వాత వెల్లుల్లి, ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చేసి కారెట్ తురుమువేసి ఒకసారి గ్రైండ్ చేయండి. చట్నీ రెడీ.
బాదం - కారెట్ చట్నీ
కావల్సిన పదార్థాలు: కారెట్ - అర కేజీ, ఎండు మిర్చి - 15 గ్రాములు, అల్లం - 30 గ్రాములు, వెల్లుల్లి - రెండు, బాదం - 10, కిస్మిస్ - 20 గ్రాములు, ఉప్పు - సరిపడినంత, పంచదార - కప్పు, యాలకుల పొడి - ముప్పావు టీస్పూను, వెనిగర్ - కప్పు, నీళ్ళు - కప్పు.
తయారు చేసే విధానం: కారెట్లు పీల్ చేసి తురమండి. అల్లం, వెల్లుల్లిని సన్నగా ముక్కలుగా కోయండి. బాణిలో నీళ్ళు పోసి కారెట్, అల్లం వెల్లుల్లి వేసి మెత్తగా నీళ్ళు ఇంకేవరకు వుడికించండి. వెనిగర్, పంచదార, ఉప్పు, బాదం, కిస్మిస్ వేసి ఉడికించండి. యాలకులపొడి వేసి చల్లారిన తర్వాత పొడి జార్లో పెట్టండి. రెండు రోజుల తర్వాత రోటీ, పూరీల్లోకి తింటే రుచిగా వుంటుంది.
కారెట్ చట్నీ
కావల్సిన పదార్థాలు: కారెట్ తురుము - రెండు కప్పులు, కొబ్బరికోరు - రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము - కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, నిమ్మరసం - టీస్పూను, ఉప్పు - సరిపడినంత - మిరియాలు - పావు స్పూను.
తయారుచేసే విధానం: మిరియాలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి, కారెట్ తురుము, కొబ్బరికోరు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. గిన్నెలోకి తీసి నిమ్మరసం వేసి బాగా కలపండి.